Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్వెల్గటూర్‌లో దారుణ హత్య

వెల్గటూర్‌లో దారుణ హత్య

- Advertisement -

– ప్రేమ వ్యవహారమా? కుల దురహంకారమా?
నవతెలంగాణ – వెల్గటూర్:
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం దారుణ హత్య కలకలం రేపింది. కిషన్‌రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ (35) అనే యువకుడిని నడిరోడ్డుపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారంతో పాటు కుల దురహంకారం కూడా కారణమై ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ పెద్ద వాగు బ్రిడ్జి పై వెళ్తుండగా, కొందరు దుండగులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం మల్లేష్‌ను కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?
సల్లూరి మల్లేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేకసార్లు పంచాయితీలు, పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. గురువారం ఉదయం మల్లేష్ ఆ యువతి ఇంటికి వెళ్లి గొడవ పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మల్లేష్ బంధువులే అతడిని వెంబడించి దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కుల దురహంకార హత్యగా అనుమానం: అయితే, ఈ హత్య వెనుక కేవలం ప్రేమ వ్యవహారమే కాకుండా కుల దురహంకారం కూడా ప్రధాన కారణంగా ఉండవచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. మృతుడు సల్లూరి మల్లేష్ ఎస్సీ కులానికి చెందిన దళిత వ్యక్తి కావడంతో, కుల వివక్షతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ వ్యవహారం కేవలం ఒక నెపంగా చూపి, కులాంతర సంబంధాన్ని జీర్ణించుకోలేకే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు: హత్య సమాచారం అందుకున్న ధర్మపురి సీఐ రామ నరసింహారెడ్డితో పాటు ఇతర పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన వెల్గటూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -