భాగస్వామి ఉండగా మరొకరితో సంబంధం పెట్టుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది కొందరికి తప్పుగా, మరికొందరికి ఒప్పుగా కనిపిస్తుంది. ఏదేమైనా ఎవరి కారణాలు వారికి ఉంటున్నాయి. అసలు ఇలాంటి సంబంధాలు పెట్టుకోవల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో ఆలోచించాలి. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మానవి పాఠకుల కోసం…
స్వాతికి సుమారు 23 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త రాజీవ్‌కు 26 ఏండ్లు. ఇద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరి పెండ్లికి ముందు పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత తప్పక ఒప్పుకున్నారు. ఆరు నెలలు మాత్రం ఇద్దరూ మంచిగానే ఉన్నారు. తర్వాత పరిస్థితి బాగోక స్వాతి వాళ్ల అమ్మ తన ఇంటికి దగ్గరో ఓ ఇల్లు తీసుకొని అందులో వీళ్లను పెట్టింది. దీనికి కారణం రాజీవ్ ఇంట్లో ఏమీ పట్టించుకోడు. రాజీవ్ తల్లి అయితే వీళ్ల గురించి పట్టించుకునేది కాదు. ఈమెకు భర్త లేడు. ఒక అమ్మాయికి పెండ్లి చేసింది, మరో అమ్మాయి పెండ్లికి వుంది. ఈ టైంటో వాళ్లు ఈమె దగ్గరకు వస్తే ఇబ్బంది అవుతుందని ఆమె ఆలోచించింది. దాంతో వాళ్ల బాధ్యత స్వాతి తల్లి యాదమ్మకు తప్పలేదు.
యాదమ్మనే ఇంట్లోకి కావల్సిన సరుకులు ఇప్పించింది. ఇంతలో స్వాతి గర్భవతి అని తెలిసింది. యాదమ్మనే ఆస్పత్రిలో చూపించి మందులు ఇప్పించింది. రాజీవ్ మాత్రం ఎలాంటి పనీ చేయడు. ఎక్కడైనా ఉద్యోగంలో చేరితే మూడు నాలుగు నెలల కంటే చేయడు. స్వాతి కూడా భర్తను ఏమీ అనేది కాదు. పైగా ‘నా భర్తను ఏమీ అనకూడదు. ఇంట్లో వుంటే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఉద్యోగానికి వెళతాడు’ అంటూ అతన్ని వెనకేసుకొచ్చేది. సరేలా పాపో బాబో పుట్టిన తర్వాత బాధ్యత తెలిసొస్తుందిలే అనుకొని వదిలేసింది. కానీ రాజీవ్ మాత్రం బాగా జల్సాలకు అలవాటు పడ్డాడు. బాబు పుట్టిన తర్వాత కూడా అతనిలో మార్పేమీ లేదు. యాదమ్మకు భారం మరింత పెరిగింది. కానీ ఏమీ చేయలేని స్థితి. ఎలాగైనా రాజీవ్‌తో మాట్లాడి ఉద్యోగానికి పంపాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి ఆమెను తిట్టేవారు. దాంతో స్వాతి ‘రాజీవ్ నువ్వు పనికి వెళ్లు. బాబు పుట్టి ఏడాది అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు మనం అమ్మకు భారంగా ఉండడం. ఒక ఉద్యోగం చూసుకో, నేను కూడా ఏదైనా చూసుకుంటాను’ అంది.
‘నన్ను ఉద్యోగం చూసుకోమంటావా’ అంటూ స్వాతిని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టాడు. స్వాతి మాత్రం ఉద్యోగం చూసుకుంది. కొన్ని రోజులకు అతను కూడా ఉద్యోగంలో చేరాడు. బాబును చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో యాదమ్మ పని మానేసి బాబును చూసుకునేది. రాజీవ్ ఉద్యోగానికి వెళ్లినా ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఉద్యోగంతో పాటు కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. తాగుడు, సిగరేట్ మొదలుపెట్టాడు. దాంతో స్వాతి అతన్ని దూరం పెట్టేది. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రాజీవ్ ప్రవర్తనతో స్వాతి విసిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే రెండో సారి గర్భవతి అయ్యింది. డాక్టర్ ‘బలహీనంగా ఉన్నావు, దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు, మంచి ఆహారం తీసుకో’ అని చెప్పారు.
ఇవేమీ పట్టించుకోని రాజీవ్ ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. వచ్చినా ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. స్వాతి ఫోన్ చేస్తే మాత్రం ‘నేడు డ్రైవింగ్‌లో ఉన్నాను’ అంటూ కట్ చేసేవాడు. దాంతో స్వాతి ఒకరోజు అతను పని చేసే ఆఫీస్‌కి వెళ్లితే అసలు నిజం బయటపడింది. రాజీవ్ అతనితో పాటు పని చేసే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ‘ఇలా ఎందుకు చేస్తున్నావు’ అంటే ‘నాకు ఆమె నచ్చింది కాబట్టి ఆమెతో మాట్లాడుతున్నాను’ అన్నాడు. యాదమ్మకు కూడా విషయం తెలిసింది. దాంతో ఆమె ‘నువ్వు దూరం పెట్టడం వల్ల అతను ఇంకో అమ్మాయిని చూసుకున్నాడు. అదే నువ్వు అతనికి దగ్గరైతే ఆమెను వదిలేస్తాడు’ అంది.
దాంతో తల్లి చెప్పినట్టే చేసేందుకు సిద్దమయింది స్వాతి. కానీ రాజీవ్ మాత్రం ఆఫీసులో అమ్మాయికి బాగా దగ్గరయ్యాడు. స్వాతిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. అప్పుడు స్వాతికి ఎనిమిదో నెల. ఇంకా ఆలస్యం చేస్తే భర్త తనకు పూర్తిగా దూరమవుతాడనే భయం పట్టుకుంది.
మేము రాజీవ్‌ను పిలిచి మాట్లాడితే ముందు అతను తన తప్పుని ఒప్పుకోలేదు. ‘స్వాతి చెప్పింది విని మీరు నన్ను ఇలా అడుగుతున్నారు. ఆమె చెప్పిందే నిజమని నమ్ముతున్నారు’ అన్నాడు. అలా చేసేవాళ్లమే అయితే మిమ్మల్ని పిలిచేవాళ్లం కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామనే మిమ్మల్ని పిలిచాము అన్నాము. దానికి అతను ‘నన్ను అసలు మనిషిలాగే చూడదు. కనీసం అన్నం కూడా పెట్టదు. అన్నం పెట్టమంటే ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలి’ అంటుంది. ఎలా పడితే అలా మాట్లాడుతుంది’ అని చెబుతుంటే మధ్యలో స్వాతి కల్పించుకొని ‘ఇంట్లోకి సరుకులే తీసుకురాడు, అలాంటప్పుడు ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలి’ అంది.
‘మా ఆఫీసుకు ఫోన్ చేసి ‘జీతం ఇచ్చారా, ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు’ అని అడుగుతుంది. అక్కడ అందరూ నన్ను ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు’ అన్నాడు. ఇది నిజమేనా స్వాతి అంటే ‘అవును మేడమ్ అతను జీతం తీసుకు వచ్చి ఇవ్వడు, అందుకే అలా అడుగుతాను’ అంది. ‘నన్ను దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. నేను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానని తెలిసి ఆమెలో కాస్త మార్పు వచ్చింది. లేదంటే గతంలో నన్ను ఓ పురుగును చూసినట్టు చూసేది. ఆమె వల్లనే నేను మాలతితో సంబంధం పెట్టుకున్నాను. లేదంటే నాకు అలాంటి ఆలోచనే లేదు’ అన్నాడు.
ఇందులో మీ ఇద్దరి పొరపాటు ఉంది. స్వాతి ప్రస్తుతం నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. టెన్షన్ పడడం నీ కడుపులో బిడ్డకు మంచిది కాదు. చూడు రాజీవ్ నువ్వు తాగి గొడవ పెట్టుకోవడం, ఇల్లు పట్టించుకోకుండా ఉండడం చేస్తే ఏ భార్య అయినా ఎలా దగ్గరకు రానిస్తుంది. పైగా మీ భార్యపై కోపంతో మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావు. ఇది కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయి. మేము స్వాతితో మాట్లాడతాము ఇకపై ఆమె నీతో ప్రేమగా ఉంటుంది. నువ్వు కూడా ఇంట్లో బాధ్యతగా ఉండాలి. పైగా ఇద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జీవితాంతం కలిసి బతకాలి. అప్పుడే మీది నిజమైన ప్రేమ అవుతుంది. అలా కాకుండా చిన్న చిన్న కారణాలకు గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. మరో బిడ్డ పుట్టబోతుంది. ఖర్చులు ఇంకా పెరుగుతాయి. అలాంటప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కేవలం భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులుగా ఆలోచించండి. పిల్లలు మంచి వాతావరణంలో పెరిగితేనే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇలా మీరు గొడవలు పడుతుంటే వాళ్లు రేపు ఎలా తయారవుతారో ఆలోచించుకోండి’ అని చెప్పాము. ఇద్దరూ దానికి ఒప్పుకొని వెళ్లారు.
– వై వరలక్ష్మి, 9948794051
ఇద్దరిదీ తప్పే…
- Advertisement -
- Advertisement -