Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంరాబర్ట్‌ వాద్రాపై ఈడీ చార్జిషీట్‌

రాబర్ట్‌ వాద్రాపై ఈడీ చార్జిషీట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం చార్జిషీట్‌ నమోదు చేసింది. హర్యానాలోని షికోపూర్‌లో జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాబర్ట్‌వాద్రా, ఇతరుల పేరును చార్జిషీట్‌లో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద వాద్రా, మరికొందరిపై స్థానిక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. క్రిమినల్‌ కేసులో వాద్రాపై దర్యాప్తు సంస్థ ఫిర్యాదు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఈడీ వాద్రాను విచారించింది.

ఈ దర్యాప్తు హర్యానాలోని గురుగ్రామ్‌ జిల్లా మనేసర్‌-షికోపూర్‌ (ప్రస్తుతం సెక్టార్‌ 83)లో జరిగిన భూ ఒప్పందానికి సంబంధించినది. గతంలో వాద్రా డైరెక్టర్‌గా ఉన్న స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రై.లి కంపెనీ ఫిబ్రవరి 2008లో ఈ ఒప్పందాన్ని నిర్వహించింది. ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుండి షికోపూర్‌లో 3.5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో హర్యానాలో భూపేంద్ర సింగ్‌ హుడా అధికారంలో ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత, 2012 సెప్టెంబర్‌లో ఆ కంపెనీ భూమినీ డిఎల్‌ఎఫ్‌ సంస్థకు రూ.58 కోట్లకు విక్రయించింది.

2012 అక్టోబర్‌లో హర్యానా ల్యాండ్‌ కన్సాలిడేషన్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌-కమ్‌-ఇన్‌స్పెక్టర్‌-జనరల్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన ఐఎఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా .. ఈ ఒప్పందం రాష్ట్ర ఏకీకరణ చట్టం, సంబంధిత కొన్ని నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ భూ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది.

తనపై కేసును రాబర్ట్‌ వాద్రా తిరస్కరిస్తున్నారు. ఈ కేసును రాజకీయ కక్షగా అభివర్ణించారు. రాజస్తాన్‌ బికనీర్‌ భూఒప్పందం, యుకెకి చెందిన ఆయుధాల విక్రేత సంజరు భండారీకి సంబంధించిన కేసుల్లో కూడా ఈడీ వాద్రాను విచారిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -