Saturday, July 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యా ప్రమాణాల్లో మనమెక్కడీ

విద్యా ప్రమాణాల్లో మనమెక్కడీ

- Advertisement -

మనదేశంలో పాఠశాల విద్యావ్యవస్థ ప్రపంచంలోనే చాలాపెద్దది. పదిహేను లక్షల పాఠశాలల్లో 25 కోట్లకు పైగా విద్యార్థులు విద్య నభ్యసి స్తున్నారు. కానీ, నిధుల లేమి, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేక నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది. పాఠశాల విద్యపై పట్టింపు లేనితనంతో రానురానూ విద్యా ప్రమా ణాలు క్షీణిస్తున్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పనితీరు నివేదిక తేటతెల్లం చేస్తున్నది. ప్రతియేటా 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పాఠశాల విద్య స్థితిగతులపైన ఫర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) పేరుతో షాగున్‌, మధ్యాహ్న భోజన పథకం, యుడైసు, జాతీయ సాధన సర్వే, జాతీయ విద్య పరిశోధన సంస్థ (ఎన్సీఈఆర్టీ) గణాంకాల ఆధారంగా గణాంకాలను విడుదల చేస్తుంది. అభ్యసన ఫలితాలు నాణ్యత, విద్యార్థులు, మౌలిక వసతులు, సమానత్వం, పరిపాలన విధానమనే ఆరు అంశాల ఆధారంగా పది దశల్లో 73 సూచికల్లో వెయ్యి పాయింట్ల ఆధారంగా ఉంటుంది. అయితే ఇటీవల విడుదల చేసిన 2023-24 పనితీరు గ్రేడింగ్‌ నివేదికలో తెలంగాణ రాష్ట్రం అట్టడుగు నుండి రెండో దశలో ఉంది. పిజిఐ మొదటి లెవెల్‌ నుండి నాలుగవ లెవల్‌ వరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా స్థానాన్ని పొందలేకపోయింది పనితీరు గ్రేడింగ్‌ 5వ దశలో (701-760 పాయింట్లు) ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మాత్రమే స్థానం సంపాదించింది. ఆరోదశ అయిన ప్రచేస్తా-2లో ఏ రాష్ట్రం స్థానం సంపాదించలేక పోయింది.ఏడవ లెవెల్‌ దశ అయినా ప్రచేస్తా-3లో పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, ఒరిస్సా, కేరళ, హర్యానా, దాద్రా నగర్‌ హవేలీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, డామన్‌ డయ్యు (581-640) మొదలైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానాన్ని పొందాయి. ఎని మిదో దశ అయిన ఆకాంక్ష-1లో ఏపీ చోటు సంపా దించగా తొమ్మిదోదశ అయిన ఆకాంక్ష-2లో పదమూడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం స్థానాన్ని పొందింది.
ప్రభుత్వ పాఠశాలలను కాదని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పెరగడానికి గల కారణాలేమిటి? ఇటీవల విడుదల చేసిన ఆసర్‌ సర్వే ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించడం లేదని తేల్చింది. తరగతుల వారి అభ్యసనా ఫలితాలు విశ్లేషిస్తే అట్టడుగు స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ పొందుతున్న విద్యార్థుల నిలుపుదల రేటు క్రమేపి తగ్గుతున్నది. బడి బయట పిల్లలు, బాల కార్మికులు బడికి వెళ్లేందుకు ఆపరేషన్‌ స్మైల్‌ ఆపరేషన్‌, ముస్కాన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన రీతిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, క్రీడ మైదానాలు,ప్రయోగశాల, గ్రంథాలయం, తాగునీటి సరఫరా మెజార్టీ పాఠశాలల్లో లేవు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. కేటాయించినవి కూడా సకాలంలో అందడం లేదు. ఈ కారణాలతో సరైన పౌష్టికాహారం అందడం లేదు. ప్రత్యేక అవసరాల పిల్లలకు సరైన వసతులు లేవు.
గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు మన బడి’ పథకం కింద మూడు దశల్లో రూ.290 కోట్లు కేటాయించింది. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంకా చాలాచోట్ల నిధులు ఖర్చు చేయలేదు. పనులు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక వసతుల్లో కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అనేక రంగాల అభివృద్ధి విద్యతోనే ముడిపడి ఉంది పరిశ్రమలు, ఆర్థికం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం వంటివి ప్రత్యక్షంగా పరోక్షంగా విద్యతో అనుసంధానమై ఉన్నాయి. గనుక పాఠశాల దశ నుంచి సరైన ప్రణాళిక ఉండాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. ఆరు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటం తల్లిదండ్రులనే కాదు, విద్యావేత్తలన కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పన చేయాలి. నిరంతర తనిఖీలు ,పర్యవేక్షణ కోసం శాశ్వత మండల విద్యా శాఖ అధికారుల నియా మకం చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి. పాఠశాల విద్యా వ్యవస్థలో ఎటువంటి లోపాలున్నా వాటి ఫలితాలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే ప్రాథమిక స్థాయినుంచి విద్యకు తగిన చికిత్స అందిస్తే భారతదేశ భవిష్యత్తు తరగతి గోడల మధ్య నుంచి వికసిస్తుంది.

అంకం నరేష్‌
6301650324

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -