రెండు నెలల్లో బాధ్యులపై చర్యలు
బాధితులకు ఒక్కొక్కరికి రూ.1,25,000 పరిహారం
ఔషధాల సేకరణ, నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి : సీఎస్‌కు రాష్ట్ర హెచ్‌ఆర్‌సీ ఆదేశం
ఈ కేసులో కమిషన్ తుది ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆస్పత్రులందించే సేవలపై తరచుగా రోగుల నుంచి ఆరోపణలు వినిపిస్తుంటాయి. ప్రధానంగా నిర్లక్ష్యంగా చేసిన వైద్యం వికటించి రోగి ఆరోగ్యం క్షీణించిందనీ, ప్రాణాల మీదికి వచ్చిందనే ఫిర్యాదులు వస్తుంటాయి. జవాబుదారీతనం, నిర్వహణ కొరవడిన సందర్భాల్లో జరిగే ఈ ఘటనల్లో కొన్నిసార్లు కొందరు బాధితులుగా మారుతుంటారు. 2014లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గడువు ముగిసిన వ్యాక్సిన్లను రోగులకు ఇచ్చిన ఘటనలో పలువురు బాధితులుగా మారారు. వారిలో 16 మంది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఘటనకు దారితీసిన నిర్లక్ష్యానికి బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా గడువు ముగిసిన హెపటైటీస్- బి వ్యాక్సిన్లు వేయించుకున్న 16 మంది కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనను కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారించింది. హక్కుల పరిరక్షణ చట్టం, 1993 సెక్షన్ 18 ప్రకారం బాధితులకు ఒక్కొక్కరికి రూ.1,25,000 నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఔషధాల సేకరణ, నిర్వహణ ప్రక్రియలో దిద్దుబాటు చర్యలు తీసుకుని మరింత జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ ఘటన బాధితుల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన మౌలిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించిందని కమిషన్ అభిప్రాయపడింది. వ్యవస్థాగత లోపాలను గుర్తించి, ఆస్పత్రి సూపరిండెంటెంట్ తో పాటు బాధ్యత వహించవలసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులన్నింటినీ రెండు నెలల్లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన 16 మందిలో ఆరుగురు ఎ.ఎన్.ఆదిలక్ష్మి, ఎస్.దేవమణి, టి.సతీష్, పి.మల్లికార్జున్, టి.రవి, జి.ధనుంజరు వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై తమ వాదన వినిపించారు. గాంధీ ఆస్పత్రి ఎఆర్టీ, సీఓఇ రీసెర్చ్ ఫెల్లో డాక్టర్ టి.తారాదేవి ఈ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. తద్వారా తాము మానసిక ఒత్తిడి, కడుపునొప్పి, ఒళ్లునొప్పులు తదితర దుష్ప్రభావాల బారిన పడ్డామనీ, పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. దీంతో 2014 సెప్టెంబర్ 16న ఈ ఘటనకు సంబంధించి నివేదికను సమర్పించాలని కమిషన్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అయితే ఈ నివేదికలో వ్యాక్సిన్ తయారీదారు సదరు వ్యాక్సిన్ ప్యాక్‌పై రెండు భిన్నమైన తేదీలను ముద్రించినట్టు వారు వెల్లడించారు. అదే సమయంలో జరిగిన పొరపాటును గుర్తించిన వెంటనే డాక్టర్ తారాదేవి ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. 2015లో మరోసారి గాంధీ ఆస్పత్రికి ఔషధాల సరఫరాలో అక్రమాలకు సంబంధించి వచ్చిన వార్తా కథనాన్ని కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీని నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డీసీపీ అదే ఏడాది ఆగస్టు 14న గాంధీ ఆస్పత్రిని సందర్శించి సౌకర్యాల మెరుగుదలకు సూచనలిచ్చారు. దీంతో అంతకు ముందు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగుల భద్రతకు సంబంధించిన విషయంలో సున్నితంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. ఆస్పత్రి వ్యవస్థ జవాబుదారీతనం లేకుండా బాధ్యత పూర్తిగా తయారీదారు, డీలర్‌పై వేసేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొంది. ఘటన తర్వాత డాక్టర్ తారాదేవిని సస్పెండ్ చేశారే తప్ప బాధితులకు తగినంత పరిహారం చెల్లించలేదని కమిషన్ గుర్తించింది. ఈ ఘటనతో బాధితుల విలువైన మానవ హక్కులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. వారికున్న జీవించే హక్కులో భాగమైన ఆరోగ్య హక్కు ప్రమాదంలో పడిందని ఆక్షేపించింది. సూపరింటెండెంట్ నివేదిక తనతో పాటు ఔషధాల సేకరణ, పంపిణీ విధులతో సంబంధమున్న ఇతర డాక్టర్లను కాపాడుకునే ఉద్దేశంతో కూడుకున్నట్టుగా ఉందని ఆక్షేపించింది.
గడువు ముగిసిన వ్యాక్సిన్లపై రగడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES