నవతెలంగాణ – ముధోల్
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి, దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తోందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతకుముందు ఐఐఐటి వసతి గృహంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ఈవో సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మమ్మయి రమేష్ , అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.