Saturday, July 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునీళ్లు బాబుకు..నిధులు రాహుల్‌కు..

నీళ్లు బాబుకు..నిధులు రాహుల్‌కు..

- Advertisement -

తెలంగాణ ప్రజలకు బూడిదే
ఇక్కడి ప్రయోజనాలు తాకట్టుపెడితే ఊరుకోం
బనకచర్ల విషయంలో కేంద్రం ముందుకు రావాలి
టన్నుల కొద్ది కేసులు పెట్టినా..ఆధారం దొరికిందా?
సీఎం అంటూ రేవంత్‌పై కేటీఆర్‌ ఆగ్రహం
ఇప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లు మావేనంటూ కార్యకర్తల సమావేశంలో వెల్లడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

నీళ్లు చంద్రబాబుకు.. నిధులు రాహుల్‌కు.. తెలంగాణ ప్రజలకు బూడిదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతీది నిర్వీర్యం అయిందన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెడితే బీఆర్‌ఎస్‌ ఊరుకోదని తెలిపారు. 1968 టీఎంసీల నికర, 1950 టీఎంసీల మిగులు జలాలను తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే..

”గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప.. నికృష్టపు మాటలు తప్ప.. ఏమీ రావు అని తేలిపోయింది. ఒకరోజు ఫోన్‌ ట్యాపింగ్‌, మరో రోజు ఫార్ములా ఈ, ఇంకోరోజు డ్రగ్స్‌, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్‌.. 20 నెలల్లో ఈ రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కేసీఆర్‌ జపం చేయటం, డైవర్షన్‌ ట్యాక్‌టిక్స్‌, హెడ్‌లైన్‌, డెడ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ తప్ప చేసిందేంది. ముఖ్యమంత్రై రెండేండ్లయింది. మీ వల్ల వీసమెత్తయినా లాభం పొందిన మనిషిని గానీ, వర్గాన్ని గానీ చూపెడుతారా..? రేవంత్‌రెడ్డి వల్ల బాగా లాభప డింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్స్‌ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్లు, దిక్కుమాలిన థంబ్‌నేల్‌ను నడుపుకునే కొందరు మాత్రమే.. 20 నెలల్లో టన్నుల కొద్దీ కేసులు పెట్టిండు.. గుండుపిన్నంత ఆధారం దొరికిందా? తప్పు చేస్తే కదా.. భయపడటానికి.. మేము ఏమి తప్పు చేయలేదు కాబట్టే.. దమ్ముంటే లై డిటెక్టర్‌ పరీక్ష పెట్టన్న.. మొదటి రాజకీయ నాయకున్ని నేనే. ఓటుకు నోటు కేసులో డబ్బులు తీసుకోలేదు.. ఇవ్వలేదని.. లె ౖడిటెక్టర్‌ దగ్గర చెప్పే దమ్ము నీకుందా..?” అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇదిగో పులంటే.. అదిగో తోకనేలా.. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం
ఈమధ్య ఇదిగో పులంటే.. అదిగో తోకనేలా ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం నడుస్తోందని కేటీఆర్‌ అన్నారు. ఈ హీరోయిన్‌, ఆ హీరోయిన్‌, ఈయన డ్రగ్గులు వాడాడు.. ఆయన డ్రగ్గులు వాడాడు.. ఒక్కడంటే ఒక్కడు ఈ ప్రభుత్వంలో వ్యక్తిగానీ, అధికారిగానీ చెప్పారా అని నిలదీశారు. ఫలానా ఆయన ట్యాపింగ్‌ చేశాడని ఎవరైనా చెప్పారా? ఏంటీ న్యూసెన్స్‌ అని ప్రశ్నించారు.

లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి?
అర్ధరాత్రిపోయి నేను లోకేశ్‌ను కలిశానంట..! తాము ఏది చేసినా బాజాప్తుగా చేస్తామని, బేజాప్తుగా చేయాల్సిన కర్మ లేదని కేటీఆర్‌ అన్నారు. లోకేశ్‌ ఏమైనా అంతరాష్ట్ర దొంగనా? నీలెక్క సంచులు మోసినోడా? అని సీఎంను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. లోకేశ్‌ను కలవలేదు.. కలిస్తే తప్పేంటని అన్నారు. లోకేశ్‌తో తనకు సత్సంబంధాలున్నాయని తెలిపారు. ఆరు గ్యారంటీలు మర్చిపోదామా.. 420 దొంగ హామీలు మర్చిపోదామా.. అని ప్రశ్నించారు. ముసలోళ్లకు ఇస్తనన్న రూ.4వేల పెన్షన్‌, రైతులకు ఇస్తానన్న బోనస్‌ మర్చిపోదామా అని ప్రశ్నించారు. ‘దుబారులో ఎవడో చనిపోతే దాన్ని తనకు అంటగట్టడమేంటి.. రాష్ట్ర ముఖ్యమంత్రివా..? శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? అని తూలనాడారు.

దొంగతనం చేయటం.. దొరికిపోవటం రేవంత్‌ స్పెషాలిటీ
దొంగతనం చేయటం.. దొరికిపోవటం.. రేవంత్‌రెడ్డి స్పెషాలిటీ అని కేటీఆర్‌ విమర్శించారు. సీఎం బనకచర్ల అంశమే రాలేదంటాడు.. ఆంధ్రా మంత్రి రామానాయుడు మొదటి అంశమే బనకచర్ల అని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌ ఇచ్చారు.. రేవంత్‌ ఓకే అన్నడు.. 30 రోజుల్లో కమిటీ వేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో చంద్రబాబుకి తాకట్టుపెట్టారని, దొరికిపోగానే మళ్లీ డైవర్షన్‌ స్టార్ట్‌ చేశారని అన్నారు. చిట్‌చాట్‌లో ప్రజలకు పనికొచ్చే ఒక్కమాట కూడా రేవంత్‌ మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణను దండుపాళ్యం బ్యాచ్‌లా దోచుకుంటున్న అనుముల బ్రదర్స్‌, మీవాళ్లు కలిసి డైవర్షన్‌ గేమ్‌లు తప్ప చేసిందేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో రూ.4వేల కోట్ల ప్రాజెక్టులిచ్చారన్నారు. ‘బడేభారు.. చోటేభారు బంధం, బీజేపీ-కాంగ్రెస్‌ బంధం ఎంత అద్భుతమైనదంటే.. పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్‌ అయ్యి సంవత్సరమైనా పొంగులేటి మాట్లాడడు, అటు ఈడీ మాట్లాడడు. పొంగులేటి ఇంటికి నోట్ల కట్టలు అని రాసిన మీడియా వాళ్లు ఎవరూ అడగరే? ఈ నోట్ల కట్టలు ఎక్కడికి పోతున్నాయో మాకు తెలుసు అని అన్నారు. సివిల్‌ సఫ్లయిస్‌ కుంభకోణం, ఈస్టిండియా కంపెనీ అన్న కంపెనీకే కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో సగం, మిగతా సగం పొంగులేటికి ఇచ్చారని తెలిపారు. తన సీటుకు ఎవరు ఎసరు పెడతారో అని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ ఫోన్లు ట్యాప్‌ చేయటం లేదని నీ మనవడి మీద ఒట్టేసి చెబుతావా? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నమాట నిజం కాదా అని ప్రశ్నించారు.

420 హామీలు ఏమైనాయి?
20 హామీలు ఏమైనాయి అని నిలదీయాలని తమ కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్‌ అన్నారు. ”బాబు గారి కోసం బనకచర్ల ప్రాజెక్టు గ్యారెంటీ, రాహుల్‌గాంధీకి నెలనెలా నోట్ల కట్టలు గ్యారెంటీ, బావమరిది కోసం రూ.1137 కోట్ల అమృత్‌ కాంట్రాక్టు గ్యారెంటీ, ప్రశ్నిస్తే గొంతునొక్కడాలు గ్యారెంటీ, నెలకు నాలుగుసార్లు ఢిల్లీ, మోడీ కాళ్లు పట్టుకోవడం గ్యారెంటీ ఇవి తప్ప అసలు గ్యారెంటీలు ఎటుపోయినవని అడుగుతున్నా..” అని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ పేరిట నువ్వు ఆడుతున్న నాటకాన్ని బీసీలు చూస్తూ ఉన్నారని అన్నారు. అంతకుముందు జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బెల్లం వేణు, ఉమా, బమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -