ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకునేందుకు అమెరికా పాలకవర్గం ఎంతకైనా తెగిస్తుందన్నది కమ్యూనిస్టులకు ఎప్పుడో తెలుసు. అయినప్పటికీ అమెరికా అంటే వ్యతిరేకం గనుక వారు అలాగే చెబుతారులే అని పట్టించుకోనివారికి ఇప్పుడు తత్వం తలకెక్కుతోంది. ఇదొక శుభపరిమాణం. భాగస్వాములు, మిత్రులు అని చెబుతూనే తన కనుసన్నల్లో నడవాలని అనేక దేశాల మీద ఒత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు మిలిటరీ కూటమి నాటోను కూడా రంగంలోకి తీసుకురావటం మరింత ప్రమాదకరం. తన వ్యవహారాలేవో తాను చూసుకోకుండా అమెరికా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం అది హద్దులు దాటింది. ఉక్రెయిన్ మీద రష్యా మిలిటరీ చర్యను ఆపాలంటే భారత్, చైనా, బ్రెజిల్ ఒత్తిడి తెచ్చి పుతిన్‌ను శాంతి ఒప్పందానికి తీసుకురావాలట. యాభై రోజుల్లో పోరు ముగించక పోతే దానితో వాణిజ్య లావాదేవీలు జరిపే దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానన్న ట్రంప్ బెదిరింపు తర్వాత, అతగాడితో భేటీ జరిపి బుధవారంనాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే అదే పల్లవి అందుకున్నాడు.
ఇతర దేశాలను బెదిరించే ముందు చేతనైతే ఐరోపా యూనియన్ దేశాలతో రష్యా ఇంథన కొనుగోలు ఆపివేయించాలి. ఉక్రెయిన్ వివాదంలో భారత్, చైనా, బ్రెజిల్ తటస్థంగా ఉన్నాయి. దానికి భిన్నంగా ఐరోపా ఒక చేత్తో జెలెన్‌స్కీకి గతేడాది 22బిలియన్ డాలర్ల మేర ఆయుధాలు అందచేసింది. మరో చేత్తో రష్యా నుంచి 25బిలియన్ డాలర్ల మేర చమురు, గ్యాస్ కొనుగోలు చేసింది. భారత్, చైనా చమురు కొనుగోలు ద్వారా రష్యాకు ఊతమిచ్చి పరోక్షంగా ఉక్రెయిన్ మీద దాడిని సమర్ధిస్తున్నాయంటున్న పెద్దలకు ఐరోపా చేస్తున్నదేమిటో కనిపించటం లేదా ? ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు ఐరోపా తన అవసరాలకు రష్యా నుంచి 45శాతం గ్యాస్ తెచ్చుకొనేది, ఇప్పుడు 19 శాతానికి తగ్గించుకుంది.మిలిటరీ చర్య కొనసాగితే 2027 నాటికి పూర్తిగా నిలిపి వేస్తామని చెబుతున్నది. తాము విధించిన ఆంక్షలను తామే ఉల్లంఘించి మూడో దేశం ద్వారా ఇప్పటికీ రష్యన్ చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న ఐరోపా సిగ్గుమాలిన చర్య గురించి తెలియనిదెవరికి?
హంగరీ, స్లోవేకియా వంటి దేశాలు ఆంక్షలను వ్యతిరేకించి నేరుగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్పెయిన్, గ్రీస్, ఇటలీ గణనీయమొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటూ రష్యా కోశాగారాన్ని నింపుతున్న సంగతి నాటో నేతకు తెలియదా? అదరగొండితనం గాకపోతే వారు చేస్తే సంసారం, మిగతావారు చేస్తే మరొకటా? ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్దే ఉంటే ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వ తీర్ధపు అజెండాను పక్కన పెడితే చాలు. దానికి బదులు ఇప్పటి వరకు ఆత్మరక్షణకు ఇస్తున్నామన్న ఆయుధాలను ఎదురుదాడులకూ విస్తరింపచేస్తామని చెప్పటాన్ని ఏమనాలి. అసలు విషయం ఏమంటే రష్యా, చైనాలను కట్టడి చేయాలి, వాటిని దెబ్బతీయాలన్న దుష్ట సంకల్పం దీనికి మూలం.రష్యాపై ఆంక్షల అనుమతి చట్టం 2025పేరుతో రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దాని ప్రకారం రష్యాతో ఇంథనంతో సహా ఇతర కొనుగోళ్లు చేసే దేశాలపై 500శాతం సుంకాలను విధించేందుకు ట్రంప్‌కు అధికారాన్ని కట్టబెడతారు.
ఒక వైపు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ మరోవైపు ఇతర పద్దతులనూ అమెరికా వినియోగిస్తున్నది.చైనాతో వాణిజ్య లావాదేవీలు, ఇతర ఒప్పందాలను కొనసాగిస్తే శ్రీలంక వస్తువుల దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా చేసిన బెదిరింపును ప్రభుత్వం తిరస్కరించింది. అక్కడ ఉన్నది వామపక్ష ప్రభుత్వం గనుక ట్రంప్ బెదిరింపులను బహిరంగ పరచింది. గుట్టుగా ఉంచుతున్న దేశాల సంగతేమిటి ? ఆధిపత్యాన్ని సొమ్ము చేసుకోవటం, వాణిజ్య దౌత్యం పేరు ఏదైనా యావత్ ప్రపంచం ఇలాంటి వాటిని ఖండించాలి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే సహించేది లేదని,ఇలాంటి వాటిని గమనంలో ఉంచుకొనే కొద్ది వారాల క్రితం ట్రంప్‌ను చైనా హెచ్చరించింది. అదేదో చైనాతో అమెరికా పంచాయితీ మనకు ఉండదులే అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.విభజించి పాలించే నీతి గురించి వేరే చెప్పనవసరం లేదు. చైనాతో సంబంధాలను వదులుకొనేది లేదు, మరింతగా పెంచుకుంటామంటూ ఒక చిన్న దేశం శ్రీలంక చూపిన ధైర్యాన్ని కొనియాడాల్సిందే. దీన్నుంచి మనదేశం ఏమైనా నేర్చుకుంటుందా?
నాటో బెదిరింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES