వైజ్ఞానిక ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని చెప్పుకోగల ఓ పదిమంది శాస్త్రవేత్తల్లో డాక్టర్ జయంత్ విష్ణు నార్లేకర్ ఒకరు. (19 జులై 1938 – 20మే 2025) పాప్వులర్ సైన్స్ రచయితగా ప్రసిద్ధుడు. అంతేకాదు, సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసు కున్నవాడు. బహు గ్రంథకర్త. పూనాలో నెలకొల్పిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమి – ఖగోళశాస్త్ర అంతర్ విశ్వవిద్యాలయ కేంద్రానికి ప్రారంభ దశలోనే డైరెక్టర్‌గా ఉన్నవాడు. జీవిత చరమాంకంలో కూడా జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, సింపోజియాలలో చురుకుగా పాల్గొనేవాడు. దేశంలో దూరదర్శన్ ఒక్కటే ఉన్నరోజుల్లో అది ప్రసారం చేసే వైజ్ఞానిక కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుండేవాడు. ఆ రోజుల్లో దూరదర్శన్ కార్యక్రమాలలో ‘సురభి’ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా ఉండేది. అందులో జయంత్ నార్లేకర్ శ్రోతలు/ప్రేక్షకులు అడిగిన వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలకు జవాబులిస్తుండేవాడు. వారి సందేహాలు తీరుస్తూ ఉండేవాడు. వయసు మీదపడిన సమయంలో కూడా ఆయన తన పరిశోధనలు కొనసాగిస్తూనే వచ్చాడు. ముఖ్యంగా ‘బ్లాకహేోల్స్’ మీద టఖియాన్స్ మీద ఆయన పరిశోధనలు చెప్పు కోదగ్గవి. భూమి ఆకర్షణ శక్తి మీద, ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, 1964లో అంటే, తన ఇరవై ఆరవ యేటనే విజ్ఞాన జగత్తును ఆశ్చర్యపరిచాడు – విశేషంగా ఆకర్షించాడు! ఫలితం గానే, భారతదేశపు ఐన్‌స్టీన్‌గా ప్రశంసలందుకున్నాడు. ఇంతటి ప్రతిభావంతుడైన మన భారతీయ శాస్త్రవేత్త ఇటీవల రెండు నెలల కింద కన్నుమూస్తే, మన దేశంలో పత్రికలూ, మీడియా సంస్థలు తమకేమీ పట్టనట్టు మిన్నకున్నాయి. ఎంత విషాదం? ఆదే రాజకీయ నాయకుల తిట్ల పురాణాలు, సినిమా, క్రికెట్ వార్తలు ఢంకా బజాయిస్తూ వెలుగులోకి తెస్తాయి. సమాజంలో వివేకం పెంచడానికి జీవితాలు ధారపోసిన వారిని పట్టించుకోవు.
జయంత్ నార్లేకర్ చిన్నతనం నుండే చురుకైన విద్యార్థిగా ఉండడానికి కారణం, వారిది విద్యావంతుల కుటుంబం. ఇంట్లో అందరికందరూ హేమాహేమీలు. తండ్రి విష్ణు వాసుదేవ్ నార్లేకర్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. తల్లి సుమతి నార్లేకర్ సంస్కత పండితురాలు. తల్లి సోదరుడు – మామ, గణాంక శాస్త్ర నిపుణుడు. ఆయన దగ్గరైతే పిల్లవాడు వద్ధిలోకి వస్తాడని తల్లిదండ్రులు జయంత్‌ను వారణాసిలోని మామగారింట్లో ఉంచారు. పుట్టిందైతే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో – ఆ మామగారు చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. పొద్దున్నే లేచి నల్లబల్ల మీద ఒక లెక్క రాసి ఉంచేవాడు. ఇక బాల జయంత్ నానా తంటాలు పడి ఆ లెక్క సాయంత్రం పూర్తి చేయాల్సిందే! లెక్కలు, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఇంట్లో ఎప్పుడూ చర్చనీయాంశాలవుతూ ఉండేవి. బాల్యంలో లభించిన ఆ వాతావరణం జయంత్ నార్లేకర్‌పై ఎంతో ప్రభావం చూపింది. బాల్యంలో అతను వారణాసిలోని హిందూ బోర్సు స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత బెనారస్ విశ్వ విద్యాలయంలో 1957లో బీఎస్సీలో చేరాడు. తర్వాత లండన్ వెళ్లి,అక్కడి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫిడ్జి విలియం కాలేజీలో చేరాడు. అది ఒకప్పుడు తన తండ్రి విష్ణు వాసుదేవ్ నార్లేకర్ చదువుకున్న కళాశాలే -అక్కడి నుంచి జయంత్ గణితశాస్త్రంలో బి.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. అయితే ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని ప్రతిభను గుర్తించి, చదవకుండానే వారు ఈయనకు యం.ఎ. డిగ్రీ ప్రదానం చేశారు. ఇలాంటి సంఘటనలు సామాన్యంగా జరగవు కదా?
ఆ తర్వాత జయంత్ నార్లేకర్ ఫ్రెడ్ హొయిలీ దగ్గర పరిశోధన కోసం చేరాడు. ఆయన పర్యవేక్షణలో నార్లేకర్, పీహెచ్.డి సాధించాడు. ఆ రోజుల్లోనే ఈయనకు రీసర్చ్ గౖౖెడ్ ఉన్న ఫ్రెడ్ హొయిలీ కేంబ్రిడ్జిలో ‘థియరిటికల్ ఆస్ట్రానమీ’ అనే సంస్థను ప్రారంభిం చాడు. అందులో నార్లేకర్ సీనియర్ ఫెలోగా ఉంటూ, తన గైడ్ హొయిలీకి పూర్తి సహాయ సహకారాలు అందించాడు. ఏవో ఇతర కారణాల వల్ల ఫ్రెడ్ హొయిలీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల జయంత్ నార్లేకర్ కూడా ఇక అక్కడ కొనసాగలేక భారతదేశానికి తిరిగివచ్చాడు. అన్నీ అర్హతలున్నాయి కాబట్టి, రావడం రావడంతోనే ముంబాయిలోని టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్‌లో ప్రొఫెసర్‌గా చేరాడు. అక్కడ చాలాకాలం పనిచేశాడు. అక్కడ ధియరిటికల్ ఆస్ట్రో ఫిజిక్స్ గ్రూపును తయారు చేసుకున్నాడు. అనతికాలంలో ప్రపంచ వైజ్ఞానికుల దష్టిని ఆకట్టుకున్నాడు. అందుకు కొన్ని కారణాలున్నాయి.
పరమాణువంతటి వస్తువు పెద్దశబ్దం చేస్తూ విభిన్నమవడం వల్ల ఈ నక్షత్రాలు, గెలక్సీలు, న్యుబులేల వంటివి ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల నమ్మకం. కానీ, అందుకు వ్యతిరేకంగా నార్లేకర్ స్టడీ స్టేట్ థియరీని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం పదార్థం నక్షత్రాలుగా, గెలక్సీలుగా, ఇతర ఆకారాలుగా విశ్వమంతా సమానంగా వ్యాపించి ఉంది. ఒక వేళ గెలక్సీల కదలిక వల్ల, తీవ్రమైన వేగం వల్ల ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వాటిని కొత్తగా ఏర్పడ్డ పదార్థం పూరిస్తూ ఉంటుంది. ‘స్టడీ స్టేట్ థియరీ’తో పాటు, తన పరిశోధక గురువు ఫ్రెడ్ హొయిలీతో పనిచేస్తున్నప్పుడు నార్లేకర్, గురుత్వాకర్షణపై కూడా కషిచేశాడు. చిన్న వయసులోనే తన అసమాన ప్రజ్ఞ, ప్రదర్శి ంచి, వైజ్ఞానిక ప్రపంచాన్ని అబ్బురపరిచి, తన స్థానం సుస్థిర పరుచుకున్నాడు. ఇక భారతదేశానికి తిరిగివచ్చి, ఇక్కడి టాటా ఇనిస్టిట్యూట్‌లో తన విద్యార్థులతో అనేక పరిశోధనలు చేయించాడు. బ్లాక్ హోల్స్ కంటే, వెలుతురు కణాల కంటే వేగంగా ప్రయాణించగల టఖి¸యాన్స్ మీద జరిపించిన పరిశోధనలు విలువైనవి. ఒక చెంచా వెడల్పు గల బ్లాక్ హోల్ బరువు కొన్ని టన్నులుంటుంది. దాని ఉపరితలం నుంచి కనీసం వెలుగు రేఖల్ని కూడా అది పోనీయదు. నార్లేకర్ ప్రతిపాదించిన దాన్ని బట్టి బ్లాక్ హోల్ టఖియాన్స్‌ని తనలో ఇముడ్చు కుని (పీల్చుకుని) తన ఉపరితల వైశాల్యాన్ని తగ్గించుకోగలుగుతుంది. అందువల్ల టఖియాన్స్‌ని వెతకడం అంటే తగ్గిపోతున్న బ్లాక్ హోల్‌ని వెతకడమే!
జయంత్ నార్లేకర్ నిర్వహించిన ఉన్నత పదవులు, స్వీకరించిన అత్యున్నత పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. 1981లో వరల్డ్ కల్చరల్ కౌన్సిల్‌కు ఈయనే సంస్థాపక సభ్యుడు. 1988లో పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయుసిఎఎ)కు తొలి డైరెక్టరయ్యాడు. ఆ కాలంలోనే అంతర్జాతీయ ఆస్ట్రానమికల్ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. బోధన, పరి శోధనలకు మాత్రమే కాకుండా, ఈయనకు రచనలో కూడా ప్రవేశముంది గనుక, భారత ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసర్వ్ అండ్ ట్రెయినింగ్‌కి ఛైర్మన్‌గా నియమిం చింది. ఆ కాలంలోనే నార్లేకర్ వాస్తు శాస్త్రం, జ్యోతిష్యాలను తీవ్రంగా దుయ్యబట్టారు. నిరూపణ లేని వాటిని శాస్త్రం – సైన్సూ అని అనగూడదనీ, అలాంటివన్నీ- ‘సూడో సైన్సు’ అని ప్రకటించాడు. భారత ప్రభుత్వం నుండి 1965లో పద్మ భూషణ్, 2004లో పద్మ విభూషణ్ వంటి పౌర సన్మానాలు స్వీకరించాడు. ఆయన చేసిన సరళ విజ్ఞాన శాస్త్ర ప్రచారాన్ని గుర్తించి యునెస్కో 1996లో కళింగ ప్రయిజ్ ప్రకటించింది. ఇంకా లెక్కలేనన్ని అంతర్జాతీయ మెడల్సూ, బహుమతులూ స్వీకరించాడు. ఆ లిస్టు చాలా పెద్దది.
వైజ్ఞానిక పరిశోధనా రంగంలోనే కాకుండా జయంత్ నార్లేకర్ సాహిత్య రంగంలో కూడా విశేషమైన కషి చేశాడు. మరాఠీ భాషలో తొమ్మిది; ఇంగ్లీషులో మూడు: హిందీలో ఒకటి – ఇలా పలు సజనాత్మక రచనలు ప్రకటించాడు. అందులో ‘చార్ నగరంతలే మాజే విశ్వ’- అని, ఆయన మరాఠీలో రాసుకున్న ఆత్మకథకు 2014లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 2021 నాసిక్ లో జరిగిన 94వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. పాపులర్ సైన్స్ రచయితగా నార్లేకర్ రాసిన పుస్తకాల్లో ఒకటి తెలుగులో కూడా ”ఆ లోకం” పేరుతో అనువదించబడింది. ఈయన ‘యూనివర్స్’ అనే టి.వి. సీరియల్‌ను 1995 లో దూరదర్శన్ ప్రసారం చేసింది. ఆ సంవత్సరమే ఇందిరా గాంధీ సైన్స్ పాపులరైజేషన్ అవార్డు స్వీకరించాడు. మరీ ముఖ్యంగా 1986 -90 మధ్య కాలంలో నాలుగేండ్ల పాటు భారత ప్రధానికి సైన్సు సలహాదారుగా ఉన్నాడు.
జయంత్ నార్లేకర్ భార్య మంగళ నార్లేకర్ కూడా గణిత శాస్త్ర పరిశోధకురాలే. ఆమెకూడా ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వారంతా ఉన్నత విద్యావంతులు. పెద్దమ్మాయి గీత కాలిఫోర్నియా యూనివర్సిటీలో బయో మెడికల్ రీసర్చ్ చేసింది. తరువాత వాళ్లు – గిరిజ, లీలావతి కంప్యూటర్ సైన్స్ రంగాన్ని ఎంచుకున్నారు. భార్య మంగళ- జయంత్ నార్లేకర్ కన్నా రెండేండ్ల ముందే చనిపోయింది. ఇక జయంత్ నార్లేకర్ ఎనభై ఆరేండ్ల వయసులో వద్ధాప్య సమస్యలతో బాధపడుతూ, 2025 మే 20న మహారాష్ట్ర – పూణేలో తన స్వంత ఇంట్లో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. ఎన్ని గౌరవాలు లభించినా, ఆయన తన కషిని చివరిక్షణం వరకు ఆపలేదు. నిత్య శోధకుడిలా, నూతన విద్యార్థిలా, కొత్త కొత్త పథకాలతో కొత్త దిశలు వెతుకుతూనే వచ్చాడు. మదుభాషి, వినయ సంపన్నుడు, స్నేహశీలి అయిన జయంత్ నార్లేకర్ వ్యక్తిత్వం, వైజ్ఞానిక – సాహిత్య కషి నేటి యువతరానికి ఆదర్శ ప్రాయం కావాలి!
శాస్త్రవేత్తల పరిశోధనలన్నీ, వాటి ఫలితాలన్నీ సమాజానికి లభిస్తున్నందువల్లనే సమాజం త్వరితగతిన ప్రగతి పథాన పయనిస్తోంది. అలాంటప్పుడు వారిని ఆయా రంగాలకు మాత్రమే పరిమితం చేయకుండా, తెరవెనక ఉండి కషిచేస్తున్న సంఘ సంస్కర్తలుగా గుర్తించుకోవాలి. వివేకవంతమైన సమాజం ఎప్పుడూ సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యే వారిని – అందరినీ గుర్తుంచికుంటూ ఉండాలి. గౌరవించుకుంటూ ఉండాలి! అప్పుడే అది ఆరోగ్యకరమైన సమాజం అవుతుంది.
(13 జులై : జయంత్ నార్లేకర్ జయంతి)
– కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత. డాక్టర్ దేవరాజు మహారాజు
వాస్తు, జ్యోతిష్యాలను నిరసించిన ఖగోళ శాస్త్రవేత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES