తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సాంస్కృతిక విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తుల నుండి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ విషయంలో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేసి దానికి ప్రొ.ఎ.కోదండరామ్‌ను అధ్యక్షుడిగా నియమించింది. ఇది ఆహ్వానించదగినది. అయితే సలహా మండలి ఏ సూచనలు చేస్తుంది, ప్రభుత్వం వాటిలో వేటిని స్వీకరిస్తుంది, వేటిని అమలు చేస్తుంది? అన్నది భవిష్యత్తులోనే తెలుస్తుంది. వివిధ అంశాలపై ప్రభుత్వం సలహా మండళ్లను వేసి వాటికి ఛైర్మన్లను నియమించడం రాజకీయ అవసరాలను నెరవేర్చుకోవడానికా? లేక నిజంగానే ఆయా రంగాల్లో మార్పుల కోసమా అన్నది కూడా ఆచరణలోనే తెలుస్తుంది.
సమాజంలో అమల్లో ఉన్న సంస్కృతి ఆధారం గానే సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందుతాయి. వివిధ రూపాల్లో ప్రదర్శింపబడతాయి. వర్గ పాలనలో సంస్కృతి కూడా ఒక దోపిడీ సాధనమే. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు గడిచినా అది ప్రభోదించే విలువలకు నేడు అమల్లో ఉన్న సంస్కృతికి మధ్య చాలా అంతరం ఉంది. రాజ్యాంగం ఒకటి చెప్తుంటే ఆచరణలో దానికి వ్యతిరేకమయిన సంస్కృతి చెలామణిలో ఉంది. ఆచరణలో ఉన్న సంస్కృతి ఆధారంగానే సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందుతాయి కనుక రాజ్యాంగ ప్రబోధాలకు, విలు వలకు అనుగుణంగా సంస్కృతి సంస్కరించుకునే మౌలిక ప్రయత్నం జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి భారత రాజ్యాంగం అంటేనే కంపరం. రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం పట్ల సాంస్కృతిక మార్పునకు పూనుకోవాలి. భక్తి శ్రద్ధలు చూపేదే అయితే అలా కాకుండా తెలంగాణ సంస్కృతి పేర అర్థంలేని ఆచారాలను నెత్తికెత్తుకొంటే, ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత కసరత్తు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనమేమి ఉండదు.
భారతదేశం సర్వసత్తాక, స్వాతంత్య్ర, గణతంత్ర సోషలిస్టు లౌకిక దేశమని రాజ్యాంగం చెబుతోంది. ఆ ప్రకటిత విలువల్లో నుండి సోషలిస్టు, లౌకిక అన్న పదాలను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ పదాలను ఇందిగాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేర్చారు గనుక వాటిని తొలగించాలని వాదిస్తోంది. ఇందిరా గాంధీ చేర్చారు గనుక తొలగించాలన్నది వట్టి కుంటిసాకు మాత్రమే. సమానత్వం, లౌకికతత్వం అన్న మాటలు అంటేనే బీజేపీకి వెగటు. అయితే వాజ్‌పేయి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీయ సోషలిజం తమ విధానమని ప్రకటించారు గదా అని ఎవరైనా అడగవచ్చు! మూలవిరాట్టు, ఒకటి ఉత్సవ విగ్రహం మరొకటి అన్నట్టుగా బీజేపీకి రెండు వ్వూహాలుంటాయి. ఒకటి అసలు వ్వూహం, రెండవది అవసరాన్ని బట్టి తాత్కలికంగా ప్రకటించే కపట వ్యూహం. రెండో తరహాదే గాంధీయ సోషలిజం. బీజేపీ నేడు కోరుకొంటున్న ‘కులగణన’ కూడా అలాంటి తరహాదే.
రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కూడా వర్ణవ్యవస్థ, కులవ్యవస్థల ప్రభావం మనదేశంపై కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో సమూల మార్పునకు కాంగ్రెస్ కూడా ఇష్టపడలేదు. ఎన్నికల్లో కులాన్ని అది కూడా వాడుకుంటూ వచ్చింది. ఆ కారణంగా మనుషుల్లో సమాన భావాలకు బదులుగా ఆధిపత్య భావనలే ఇప్పటికీ బలంగా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆ సామాజిక భావలకు విరుద్ధం. విద్యావంతులకు, ఆస్తిపరులకు మాత్రమే ఓటుహక్కు కల్పించిన స్థానంలో సార్వత్రిక ఓటుహక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ ప్రకారం ప్రస్తుతం 18 ఏండ్లు దాటిన స్త్రీ,పురుషులందరూ ఓటు వేయవచ్చు. ఒక ఓటుకు ఒకే విలువ అని కూడా స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అంబానీ ఓటుకైనా గుడి మెట్లమీది యాచకునికైనా ఓటుకైనా ఒకే విలువ ఉంటుంది. అయితే ఆర్థిక సమానత్వం సాధించకుండా సామాజిక సమానత్వం సాధ్యం కాదని ఆచరణలో రుజువైంది. ఆ ఆర్థిక అసమానతే మన ప్రజాస్వామ్యాన్ని క్రమంగా ధనస్వామ్యంగా మార్చేసింది.
మనల్ని ఏ పార్టీ పాలించాలో ఓటు నిర్ణయిస్తుంది. సాధారణ ప్రజల్లో ఓటు పట్ల రావాల్సిన చైతన్యం ఇంకా రాలేదు. ఎన్నికలు ఓట్ల పండగలా పరిణమించాయి. రాజ్యాంగ స్ఫూర్తి నుండి ఓటర్లు మరింత దూర మవుతూనే ఉన్నారు. ఓట్ల పండగలో కొన్ని రోజులపాటు నిరుద్యోగులకు, చిరుద్యోగులకు రోజు కూలీ లభిస్తుంది. జెండాలెత్తుకొని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరిగేపని, బహిరంగ సభలకు హాజరై చప్పట్లు చరిచే పని ఉంటుంది. పోలింగ్ రోజు నాడు ఓటర్ల నగదు డబ్బులే అందుతాయి. అయితే ఎన్నికల్లో నిల్చిన అన్ని పార్టీలు ఈపని చేస్తాయని కాదు. వామపక్షాలకు, మరికొన్ని పక్షాలకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి. ఈ వ్యవహారం ఇప్పుడు ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పాకడం కూడా మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు సంచులు ఎలా మారుతాయో తెలియచెప్పే వీడియోలు కూడా చూశాం కదా!
ప్రస్తుత ఎన్నికల సంస్కృతిని ఇలాగే కొనసాగనివ్వాలా? లేక ఈ సంస్కృతిని అడుకుని రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఎన్నికల తీరును సంస్కరించుకోవాలా? అన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని అనుకుంటే ప్రభుత్వం, దాని సాంస్కృతిక సలహా మండలి కడుపులో చల్లకదలకుండా సుభాషితాలు చెబుతూ కూర్చోవచ్చు. అలా కాకుండా రాజ్యాం గాన్ని గౌరవించాలని అనుకుంటే చేతల్లోకి దిగాలి. దానికి అనుకూలమైన సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిం చుకోవాలి. వాటిని విస్తృతంగా ప్రదర్శిం చాలి. సోషల్ మీడియాను వాడుకోవాలి. రాజ్యాంగం ప్రబోధిస్తున్న లౌకిక విలువలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. జానపద, శాస్త్రీయ నృత్యాలను, ప్రదర్శనలను అందుకు వాడుకోవాలి.
సాంప్రదాయ ఇతివృత్తాల పట్ల, ఆ భావనల పట్ల ప్రభుత్వం, సలహా మండలి జాగ్రత్తగా ఉండాలి. వర్ణం, కులం, ప్రాంతం, భాషా ఆధిపత్యాలతో పాటు నేడు నిరాటంకంగా చెలామణి అవుతున్న పురుషాధిపత్యాన్ని పారదోలడం కూడా సాంస్కృతిక శాఖ తన ఎజెండాలోకి తీసుకోవాలి. కుటుంబంలో, రాజకీయాల్లో నేడు పురు షాధిపత్యమే చెలామణి అవుతుంది. పెండ్లిలో నేడు అసాంతం పురుషాధిపత్యమే చెల్లుబాటవుతుంది. మన ఆచారాలు ‘ఆడపిల్ల పుట్టడమే..పుట్టెడు భారంతో పుడుతుంది.’ అన్న భావనను కలిగిస్తున్నాయి. మన వివాహ వ్యవస్థను చూడండి పెండ్లిచూపులతో మొదలు పెట్టి ప్రసవం వరకు ఖర్చంతా అమ్మాయి ఇంటిపై దుర్మార్గంగా నెడుతున్నారు. ఇంటి పనిని మగవాళ్లు పంచుకోవడం ఇంకా నామోషీగానే ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ఇప్పటికీ వారు ఆకుచాటు పిందెల్లా ఉంటున్నారు. కావాలంటే హైదరాబాదు రోడ్లపై మహిళా కార్పోరేటర్ల ఫ్లెక్సీలు చూడండి. కార్పోరేటర్ బొమ్మ చిన్నగా ఆమె భర్త బొమ్మ పెద్దగా ఉంటుంది. స్థానిక సంస్థలు చట్టసభలకు ఎన్నికైన మహిళల స్థితి కూడా దీనికి భిన్నం కాదు. కింది కులాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా ఆధిపత్య వర్గాలకు లొంగి వ్యవహరించాల్సి వస్తుంది.
పెండ్లిళ్లలో ఇప్పటికీ కులానిదే ప్రధాన పాత్ర.అక్కడ కుల సాంద్రతను తగ్గించాలంటే కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించి, ఆ జంటలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించాలి. పెండ్లి చేసుకున్న జంటలో ఒకరు కిందికులం వారయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహం వెంటనే అందాలి. మతాంతర వివాహాలకు ‘లవ్ జిహాద్’ అన్న పేరు పెట్టి బీజేపీ ప్రభుత్వాలు, ఆ పార్టీ సంఘాలు అనాగరికంగా అడ్డుకొంటున్నాయి. కాంగ్రెస్ వైఖరి దానికి భిన్నమని ఆచరణలో చూపెట్టాలి. ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గంలో కులాంతర వివాహాలు చేసుకొన్నవారు ఉండటం సంతోషం. కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడం ప్రభుత్వ విధానమే అయినా, ఆచరణలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆ పెండ్లిళ్లను రిజిస్టర్ చేయడంలో అధికారులు శషబిషలు పడుతున్నారు. కనుక ఆ నిబంధనలను సడలించాలి. పోలీసుల్లో కొందరి కులదురహంకార ప్రవర్తన రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉంది. అలాంటి ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించే సంస్కృతిని సృష్టించడం కూడా ప్రభుత్వం తన బాధ్యతగా భావించాలి.
ప్రజల్లో ఇంకా చాలా మూఢనమ్మకాలున్నాయి. వాటిని తొలగించే పనికి ప్రభుత్వం ప్రత్యేకంగా పూను కోవాలి. మన శాస్త్రజ్ఞుల గురించి శాస్త్ర విజ్ఞానంలో సాధించిన పురోగతి గురించి ప్రజలకు తెలియదు. మూఢ నమ్మకాలను తొలగించి విజ్ఞానవంతులను చేసే బాధ్యతను సాంస్కృతిక శాఖకు అప్పగించాలి. అలాగే మహాత్ముల జీవితాలు, బోధనలు విజయాలు కూడా ప్రజలకు తెలియ చెప్పాలి. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయి పటేల్, సుభాష్ చంద్రబోస్, అష్వాఖుల్లా ఖాన్, భగత్‌సింగ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సి.వి. రామన్, రామానుజం, హోమి జె బాబా, అబ్దుల్ కలాం వంటివారు సాధించిన విజయాలను సాధారణ ప్రజలకు చెప్పే కార్యక్రమాలను రూపొందిచుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలపై పెత్తనం చేస్తోంది. గవర్నర్లను తన పనిముట్లుగా వాడుతోంది. నవంబర్‌లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధి జోహ్రన్ మందాని గెలిస్తే తానే నేరుగా న్యూయార్క్ నగరాన్ని పరిపాలిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అలాంటి దురదృష్ట స్థితి మనకు రాకుండా ప్రజలను చైతన్యపరిచే పని కూడా సాంస్కృతికశాఖదే తాను కూడా స్థానిక సంస్థల స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి.
ఎస్.వినయకుమార్ 9989718311
మన సంస్కృతిని సంస్కరించుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES