– కిలోకి రూ.425 మాత్రమే ఇస్తామంటున్న ఆర్గనైజర్లు
– పెట్టుబడుల వడ్డీకి బాండ్ రాయించుకుంటున్న వైనం
– ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి ొ పత్తి పంటను ధ్వంసం చేయాలని ఆర్గనైజర్ల ఒత్తిడి
సీడ్ పత్తి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విత్తనం విత్తే సమయంలో షరతులు పెట్టని ఆర్గనైజర్లు.. ఇప్పుడు ఎకరాకు రెండు క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. ఇప్పటికే ప్యాకెట్ ధర రూ.100 తగ్గించిన కంపెనీలు.. ఇప్పుడు రెండు క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేస్తామంటే ఒక్కో రైతు లక్ష రూపాయలకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. ఇటు కంపెనీలు, అటు ఆర్గనైజర్ల మధ్య నలిగిపోతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో భూములు సీడ్ పత్తికి అనుకూలంగా ఉంటాయి. పలు కంపెనీల ప్రతినిధులు ఈ ప్రాంతానికి వచ్చి సీడ్ పత్తి వేసేలా రైతులను చైతన్యవంతం చేశారు. అయితే రైతులకు కంపెనీలకు మధ్య ఆర్గనైజర్‌లను ఏర్పాటు చేసి వారి ద్వారా విత్తనాలు సరఫరా చేస్తూ సీడ్ పత్తి సాగుకు సహకరిస్తున్నారు. తల్లి పత్తి విత్తనానికి ఆడ, మగ పుష్పాలను కలపడం ద్వారా వచ్చే విత్తనాలను తిరిగి కంపెనీలు రైతుల నుంచి ఆర్గనైజర్ల ద్వారా కొనుగోలు చేస్తాయి. జిల్లా పరిధిలో 50వేల ఎకరాలలో విత్తన పత్తి సాగు చేస్తున్నారు. ఎకరాలో విత్తన పత్తి ఎనిమిది క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. ఒక ప్యాకెట్ ధర రూ. 525 అయితే ఎకరాలో ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలు విత్తనాలమ్మితే రైతుకు రూ.52,500 ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎనిమిది క్వింటాళ్లకు రూ.నాలుగు లక్షల 60వేల ఆదాయం వస్తుంది. అయితే, ఎకరాలో వచ్చిన దిగుబడిలో రెండు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని కంపెనీలు మెలిక పెట్టడంతో ఒక్కో ఎకరాకు రైతు రూ.3.68 లక్షల ఆదాయం కోల్పోతాడు. దీంతో జిల్లాలో రైతులు సాగు చేసిన 50 వేల ఎకరాల్లో మొత్తం రూ.193 కోట్ల 20 లక్షల ఆదాయం కోల్పోతారు. రైతులు పంట భూములపై పెట్టుబడి 90శాతం పెట్టారు. మిగతా 10 శాతం కూలీలకు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు పంట కొనుగోళ్లపై షరతులు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
ధరలోనూ తక్కువే..
విత్తన పత్తికి గత ఏడాది కిలోకి రూ.525 ఇచ్చారు. ఈసారి అంత ఇచ్చుకోలేం.. కిలోకి 425 రూపాయలు మాత్రమే ఇస్తామని కంపెనీలు కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు చెబుతున్నారు. అయినా గత ఏడాది సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకోవడానికి తిరిగి విత్తనపత్తి సాగు చేయక తప్పలేదు. ఎకరాకు లక్షకు పైగా ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే దశలో ఎకరాకు వచ్చిన దిగుబడిలో రెండు కింటాళ్లే కొనుగోలు చేస్తామనడం రైతులను తీవ్రంగా నష్టాలపాలు చేయడమే.
పెట్టుబడి వాళ్లే ఇచ్చి..
విత్తన పత్తి రైతులకు అవసరమైన పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకు పైగా ఆర్గనైజర్లే ఇచ్చారు. ఒక ఏడాది దిగుబడి రాకపోతే వచ్చే ఏడాది ఇవ్వాలని వడ్డీకి బాండ్ రాయించుకుంటారు. వచ్చే పంట ఖర్చులు జమ చేసుకొని వసూలు చేసుకుంటారు. రెండు రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తారు. ఇలా జమైన అప్పు మొత్తం చెల్లించడం ఆలస్యమైతే భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారు. ఇలాంటి ఘటనలు గద్వాల పరిధిలో సాధారణంగా జరుగుతుంటాయి.
సీడ్ పత్తి కంపెనీలు
గద్వాల జిల్లా పరిధిలో సీడ్ పత్తి కంపెనీలు అనేకం. వేద, రాసి, కావేరి, నూజివీడు, అంకూర్, జెకె, రాయల్, టాటా, కోహినూర్, సాయి, భవ్య, వసంత, పాలమూరు, శ్రీరామ, నీద్ గంగా యశోద, సూపర్ ఇండో, అమెరిక, ధనలక్ష్మి లాంటి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. వీటి పరిధిలో ఆర్గనైజర్లు పనిచేస్తున్నారు.
ఆర్గనైజర్ల ఆగడాలు
ఆర్గనైజర్‌ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. విత్తనం విత్తే సమయంలో ఏమీ చెప్పకుండా.. ఇప్పుడు పంట మొత్తం కొనుగోలు చేయలేక.. రైతులు నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటే మూడు ఎకరాలు ధ్వంసం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అలా అయితేనే మీ విత్తనాలను కొనుగోలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక కొంతమంది తమ పంట పొలాల్లో ఉన్న పత్తిని ధ్వంసం చేశారు.
పెట్టుబడి అంతా పెట్టాం
నాకు అర ఎకర పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాను. ఇప్పటికే నాలుగు లక్షల ఖర్చు అయింది. ఇప్పుడు ఎకరాలో వచ్చిన పంటలో రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. మిగతా పత్తి విత్తనాలను మేము బయట అమ్ముకుంటే కేసులు పెడతారు. ఎలా బతకాలి?.
– జమ్ములు, కేటి దొడ్డి, ఐజ మండలం
ధర తక్కువే.. కొనుగోలు తక్కువనే చేస్తామంటున్నారు
కిలో ప్యాకెట్‌కు రూ.525 ఉంటే వంద రూపాయలు తగ్గించారు. ఎకరా పొలంలో వచ్చిన దిగుబడి ఎంత ఉంటే అంత కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటే మిగతా విత్తనాలు ఎక్కడ అమ్మాలి. కంపెనీలు, ఆర్గనైజర్ల ఒత్తడి ఎక్కువైంది.
– రవీందర్ ఐజ, గద్వాల జిల్లా
విత్తనం మొత్తం కొనుగోలు చేయాలి
విత్తన పత్తి రైతుల నుంచి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి. ఇప్పటికే ధర లేక లబోదిబోమంటున్న రైతుల నుంచి ఇప్పుడు ఎకరాలో రెండు క్వింటాళ్ల పత్తి విత్తనాలే కొనుగోలు చేస్తామనడం సరికాదు. రైతుల నుంచి ఆగ్రహం రాకముందే కంపెనీలు విత్తనం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలి.
– వెంకటస్వామి, సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శి