న్యూఢిల్లీ : గత పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ బావ రాబర్ట్ వాద్రాను వేధింపులతో వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంక కుటుంబానికి తాను అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. హర్యానాలో శికోపుర్‌లో భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇడి ఇప్పటికే పలుమార్లు ఆయనను విచారించింది. ఈ క్రమంలో గురువారం ఆయనపై అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.