ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి
మహిళలు లేకుంటే సమాజమే లేదని, రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్ అధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ… కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళల ఆర్థికా భివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలు చేపట్టి అభివృద్ధి చెందాలని సూచించారు.
మహిళలు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని ఆ ఆలోచనలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని, ప్రతి ఒక్కరు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండాలని తెలిపారు. మహిళలు లేకుంటే సమాజం లేదని, ఆనాటి తరం ఉక్కు మహిళా ఇందిరమ్మ పాకిస్థాన్ ను గజ గజ వణికించిందని స్పష్టం తెలిపారు. ఇందిరమ్మ మహిళా సంఘంలో సభ్యులుగా వుండడం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో పేదరికం వుండొద్దు అంటే మహిళాల చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండాలని భావించిన ప్రభుత్వం రాష్ట్ర రాజధాని శిల్పా రామంలో రూ.300 కోట్లు తో నిర్మించిన స్టాల్ లో మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఆ ఇంటికి ఓనర్ ను మహిళను చేస్తున్నామని అన్నారు. సంగంలో సభ్యులుగా ఉన్న మహిళ మరణిస్తే 2 లక్షల రుణ మాఫీ చేస్తున్నామని తెలిపారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా సంఘం లో సభ్యులుగా చేర్పిస్తున్నామని, అలాగే తల్లిదండ్రులు లేని 16 సంవత్సరాలు నిండిన యువతులను సంగంలో చేర్చుతున్నామని తెలిపారు. అమ్మ చేతి వంటకు కేరాఫ్ అడ్రస్ ఇందిర మహిళా శక్తి అని, అందుకే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు.
గోదాంలు, మిల్లులు, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫామ్ లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సోలార్ విద్యుత్తు, ఆర్టీసీ బస్సులు ఇలా అనేక రకాల వ్యాపార సదుపాయాలు మహిళా సంఘాలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.26 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, క్రమశిక్షణతో తిరిగి చెల్లింపు చేశారని అలాంటి సంఘాల కు వడ్డీ మాఫీ చేసి తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలన జరగాలని, మహిళలు సంతోషంగా ఉండాలని, మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందని, పిలల్లను బాగా చదిస్తారని వివరించారు.
నియోజకవర్గంలో 6 బస్సులు ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా ఇచ్చామని ప్రతి నెలా ఒక్కో బస్సుకు 70 వేల రూపాయలు ఆర్టీసీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. సంగంలో సభ్యురాలు ప్రమాద వశాత్తు మరణిస్తే 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మహిళలు మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువుల వ్యాపారాలు చేసేందుకు శిక్షణ ఇస్తామని అన్నారు. మహిళా సంఘాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది మహిళలు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూమహిళా సంఘలాలలో సభ్యులుగా చేరాలని సూచించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మండలానికి ఒకటి చొప్పున బస్సు ఇస్తున్నామని అన్నారు. నైనిపాక లో 4 ఎకరాలలో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్తు ప్రభుత్వమే కొనుగోలు చేసి సంఘాలను నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి మహిళా సంఘాల పేరున పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళా సంఘాల పేరున
మరణించిన వ్యక్తులకు, జీవాలకు పరిహారం, అలాగే తెగిన చెరువులకు 30.70 కోట్లతో మరమ్మతులు చేసి పంట పొలాలకు సాగు నీరు అందించామని తెలిపారు. జిల్లాలో ఇసుక దందాకు చెక్ పెట్టామని, ప్రజలకు సులభంగా ఇసుక లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 6.60 కోట్లతో గోరి కొత్తపల్లి, గణపురం మండలాల్ల్ ఎంపిడిఓ కార్యాలయాలు నిర్మాణము చేసినట్లు తెలిపారు. 100 కోట్లుతో దెబ్బ తిన్న రహదారులు మరమ్మతులు చేశామని, 5.50 కోట్లతో జిల్లాసమాఖ్య భవన నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ … మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన పనులు, విద్యార్థుల కు యూనిఫామ్స్ కుట్టు పనులు, 6 ఇందిరా మహిళా శక్తి క్యాన్టీలు, మొబైల్ చేపల విక్రయ వాహనం, చెల్పూర్ లో మిల్లెట్ యూనిట్ వంటి మహిళా సాధికారతకు చేపట్టినట్లు
పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత మేరకు మహిళలకు పథకాలు వర్తింపచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, మండల ప్రత్యేక అధికారి వాలియా నాయక్, ఆర్డిఓ రవి,మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీదేవి, కళ్యాణి, ములుగు గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, చిట్యాల ఎంపిడిఓ జయశ్రీ, తహసీల్దార్ ఇమామ్ పాషా, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.