డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బాకీ చంద్ర భాను
నవతెలంగాణ – మద్దూరు
గ్రామీణ ప్రాంత ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని డిటిఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర భాను కోరారు. శుక్రవారం మండలంలోని రెబర్తి పాఠశాలలో డిటిఎఫ్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ప్రాంతంలోని విద్యా వ్యవస్థ పట్ల సరియైన ఆదరణ లేక నిరాదరణకు గురైతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థిని విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. వారికి వెంటనే ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించి ప్రభుత్వ విద్యను మెరుగుపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు సరైన స్పందన లేకపోవడం అనేది విడ్డూరంగా ఉందని, ఉపాధ్యాయులకు రావలసినటువంటి డి ఏ లను విడుదల మరియు పిఆర్సి నివేదికను తెప్పించుకోవాల్సిందిగా అదేవిధంగా హెల్త్ కార్డులను ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తో విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులను డిస్టర్బ్ చేయకుండా వారినీ అదేవిధంగా కొనసాగించాలని ఇదే సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో అనేకమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి చేరిన సందర్భంగా వారిని కదిలించకపోవడం మంచిదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింలు ప్రధాన కార్యదర్శి మల్లేశం, కార్యవర్గ సభ్యులు సంపత్, తదితరులు పాల్గొన్నారు.