Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో మరోసారి ఘర్షణలు

బంగ్లాదేశ్‌లో మరోసారి ఘర్షణలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మద్దతుదారులకు, భద్రతాదళాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. ఉద్రిక్తతలు తీవ్రమవడంతో హసీనా నివాసం, అవామీ లీగ్‌ పార్టీకి బలమైన కోటగా ఉన్న గోపాల్‌గంజ్‌ జిల్లాలో భద్రతా దళాలు కర్ఫ్యూ విధించాయి.

వివరాల ప్రకారం.. గతేడాది ఆగస్టులో హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నేతృత్వం వహించిన విద్యార్థులు ఏర్పాటు చేసిన నూతన రాజకీయ పార్టీ నేషనల్‌ సిటిజన్‌ (ఎన్‌సి) తిరుగుబాటు జ్ఞాపకార్థం బుధవారం ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈర్యాలీ గోపాల్‌ గంజ్‌ జిల్లాకు చేరుకోగానే ఎన్‌సి కార్యకర్తల వాహనాలపై సాయుధులైన హసీనా మద్దతుదారులు దాడికి దిగారు. కార్యకర్తలను తీసుకువెళుతున్న సుమారు 20 వాహనాలపై కర్రలతో దాడి చేయడంతో పాటు వాటికి నిప్పటించారు. దీంతో వారు స్థానిక పోలీస్‌ చీఫ్‌ కార్యాలయంలో తలదాచుకున్నారు. అదే సమయంలో హసీనా మద్దతుదారులపై భద్రతాదళాలు విరుచుకుపడ్డాయి. ఈ ఘర్షణలో సుమారు నలుగురు మరణించినట్లు బంగ్లాదేశ్‌లోని పత్రిక డైలీ స్టార్‌ నివేదించింది.

దాడికి పాల్పడిన హసీనా మద్దతుదారులను విడిచిపెట్టబోమని మొహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. గోపాల్‌గంజ్‌లో జరిగిన హింసను ”పూర్తిగా సమర్థించలేనిది” అని అభివర్ణించింది. దాడికి కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని విద్యార్థి నేత నహీద్‌ ఇస్లాం అధికారులకు 24 గంటల అల్టిమేటం ఇచ్చాడు. హింసను నిరసిస్తూ ఫరీదాపూర్‌లో గురువారం ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

మాజీ ప్రధాని హసీనా రాజీనామా అనంతరం దేశంలో శాంతి భద్రతలను తీసుకువస్తామని యూనస్‌ ప్రభుత్వం ప్రకటించినప్పటికి.. పరిస్థితులు అదుపులోకి రాలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -