Saturday, July 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమరో చారిత్రక పోరాటం అవశ్యం

మరో చారిత్రక పోరాటం అవశ్యం

- Advertisement -

ప్రపంచ తత్వవేత్త కారల్‌ మార్క్స్‌ 1867 క్యాపిటల్‌ గ్రంథంలో ఒక అంశాన్ని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారుల, కార్మికుల మధ్య వర్గ పోరాటమంటే పని గంటల పోరాటమే’ అన్నారు. ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దకాలంలో చెప్పిన ఆయన మాటలు రెండు వందల సంవత్సరాలు దాటినా మననం చేసుకుంటున్నామంటే నేటికీ కార్మికవర్గాన్ని పెట్టుబడిదారి సమాజం ఎంతగా దోచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మిత్రపక్షాల సహకారంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్పొరేట్లకు మరింత ఊడిగం చేసేందుకు పావులు కదుపుతున్నది. కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌కోడ్స్‌ తెచ్చి అమలు చేయజూస్తోంది. ఓవైపు దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం పుండుమీద కారం చల్లింది. జూలై 5న పని గంటలు 8 నుండి 10కి పెంచుతూ జీఓ నెం.282ను విడుదల చేసింది. తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-1988 పరిధిలోకి వచ్చే సంస్థల్లో పని దినానికి అనుమతించింది. బీజేపీ విధానాలకు తాము వ్యతిరేకమని నిత్యం మాట్లాడే కాంగ్రెస్‌ సర్కార్‌ రాష్ట్రంలో యాజమాన్యల లాభాల కోసం ”ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌” పేరిట ఈ జీఓ తెచ్చింది. కార్మికుల శ్రమను దోచిపెట్టడంలో బీజేపీ, తమకు విధానపరంగా తేడా లేదని కాంగ్రెస్‌ నిరూపించింది. కేంద్రంలో ‘బడా భారు’ లేబర్‌ కోడ్‌లు తెస్తే రాష్ట్రంలో ‘చోటా భారు’ షాప్స్‌ యాక్ట్‌కు సవరణలు చేశారు.


జీవో 28లో ఏముంది?
తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-1988 పరిధిలోకి వచ్చే సంస్థల్లో రోజుకు పది గంటల పని దినం పెంచుతూ షాప్స్‌కు మినహాయింపు ఉంటుందని జీఓలో పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 16, 17లకు సవరణలు చేస్తూ వ్యాపార సంస్థల్లో, కార్యాలయాల్లోని ఉద్యోగులంతా ఇక నుండి రోజుకు పది గంటలు పనిచేయాలి, వారానికి 48 గంటలు మించరాదని నిబంధన పెట్టారు. అలాంటప్పుడు ఆరు రోజులు రోజు పది గంటలకు ఎందుకు పెంచారు? సమాధానం లేదు. వారానికి అరవై గంటలు పని చేయిస్తారు. మూడు నెలల్లో 144 గంటలకు మించరాదని పేర్కొన్నారు. రోజులో ఆరు గంటలు పని చేస్తే అరగంట మాత్రమే విశ్రాంతి ఉంటుందట. కార్మికులు యంత్రాల మాదిరి పనిచేయాలి. ఓవర్‌ టైమ్‌ వేతనాలతో రోజుకు పన్నెండు గంటలు పెంచుకోడానికి వారానికి 72 గంటలకు అవకాశం కల్పించారు. కేంద్రం లేబర్‌ కోడ్‌లో కూడా ఇదే చెప్పింది. ఇన్ఫోసిస్‌, ఐటి అధిపతులు ఇదే కోరారు. పక్క రాష్ట్రంలోని ప్రపంచ బ్యాంకు ప్రియమైన ముఖ్యమంత్రి అన్ని కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో పది గంటలు పనిదినానికై నిర్ణయం తీసుకున్నారు. గతంలో యుపి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్నెండు గంటల పనిదినం ప్రవేశపెట్టారు. ఇటీవల కర్నాటక, తమిళనాడులో ఇదే ప్రయత్నం చేశారు. ఇదే కోవలో రాష్ట్రంలో పనిదినం పెంచింది. తర్వాత అన్ని కంపెనీలకు వర్తించే విధంగా తీసుకువస్తారు.


కార్మికులకు నష్టం, వ్యాపారులకు లాభం
రాష్ట్రంలో కార్మిక శాఖ లెక్కల ప్రకారం 7,79,223 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఈ జీఓ పరిధిలో ఉన్నాయి. ఇందులో సుమారు 24,66,360 మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ జీఓ నెం.116 (2007) ప్రకారం వేతనాలు నిర్ణయించారు. నేటికి కనీస వేతనం రూ.12,420లు మాత్రమే. 18 ఏండ్లు గడిచినా కనీస వేతనాలు సవరించలేదు. ప్రతి ఐదేండ్లకోసారి సవరించాలి. అందుకు ప్రభుత్వాలు సిద్ధపడలేదు. కానీ 365 రోజులు 24 గంటలు తెరిచి వ్యాపారం చేసుకోడానికి పది గంటల పాటు పని చేయించుకోడానికి ఆగమేఘాల మీద జీఓ ఇచ్చారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? అధిక పనిగంటల వల్ల కార్మికులు, ఉద్యోగులు ఎంత నష్టపోతారు? వ్యాపారులు ఎంత లాభ పడతారో పరిశీలిద్దాం! ఉదా: కార్మిక శాఖ షాప్‌ ఎంప్లాయీస్‌కు ఇచ్చిన జీఓ 116 ప్రకారం సగటున రూ.13వేలు కనీస వేతనం ఉంది. రోజుకు పదిగంటల చొప్పున నెలకు 26 రోజులకు గాను 260 గంటలు పని చేస్తారు. 8 గంటల చొప్పున 208 గంటలే పని చేయాలి. 52 గంటలు ఓవర్‌టైమ్‌కు డబుల్‌ వేతనం లెక్కిస్తే చట్టం ప్రకారం మరో రూ.6,500లు ఇవ్వాలి. మొత్తం 25 లక్షల మందికి ఓవర్‌టైమ్‌ వేతనాలను లెక్కిస్తే నెలకు రూ.1,625 కోట్లు, ఏడాదికి రూ.19,500 కోట్లు రెండు గంటలు పని పెంచడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతారు, యజమానులు లాభపడతారు. పెరిగిన ధరల ప్రకారం కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకపోవడం వల్ల ఒక్క ఉద్యోగి నెలకు రూ.13వేలు ఇప్పటికే నష్టపోతున్నాడు. అవి లెక్కిస్తే 25 లక్షల మందికి ఏడాదికి మరో రూ.32,500 కోట్లు నష్టపోతున్నారు. ఇదంతా ఏడాది లెక్కనే. రాష్ట్రంలోని మొత్తం 73 షెడ్యూల్డ్‌ ఎంప్లారుమెంట్స్‌లో కోటి మందికి పైగా ఉన్నారు. వారందరికీ లెక్కిస్తే ఏడాదికి లక్షా 30 వేల కోట్ల రూపాయలు కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. పెట్టుబడిదారి వర్గం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వేతనాలు పెంచనివ్వడం లేదు. ఏండ్ల తరబడి వేతన సవరణ కూడా లేదు. కార్మిక శాఖ ప్రతి పాదనలపై ముఖ్యమంత్రి మంత్రులతో కమిటీ వేసి వేతనాలు ఎలా తగ్గించాలా అని ఆలో చిస్తున్నారు. పని గంటలు పెంచడానికి మాత్రం కమిటీ వేయలేదు. చర్చ కూడా జరగలేదు. గుట్టుచప్పుడు కాకుండా జీవో జారీచేశారు.


బానిసత్వంలోకి నెట్టేస్తున్న ప్రభుత్వాలు
కార్మికుల శ్రమను దోచుకోవడం వల్ల పోగుపడిన పెట్టుబడి క్రమంగా గుత్త పెట్టుబడిగా మారింది. ప్రపంచీకరణ వల్ల విశ్వవ్యాప్తంగా ఫైనాన్స్‌ పెట్టుబడిగా విస్తరించింది. అది ఇప్పుడు దేశాల ఆర్థిక వ్యవస్థలనే అతలాకుతలం చేస్తున్నది. తన ఆటంకాలను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నది. వాటిలో కీలకమైంది కార్మిక సంక్షేమ చట్టాల మార్పు లేదా రద్దు చేయడం. చారిత్రకంగా ఎన్నో పోరాటాలు, త్యాగాల వల్ల ఎనిమిది గంటల పనిదినం సాధ్యమైంది. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా 1810 రాబర్ట్‌ ఓవెన్‌లో 8 గంటల పనిదినం ఆలోచన రేకెత్తింది. 1817లోనే 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటల వినోదం ఫార్ములా ముందుకు తెచ్చింది. ఇంగ్లాండ్‌లో కార్మికవర్గం పోరాడి 1847లో ఫ్యాక్టరీల చట్టం ద్వారా పది గంటలు చట్టబద్ధమైంది. 1866లో అంతర్జాతీయ వర్కింగ్‌ మెన్‌ అసోసియేషన్‌లో మార్క్స్‌ చొరవతో తీర్మానం చేసింది. 1886 అమెరికా చికాగో వీరుల త్యాగం తెలిసిందే. రష్యా విప్లవం తర్వాత ఎనిమిది గంటల పని అనేక దేశాలు సాధించుకున్నాయి. భారతదేశంలోనే 1862 హౌరా రైల్వే కార్మికుల సమ్మె 8 గంటల పని కోసం జరిగింది. 1919 ఐఎల్‌ఓ ఏర్పడ్డ తర్వాత అన్ని దేశాల్లో అమలు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఐఎల్‌ఓ మొదటి కన్వెన్షన్‌లోనే 8 గంటల పనిదినం నిర్ణయమైంది. కానీ దీన్ని మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కూడా ఐఎల్‌ఓ కన్వెన్షన్‌ తీర్మానాన్ని ధిక్కరించి పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి బానిసత్వంలోకి నెట్టివేస్తున్నది.


పనిగంటలు తగ్గిస్తున్న దేశాలు
ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు పెట్టుబడిదారుల కోసం ప్రపంచ పర్యటనలు చేస్తున్నారు. అక్కడి దేశాల పనిగంటలు పరిశీలించారా? అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, స్వీడన్‌, ఆస్ట్రేలియా, నెదర్‌ల్యాండ్స్‌ లాంటి దేశాల్లో ఐదు రోజుల పని, రెండు రోజుల పాటు సెలవులిస్తున్నారు. వారానికి 30 గంటల నుండి నలభై గంటలలోపే అమలు చేస్తున్నారు అవసరాలకు సరిపడే వేతనాలు నిర్ణయిస్తున్నారు.కానీ మన దేశంలో పనిగంటలు పెంచుతూ చట్టాలు చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు మన దేశంలో చవకగా లభించే శ్రమశక్తి దోచుకోడానికి వస్తున్నాయి. సంపద మూటగట్టుకొని పోతున్నాయి. అందుకు పాలకవర్గాలు విధానాలను మార్పు చేసి ఏకపక్షంగా సహకరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర కార్మికవ్యతిరేక నిర్ణయాల్ని దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు మాత్రమే ప్రతిఘటిస్తున్నాయి. పది కార్మిక సం ఘాలు ఒక్కటై జూలై 9న 25 కోట్ల మందితో సమ్మె చేశాయి. అయినప్పటికీ పాలక వర్గాల్లో మార్పురావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికవర్గమంతా ఒక్కతాటిపైకి రావాలి. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం కోసం మరో చారిత్రక పోరాటానికి సిద్ధమవ్వాలి.

భూపాల్‌
9490098034

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -