నవతెలంగాణ-పెద్దవూర
బంగారు ఆభరణాలు ఆటోలో పోగొట్టుకున్న బాధితులకు ఎస్ఐ ప్రసాద్ అప్పగించారు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన వేముల సింహాచలం భర్త కనకయ్యతో కలిసి మిర్యాలగూడలో ఉన్న కుమారుడు ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో 2.5 తులాల బంగారు గొలుసు, 15 తులాల వెండి, కాళ్ళ పట్టీలు, రెండు తులాల వెండి మెట్టలు, చిన్న ముక్కుపుడక తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని పర్వేదుల గ్రామంలో 10 గంటల సమయంలో ఒక ఆటో ఎక్కి పెద్దవూరకు వచ్చినారు. అక్కడ తొందరపాటులో ఆటో దిగి బంగారు వెండి ఆభరణాలు గల సంచిని ఆటోలోనే మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత సంచి మర్చిపోయిన విషయం తెలుసుకొని వెంటనే వారు పెద్దవూరపోలీస్ స్టేషన్ వచ్చి పిర్యాదు చేశారు.
పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ వెంటనే పెద్దవూర టౌన్లో, పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పరీక్షించి, దంపతులు వచ్చిన ఆటోను గుర్తించడం జరిగింది. ఆలోపే ఆటో మల్లెపల్లి, చింతపల్లి మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించి చింతపల్లి పోలీస్ వారికి సమాచారం తెలియపరిచినారు. వెంటనే పోలీస్ స్టేషన్ సిబ్బందిని అక్కడికి పంపడం జరిగింది. ఆటోను మాల్ పట్టణం వద్ద గుర్తించి పెద్దవూరకి తీసుక వచ్చి అట్టి బంగారు, వెండి అభరణాలను సింహాచలం, కనకయ్యలకు అప్పగించారు.
ఇంతవరకు మండలంలో జరుగడం ఇదే మొదటి సారని స్థానిక ఎస్ఐ వెంటనే స్పందించి బాధితులకు ఆభరణాలు అందరుజేయడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంట సమయంలోనే మర్చిపోయిన బంగారు వెండి ఆభరణాలను గుర్తించి తీసుకువచ్చిన పెద్దవూర పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, కానిస్టేబుల్ కిషన్, లోకేష్ రెడ్డి, రాజు, వెంకన్న, శ్రీకాంత్, సైదిరెడ్డి, హుషా నాయక్లను ఎస్ఐ అభినందించడం జరిగింది. బంగారు వెండి ఆభరణాలు అప్ప చెప్పినందుకు దంపతులు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపినారు.