– కష్టనష్టాల్లో మత్స్యకారులు
– నేరుగా మత్స్య సొసైటీల ఖాతాలకు నగదు జమచేయాలని డిమాండ్
– ప్రతిసారీ టెండర్లు ఆలస్యం.. ఏడాదికి మూడు సార్లు పిలుపు
– చేప పిల్లల కొనుగోళ్లలో నాణ్యతకు పాతర
– సిండికేట్ అవుతున్న కాంట్రాక్టర్లు
– బిల్లుల కోసం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం
– రాష్ట్రంలో 26,357 చెరువులు.. 4,11,300 మంది మత్స్యకారులు
– వీరందరి జీవితాలపై ప్రభావం
చేపా…చేపా…ఎందుకు ఎండలేదు? అంటే గడ్డిమోపు అడ్డమొచ్చిందీ…అన్నదట! ఇప్పుడు మత్స్యశాఖలోనూ ఇలాంటి కారణాలనే చెప్తున్నారు. వర్షాలు పడేటప్పుడు ఇవ్వాల్సిన చేపపిల్లల్ని, ఆకాలం వెళ్లిపోయాక ఇస్తున్నారు. దీనితో ఏటా చేప పిల్లల పంపిణీలో మత్స్యకారులకు కష్టనష్టాలు తప్పట్లేదు. మత్స్యశాఖ డైరెక్టరేట్ అధికారుల సంబంధీకులు బినామీలుగా మారి ప్రతి సంవత్సరం కాంట్రాక్టు దక్కించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లులు చేతిలో పడేంత వరకూ వారు టెండర్లలో వ్యూహాత్మక జాప్యం చేస్తున్నారు. దీనితో మత్స్యకారులు తీవ్రగా నష్టపోతున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను ఎత్తేసి నేరుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే, సకాలంలో చేప పిల్లల్ని చెరువుల్లో పోసుకుంటామని మత్స్యకారులు చెప్తున్నారు. కానీ కమీషన్లు, బినామీలకు అలవాటుపడిన కొందరు అధికారులు ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో టెండర్ పద్ధతిలో చేప పిల్లల పంపిణీ కాకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల (సొసైటీ)కు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. చేప పిల్లల పంపిణీ టెండర్ దక్కించుకునే కాంట్రాక్టర్లు వాటి సైజు, నాణ్యత, సంఖ్య విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల నష్టపోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. అందుకే కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం కంటే నేరుగా సొసైటీల ఖాతాలకే నగదు బదిలీ చేస్తే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉంటుందని సూచిస్తున్నారు.
టెండర్‌దారుల సిండికేట్..
చేపపిల్లల పంపిణీ పథకం కోసం ప్రభుత్వం జిల్లాల వారీగా టెండర్లు పిలుస్తోంది. 10 నుంచి 12 మంది కాంట్రాక్టర్లు వీటిని దక్కించుకుంటున్నారు. కొందరు అధికారుల సంబంధీకులు బినామీలుగా అవతారం ఎత్తుతున్నారు. టెండర్ పొందిన తర్వాత సరిగ్గా పంపిణీ చేయటం లేదు. అయినప్పటికీ వీరికి ఏటా రూ.100 కోట్లు చెల్లింపులు చేస్తున్నారు. మత్స్యశాఖ డైరెక్టరేట్ అధికారుల సంబంధీకులే టెండర్‌దారులు కావ టంతో సిండికేట్‌గా మారుతున్నారన్న ఆరోపణలు న్నాయి. వ్యూహాత్మకంగా టెండర్లకు ముందుకు రాకుండా నిరాకరి స్తున్నారని ఫిర్యాదులున్నాయి. జాప్యమయ్యే కొద్దీ మత్స్య సొసైటీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ ప్రభావం ప్రభుత్వం పై పడేలా చేసి, పెండింగ్ బిల్లులను విడుదల చేయించు కున్న తర్వాత టెండర్లకు సిద్ధమవుతు న్నారు. గతేడాది మూడుసార్లు టెండర్లు పిలిచారు. 2024 జులై 23న ఒకసారి, ఆగస్టు 2న మరోసారి టెండర్లు పిలిచారు. రెండు సార్లూ ఎవరూ ముందుకు రాకపోవడంతో తిరిగి ఆగస్టు 13న మూడోసారి టెండర్లు పిలిచారు. ఏటా రాష్ట్ర వ్యాప్తం గా 23వేలకు పైగా చెరువుల్లో చేపల పెంపకం చేపడ తారు. చిన్న చెరువుల్లో 35-40 మి.మీ పిల్లలు 41.63 కోట్లు, పెద్ద చెరువుల్లో 80-100 మి.మీ పైగా సైజ్ ఉన్న పిల్లలు 34.74 కోట్లు పంపిణీ చేస్తారు. అలాగే 357 మంచినీటి చెరువులకు 9.15 కోట్ల రొయ్యపిల్లలనూ సరఫ రా చేస్తారు. చిన్న చేపపిల్లలకు హెక్టార్‌కు మూడు వేల చొప్పున లక్ష పిల్లలకు రూ.51వేలు, పెద్దవాటికి హెక్టార్ కు రెండువేల చొప్పున లక్ష పిల్లలకు రూ.1.61 లక్షలు చెల్లిస్తారు.
ఏటా ఆలస్యమే…
రాష్ట్రంలో 32 జిల్లాల్లో 5,969 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సొసైటీల్లో మొత్తం 4,11,300 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. 26,357 చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపడుతున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద సాగునీటి వనరుల్లో పెంపకానికి సుమారు 90 కోట్ల చేప పిల్లలను అందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన చేప పిల్లల బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు రాబట్టుకునేందుకు పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ కారణంగా చేప పిల్లల విడుదలలోనూ జాప్యం జరిగింది. టెండర్ల ఖరారు ఆలస్యమైన కారణంగా గతేడాది జూన్, జులైలో పంపిణీ కావాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వరకు అందించారు.
సుదీర్ఘకాలంగా నగదు బదిలీ డిమాండ్
చేప పిల్లల సరఫరాను కాంట్రాక్టర్లకు అప్పగించకుండా, సొసైటీలకు నేరుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే చెరువుల్లో పోయాల్సిన చేప పిల్లలను పోయడం లేదు. సైజు విషయంలోనూ తేడాలు ఉంటున్నాయి. దాంతో తాము నష్టపోతున్నామని మత్స్యకారులు అంటున్నారు. అయితే చేప పిల్లలకు బదులుగా సొసైటీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తే తామే అవసరమైనన్ని నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామంటున్నారు. ఈ సీజన్నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇంకా ప్రారంభం కాని ప్రక్రియ..
ఈ ఏడాది చేపల పెంపకం సీజన్ మొదలైంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల సరఫరాకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మత్స్యశాఖ అధికారులు జిల్లాల వారీగా చేపల పెంపకానికి అనువైన చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్లుల వివరాలు, ఆయా వనరుల్లో పెంపకానికి ఎన్ని చేప పిల్లలు అవసరమనేది గుర్తిస్తు న్నారు. ఉన్నతాధికారులకు ఇండెంట్ పెడుతున్నారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. జులై నెల వచ్చినా ఇంతవరకు చేప పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. కాబట్టి ఈసారి ఉచిత చేప పిల్లల సరఫరా ఉంటుందా? ఉండదా? అని మత్స్య సహకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సొసైటీల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి
కాంట్రాక్టర్ల ద్వారా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసే బదులు నేరుగా సొసైటీలకు నగదు బదులీ చేయాలి. సొసైటీ పరిధిలోని చెరువులు, కుంటల్లో ఎంత మొత్తంలో చేప పిల్లలు పోస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం సొసైటీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తే సకాలంలో పిల్లలు పోసుకుంటాం. చెరువులు, కుంటలు నిండగానే మంచి నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసి వదులుతాం.
– రొడ్డా కృష్ణయ్య, వనంవారికిష్టాపురం, మత్స్య సొసైటీ అధ్యక్షులు
చేపపిల్లల్ని మింగేస్తున్న కాంట్రాక్టర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES