– ఆర్థిక బలోపేతంతోనే మహిళలకు స్వతంత్రత : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి ఏడాది మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నిజాం కళాశాల, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నిజాం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం నిర్వహించిన ‘లింగ సమానత్వం-లింగ స్పష్టత’ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఆర్థిక స్వతంత్రత కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందన్నారు. విద్యా సంస్థలు లింగ సమానత కలిగిన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళల సాధికారత రక్షణ, సమగ్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను కలిగి ఉందన్నారు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తదితర పథకాలు ప్రవేశపెట్టినట్ట తెలిపారు. తాను నిజాం కళాశాల పూర్వ విద్యార్థి అని నాటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన శాస్త్రవేత్తలు, ఐఏఎస్, రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక ఉద్యమకారులు, ఇతర నాయకులను తయారు చేసిన సంస్థగా నిజాం కళాశాలకు చరిత్ర ఉందన్నారు. తన మాతృ విద్యా సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న నిధుల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షులు నేరెళ్ల శారద, కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్, అధ్యాపకులు కవిత, ఉదయరాణి, సుధామహాలక్ష్మి, కె.రేవతి, జి.పద్మ, ఉమాదేవి, ఈశ్వరిబాయి, షాహిన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
‘కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES