బీహార్ ఎస్‌ఐఆర్‌పై రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీకి పక్షపాతంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీహార్‌లో ఓటర్ జాబితాలో ఓట్లను ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట తొలగిస్తున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం స్వతంత్రతపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ ఎలక్షన్ కమిషన్‌లా కాకుండా పూర్తిగా బీజేపీ ఎలక్షన్ చోరీ బ్రాంచ్‌గా మారిపోయిందని విమర్శించారు. అజిత్ అంజుమ్ అనే యూట్యూబర్ బీహార్ ఓటర్ జాబితాపై నిర్వహిస్తున్న సిరీస్‌ను పోస్ట్ చేశారు. ఓటర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండానే సంతకం చేసి జాబితా నుంచి తొలగిస్తున్న అధికారుల దృశ్యాలను అందులో షేర్ చేశారు.
6.85శాతం మాత్రమే బ్యాలెన్స్ : ఈసీ వెల్లడి
కాగా కేవలం 6.85శాతం ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలను నింపేవారు మిగిలి ఉన్నారని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి, ఎన్యూమరేషన్ పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉందని చెప్పింది. బీహార్‌లోని మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో 6.99 కోట్లకు పైగా ఓటర్లు పత్రాలను సమర్పించినట్టు వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రి య తొమ్మిది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసిం ది. ఇప్పటి వరకు 88.65 శాతం ఓటర్ల వివరాలను సేకరించినట్టు చెప్పింది. వీరితోపాటు మొత్తం ఓటర్లలో 1.59 శాతం మంది ఓటర్లు మృతి చెందగా, 2.2 శాతం మంది రాష్ట్రం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయినట్టుగా గుర్తించింది. మరో 0.73 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్టు ఈసీ తెలిపిం ది. ఒకవేళ తాత్కాలికంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారుంటే, పేపర్‌లో వచ్చిన ప్రకటనల ఆధారంగా నేరుగా పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పిం చి ఓటరు జాబితాలో చేరవచ్చని తెలిపింది. ముసాయిదా ఓటర్ జాబితాను 2025 ఆగస్టు 1న ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఓటర్లకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ధన్యావాదాలు తెలిపారు.
రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ
అయితే, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరింది. కానీ, 22 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక సవరణ ద్వారా అనర్హుల ఓటర్లను తొలగిస్తామని ఈసీ చెబుతోంది. నకిలీ ఎంట్రీలను తొలగించి చట్టప్రకారం ఓటు వేయడానికి అర్హులైన వారిని చేర్చుతామని ఇప్పటికే వాదించింది. మరోవైపు బీహార్ తరహాలోనే వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. విదేశీ అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ను నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు.
బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్ ఈసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES