వ్యవస్థ చర్మం మొద్దుబారింది. చర్మమేకాదు, హృదయమూ బండబారింది. సామాన్యంగా కదలిక కనపడటమే లేదు. నగమునిగారన్నట్లు ఇది ‘కొయ్య గుర్రం’. దీనిని కదిలించడం, ఆలకించాలని ఆశించడం వృధా ప్రయాసగానే అనిపిస్తున్నది. అధికారం అంత మత్తెక్కి ఉన్నది. రాజకీయ మైలేజీ కోసం మాత్రం ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తారు. కానీ సామాన్య మహిళ రోదనలతో వేడుకున్నా ఆలకించలేని బధిరత్వం రాజకీయ ఆధిపత్యానిది. ఆ వ్యవస్థను కదిలించాలంటే, నిలువునా కాలిపోవాలి. మనల్ని మనం హత్య చేసుకోవాలి. కత్తులతో పొడుచుకోవాలి. ఆ పారే రక్తపు ధారల వేడిమితో మాత్రమే వారి రెప్ప కదులుతుంది. ప్రాణంతో ధ్వనించిన గొంతుకు ఎవరూ ప్రతి స్పందించలేదు. శవమై విడిచివెళ్లిన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఒరిస్సా బాలాసోర్‌లో సౌమ్యశ్రీ ఇప్పుడు శవమై ప్రశ్నల కుప్పలా పడిఉన్నది. భావి పౌరులను తీర్చిదిద్దే ఉపా ధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యాధిక యువతి ఆమె. ఈ పురుషాధిక్య విషవర్తనం, అమానవీయ ఆలోచనల రాజకీయ దుర్లక్షణం, ఆమె భవితను బుగ్గిపాలు చేసింది.
‘బేటీ పడావ్, బేటీ బచావ్’ అనేవి నినాదాలే కానీ, విధానాలు కాదని, వాళ్ల ఆలోచనలే వేరని చెబితే వినిపించుకున్నదెవ్వరు! ఆడపిల్లల విధులు, బాధ్యతలు – భర్తకు సేవలు చేస్తూ, ఇంటి, వంటింటి పనులు చేస్తూ, పిల్లలనుకని పెంచటంలోనే సార్థకత ఉందని బోధించిన మనువుధర్మాల అనుచరుల ఆచరణ ఇలానే ఉంటుందని తెలియక ఆహుతి కావటమేకదా ఇది! సనాతన ధర్మాచారాలను పాలనలోకి, పాఠ్యాంశాలలోకి, పాలకుల బుర్రల్లోకి ప్రవహింపజేస్తుండగా, ఇలాంటి సంఘటనలకు భిన్నంగా ఎలా జరుగుతుంది! ఇది ఒక చోట జరిగిన సంఘటన మాత్రమే కాదు. ఆమె అచేతనమై, మనల్ని నిద్రలేపుతున్నది. ఈ వ్యవస్థపై రుద్దుతున్న ఆలోచనలు ఎంతెంత అనాగరికంగా, అమానుషంగా ఉన్నాయో ఎరుక పరుస్తున్నది. ఇంట్లో నుండి బయటికి వచ్చిన, అది చదువుకోసం, ఉద్యోగం కోసం, ఉద్యమం కోసం. ఏదైనా సరే మహిళలు, ఆడపిల్లలు ఎదుర్కొంటున్న దాడులు, దారుణాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడీ సౌమ్యశ్రీ ఏం చేసింది? బాలాసోర్‌లో ఫకీర్ మోహన్ కళాశాలలో బి.ఇడి చదువుతున్నది. ఇంటిలోని కొన్ని కారణాలవల్ల కళాశాలలో హాజరు శాతం కొద్దిగా తగ్గింది. అందుకని, ఆ విభాగపు హెడ్‌ను సహాయం చేయమని వేడుకుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న హెడ్ సమీర్ కుమార్ సాహు ఆమెను లైంగికంగా వేధించడం మొదలేసాడు. ఆమె ససేమిరా అన్నది. నిరాకరిస్తే, ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తానని బెదిరించి వేధించాడు. సౌమ్యశ్రీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఏ రకమైన స్పందన లేకపోగా అంతర్గత దర్యాప్తులో సైతం హెడ్‌ను కాపాడే ప్రయత్నం జరిగింది. హెడ్ సమీర్ కుమార్ సాహు తప్పేమీ లేదని తేల్చింది. సౌమ్యశ్రీని ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని ప్రిన్సిపాల్ హెచ్చరించాడు. లేకుంటే కళాశాల నుండే సస్పెండ్ చేస్తానని బెదిరించాడు. ఆమె ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, కేంద్ర మంత్రులకు, అధికారులకు న్యాయం చేయాలని లేఖలు రాసింది. కానీ ఎవరూ స్పందించలేదు. ఎవ్వరూ స్పందించలేదు. చివరికి జులై 12న కళాశాల యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేసింది. ప్రిన్సిపాల్ కార్యాలయం బయట సౌమ్యశ్రీ తనపైనే తాను పెట్రోలు పోసుకుని తగులబెట్టుకున్నది. భగ్గున లేచిన మంటల రోదనలో కాలిపోయింది. ఏ సహాయమూ అవసరంలేని చోటుకి నిస్సహాయంగా వెళ్ళిపోయింది.
సౌమ్యశ్రీ ఆ కళాశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘంలో సభ్యురాలే, నాయకురాలే. అది బీజేపీ అనుబంధ సంస్థే. అక్కడ రాజ్యమేలుతున్నది ఆ పార్టీ ప్రభుత్వమే. అన్యాయం చేసిందీ, వేధింపులకు గురిచేసిన వారిని కాపాడే ప్రయత్నం చేసిందీ వారే. అందుకనే ”ఇది సంస్థాగతమైన హత్య. అధికారంలో ఉన్న వారి సహకారంతో జరిగిన హత్య. ఆమె బ్రతికున్నప్పుడు చేసిన ఫిర్యాదులన్నీ వాళ్ల దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ల నోళ్ళన్నీ మూతలు పడిపోయి ఉండెను. ఆమె సొంత సంఘమూ ఏమీ చేయలేకపోయింది. అందుకనే తనకు తానే ఆత్మహత్య చేసు కోవాల్సి వచ్చింది. ఒక మహిళ న్యాయం కావాలని అరిస్తే, అభ్యర్థిస్తే మౌనందాల్చే వ్యవస్థ దుర్మార్గం ఇది” అని ఉద్యమకారిణి బృందాకరత్ అన్న మాటలు వాస్తవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంఘటనా స్థలానికి రావచ్చుగాక, ప్రిన్సిపాల్‌ను, హెడ్‌ను సస్పెండ్ చేయవచ్చుగాక, 20 లక్షల రూపాయలు ప్రాణానికి పరిహారం ప్రకటించవచ్చు గాక, ఇవన్నీ కంటనీరొలకని కంటి తుడుపు చర్యలే. సౌమ్యశ్రీకి ఎలాంటి న్యాయం జరగని చర్యలు. విద్యార్థులు, యువత, మానవీయులందరూ ఆలోచించవలసిన సంఘటన ఇది.
క్షమించు సౌమ్యశ్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES