– అయోమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు
– నేతలకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
– ఎవరైనా తన దారిలోకి రావాల్సిందేనంటూ వ్యాఖ్యలు
– టీజీబీకేఎస్ బాద్యతలను కొప్పులకు అప్పగించటంపై గుర్రు
– అన్నీ తెలిసే రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సును సమర్థిస్తున్నానని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
‘అసలు మన పార్టీలో ఏం జరుగుతోంది..? ఒకవైపు అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావటం లేదు, మరోవైపు కేటీఆర్ పర్యటనల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. హరీశ్‌రావు అత్యధిక సమయం సిద్ధిపేటలో ఉంటున్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి కార్యక్రమాలకే పరిమితమై, అసలు తెలంగాణ భవన్‌కే రావటం లేదు… ఈ క్రమంలో అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది…’ ఇవీ సగటు బీఆర్‌ఎస్ కార్యకర్తను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలు. అగ్రనేతల వ్యవహారశైలి వాటికి బలం చేకూర్చే విధంగానే కొనసాగుతోంది. ఒకవైపు తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ… గులాబీ పార్టీని పట్టించుకోకుండా కవిత తన సొంత అజెండాతో ముందుకెళుతుంటే, ఆమెను పూర్తిగా విస్మరించినట్టు బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోంది. తాజాగా నెలకొన్న పరిణామాలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటిదాకా బీఆర్‌ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాని (టీబీజీకేఎస్)కి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆ పార్టీ నిర్ణయించటంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టైంది. ఆమె స్థానంలో ఆ సంఘం బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. దీనిపై కవిత అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. తనను పదవి నుంచి తొలగించటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు బీసీ రిజర్వేష్లకు సంబంధించి తాను న్యాయ నిపుణులతో పూర్తిగా చర్చించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును సమర్థిస్తూ మాట్లడానని కవిత వ్యాఖ్యానించారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల తీర్మానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో రెండు తీర్మానాలను కూడా ఆమోదించారు. ఈ రెండూ వేర్వేరు విషయాలనీ, అయితే బీఆర్‌ఎస్ నేతలు ఈ వాస్తవాన్ని బయటకు చెప్పకుండా ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నారంటూ కవిత విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో నాలుగు రోజుల తర్వాతైనా బీఆర్‌ఎస్ వాళ్లు తన దారిలోకి (ఆర్డినెన్సును సమర్థించటం) రావాల్సిందేనంటూ గురువారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కవిత వ్యాఖ్యానించటం గమనార్హం. తద్వారా ఆమె అధికార కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగానే మద్దతునిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ కారు పార్టీ అధినాయకత్వం ఏ మాత్రం స్పందించకపోవటం పట్ల కవిత తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘దీన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ’ ఆమె వాపోయారు. మొత్తం మీద తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే కారణంతో కినుక వహించిన కవిత.. ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరిట ప్రతీ రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తూ మీడియాలో చర్చకు తెరలేపారు. ఇప్పుడు ‘నా దారి.. రహదారి… అందరూ అదే దారిలో నడవాలంటూ’ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు, ఇతర నేతలకు వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశమైంది.
గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది…?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES