నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గ్రంథాలయ శాఖకు ప్రభుత్వం కొత్త భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించింది. అయితే లైబ్రరీయన్ పోస్టు ఖాళీగా ఉండగా.. పిట్లం మండల గ్రంథాలయ శాఖ పాలకులు రాజు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా సదురు అధికారి విధులకు హాజరుకావడంలో అలసత్వం వహిస్తున్నారని పాఠకులు వాపోతున్నారు. మద్నూర్ గ్రంథాలయ శాఖలో ఎప్పుడూ చూసినా ఖాళీ కుర్చీ దర్శనమిస్తోందన్నారు. దీంతో నవతెలంగాణ గురువారం గ్రంథాలయ శాఖను సందర్శించగా.. గ్రంథాలయ పాలకుని కూర్చి ఖాళీగానే దర్శనం ఇచ్చింది.
గ్రంథాలయంలో సదురు అధికారి పిట్లం నుంచి వస్తారని, వారంలో రెండు దినాలు మాత్రమే విధులకు హాజరువతారని తెలిపారు. ఈ విషయం గురించి గ్రంథాలయ పాలకుడు రాజుకు నవ తెలంగాణ ఫోన్ ద్వారా వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. ఇంచార్జీ పాలనలో గ్రంథాలయ శాఖ స్వీపర్ తోనే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క అధికారికి మూడు మండలాలు ఇన్చార్జిలుగా పెట్టడం ..గ్రంథాలయ పరివేక్షణలో అలసత్వం అలుముకుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి గ్రంథాలయానికి అదనపు సిబ్బందిని కేటాయించాలని పాఠకులు కోరుతున్నారు.