Saturday, July 19, 2025
E-PAPER
Homeమానవియునెస్కో చైర్‌గా మొదటి ఆదివాసీ మహిళ

యునెస్కో చైర్‌గా మొదటి ఆదివాసీ మహిళ

- Advertisement -

సోనాఝారియా మింజ్‌… యునెస్కో చైర్‌గా బాధ్యలు చేపట్టిన మొదటి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. విద్యా రంగంలో ఆదివాసీ పిల్లలు ఎదుర్కొంటున్న వివక్షను స్వయంగా అనుభవించారు. తనకు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో మంది ఆదివాసీలు తమకు అవసరమైన చదువును పొందలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. నేడు ఎంతో అవసరమైన శాస్త్ర సాంకేతికతకు వారు దూరమవుతున్నారనీ, అలాంటి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడడమే తన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నడుస్తున్న యునెస్కోకు సహ అధ్యక్షత వహిస్తూ జ్ఞానపరమైన న్యాయం కోసం ధైర్యమైన, స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కృషి చేస్తున్న ఆమె ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో సంభాషించారు. ఆ వివరాలు నేటి మానవిలో…
ప్రొఫెసర్‌ సోనాఝారియా మింజ్‌ ఒరాన్‌ తెగకు చెందినవారు. జార్ఖండ్‌ గుమ్లా ఆమె సొంత ఊరు. సమాజిక సిద్ధాంతకర్త, కార్యకర్త అయిన డాక్టర్‌ నిర్మల్‌ మింజ్‌ నలుగురు కుమార్తెల్లో పెద్దది. తల్లి పారాక్లెటా మింజ్‌. అసమానలతో పోరాడడం ఆమె తన తండ్రి నుండే నేర్చుకున్నారు. రాంచీలో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. అథ్లెటిక్స్‌, క్రీడలపై ఆమె ఆసక్తి చూపేవారు. బెంగళూరులోని జ్యోతి నివాస్‌ కళాశాల నుండి ప్రీ యూనివర్సిటీ కోర్సును పూర్తి చేసి, చెన్నైలోని ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కళాశాల నుండి గణితంలో పట్టభద్రురాలయ్యారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కళాశాల నుండి ఎంఎస్సీ కూడా చేశారు. ఇలా 1980లలో భారతీయ విద్యారంగంలో అత్యున్నత గుర్తింపు తెచ్చుకున్న కొద్దిమంది ఆదివాసీ మహిళలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీ జేఎన్‌యూ నుండి ఎం.ఫిల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. తర్వాత మధురై కామరాజ్‌ యూనివర్సిటీలో చేశారు. 1992 నుండి జేఎన్‌ యూలో స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో అదే యూనివర్సిటీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అప్పట్లో ‘జేఎన్‌యూలో మొత్తం ముగ్గురు ఆదివాసీ మహిళా విద్యావేత్తలు ఉండేవారు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆమె జీవితాన్ని పరిశీలిస్తే…
ఓ ఆదివాసీ విద్యావేత్తగా దేశంలోని గిరిజన వర్గాల దుస్థితిపై ఆమె గొంతువిప్పారు. దళితులు, ఆదివాసీలు, వికలాంగులు, మహిళలు, మైనారిటీ రాజ్యాంగ నిబంధలను, హక్కుల కోసం జేఎన్‌యూలోని సమాన అవకాశాల కార్యాలయం(ఇఓఓ)లో అనధికారిక సలహాదారుగా ఉన్నారు. లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు దశాబ్దాల తర్వాత ఒరాన్‌ తెగ (ప్రముఖ షెడ్యూల్డ్‌ కుల సమాజం) నుండి వచ్చిన ఆమె ఇప్పుడు స్వదేశీ సాంస్కృతిక వారసత్వం, స్థిరమైన అభివృద్ధిపై యునెస్కో చైర్‌గా నియమితుల య్యారు. ఆమె భాష, భూమి, ఆరోగ్యం, విద్యలో ప్రత్యేకత కలిగిన స్వదేశీ పండితురాలు. సోనాఝరియాకు ఈ బాధ్యత కొత్తదే కావచ్చు. కానీ ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఈ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉందని ఎవరికైనా అర్థమవుతుంది.

అవకాశాలు ఉన్నప్పటికీ
స్వదేశీ పాఠ్యాంశాలను రూపొందించడం, విద్యా పరిశోధనలో సంతాలి భాషను పరిచయం చేయడం, సాంకేతికతను ముందుకు తీసుకురావడం ఆమె ప్రధాన బాధ్యతలు. ‘ఆదివాసులు చాలా కాలంగా భారతీయ సమాజానికి దూరంగా ఉన్నారు. నేనూ అలాంటి సమాజం నుండే వచ్చాను. విద్య, ఉద్యోగాలు ఉన్నప్పటికీ, నాకు తెలిసిన చాలా మంది ఆదివాసీలు పట్టణ జీవితంలో ఆనందాన్ని పొందలేకపోతున్నారు. వారు సమిష్టి నుండి, ఇంటి నుండి దూరంగా లాగబడ్డారు. ఆ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం’ అని ఆమె నొక్కి చెబుతున్నారు.

పరాయీకరణ
సొంత భాషలు మాట్లాడని తరగతి గదుల్లో పిల్లలు పరాయీకరణ చెందడం నుండి, రికార్డులలో ఆదివాసీ పేర్లు, చరిత్రలను విస్మరించడం వరకు ఆమె మాట్లాడుతున్నారు. ‘ఒక పిల్లవాడు మొదటిసారి తమ ఇంటి నుండి బయటపడినప్పుడు, తరగతి గది వారికి రక్షణ లేని ప్రదేశంగా మారుతుంది, ముఖ్యంగా అక్కడ మాట్లాడే భాష వారిది కానప్పుడు. ఆ భయం మాత్రమే పిల్లలను పాఠశాల నుండి బయటకు నెట్టివేస్తుంది. ఆదివాసీ గుర్తింపు ఎప్పుడూ వ్యక్తిగతమైనది కాదు. అది సమిష్టి. నా ప్రయాణం ఎప్పుడూ నాది కాదు. విద్య నాకు అందు బాటులో ఉన్నా నా సమాజంలో చాలా మందికి అది అందుబాటులో లేదని నాకు తెలుసు’ అంటారు ఆమె. ఈ సమస్యను గమనించిన ఆమె మొదటి నుండి ఆదివాసీల విద్యావిధానంపై దృష్టి పెట్టారు.

విద్యా వలసరాజ్యం
యునెస్కో బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనాఝారియా ముఖ్యంగా స్వదేశీ జ్ఞాన ఉత్పత్తిని అధికారికీకరిం చాలని నిశ్చయించుకున్నారు. దీని అర్థం విద్యా వలసరాజ్యాన్ని నేరుగా ఎదుర్కోవడం. భారతదేశం స్వాతంత్య్రం పొందిన డెబ్బై ఎనిమిదేండ్ల నుండి వలసరాజ్యం కొనసాగుతోందని ఆమె అంటున్నారు. ‘ఆదివాసీల అభివృద్ధికి సాంకేతిక ఉపయోగించుకోవడం చాలా అవసరం. పదిహేనేండ్ల కిందట నేను ఏఐ వల్ల వచ్చే ప్రభావాల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు నవ్వారు. కానీ నేడు, మనం డిజిటల్‌ చుట్టూనే సంభాషణలను చూస్తున్నాము. ఆమె డిజిటల్‌ వలసరాజ్యాన్ని తదుపరి సరిహద్దుగా చూస్తున్నారు. ‘భారతదేశ డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టంలో కూడా భాష అస్పష్టంగా ఉండి వక్రీకరించబడుతుంది. గిరిజన వర్గాల డేటాను రక్షణ లేకుండా డిజిటలైజ్‌ చేస్తే దాన్ని వారికి వ్యతిరేకంగా సులభంగా ఉపయోగించవచ్చు’ అని ఆమె జతచేస్తున్నారు.

గుర్తింపునే తొలగిస్తున్నారు
‘వీటన్నింటిలో మార్పు రావాలంటే ప్రాధమిక స్థాయి నుండి చర్యలు తీసుకోవాలి. భాషా, పర్యావరణ పరంగా పాఠశాల నాకు ఎంత దూరం అయిందో నాకు గుర్తుంది. ఆదివాసీ పిల్లలు అసమర్థులు కాదు, వ్యవస్థ ప్రతికూలంగా ఉండటమే అసలు సమస్య. ఒక పిల్లవాడు 12వ తరగతికి చేరుకుంటే అదో గొప్ప విజయం’ అని ఆమె అంటున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లల పేర్లు పలకడం రావడం లేదని బలవంతంగా మార్పులు చేస్తున్నారని ఆమె అంటున్నారు. అంటే ఇది వారి సాంస్కృతిక గుర్తింపును తొలగించే పద్ధతి అని ఆమె ఆందోళన చెందుతున్నారు. ‘మజ్హరాన్‌ (ఒరాన్‌ సంస్కృతిలో సాంప్రదాయ పేరు) అనే ఒక మహిళ పేరును తాను పని చేసే ఇంటి యజమాని పలకడం రావడం లేదని ‘మిలి’ అని పేరు మార్చాడు. చివరకు అధికార లిస్టుల్లో ఆమె జాడ కనిపించదు. దీన్నిబట్టి పేర్లు అలంకారమైనవి కావు అవి సాంస్కృతిక గుర్తింపు’ అంటారు ఆమె. అంతిమంగా ఆమె లక్ష్యం ఏమిటంటే విద్యా పర్యావరణ వ్యవస్థ స్థాపించడం. యునెస్కో చైర్‌గా ఆమె అధికారం ప్రస్తుతం నాలుగేండ్లు ఉంది. ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది. ‘నేను తదుపరి పదవీకాలం చూడటానికి బతకకపోతే, మరొక ఆదివాసీ పండితుడు ఈ బాధ్యతలో ఉంటాడని నేను ఆశిస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -