నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. తమ నియోజవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇంఛార్జి రణదీప్ సూర్జేవాలా వద్ద ఇటీవల ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. బెంగళూరులోని పార్టీ ఆఫీస్‌లో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని సూర్జేవాలా సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్గతంగా జరిగిన చర్చ అనంతరం.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేటాయింపుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల గ్రాంట్‌ను పొందనున్నారు.