Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరకాటంలో ట్రంప్‌

ఇరకాటంలో ట్రంప్‌

- Advertisement -

– ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై రగులుతున్న వివాదం
– వాటిని బయట పెట్టాల్సిందేనంటున్న ప్రజానీకం
– రిపబ్లికన్ల నుంచీ ఒత్తిడి
– అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న అధ్యక్షుడు
వాషింగ్టన్‌ :
జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్లను బహిర్గతం చేయాలంటూ ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నప్పటికీ అసలు ఈ వివాదంలో ఏ మాత్రం పసలేదని, అది ఓ బూటకమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ వస్తున్న డిమాండ్లను కూడా ట్రంప్‌ పట్టించుకోవడం లేదు. ఎప్‌స్టీన్‌ ఉదంతంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ను నియమించాలన్న అభ్యర్థననూ తోసిపుచ్చారు. ఈ వ్యవహారాన్ని పట్టుకొని వేలాడుతున్న వారంతా బలహీనులని, వారు డెమొక్రాట్ల మద్దతుదారులని ఎదురు దాడి చేశారు.

స్వపక్షంలోనూ వ్యతిరేకత
ట్రంప్‌ అభిప్రాయాలు ఏవైనప్పటికీ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సమాచారాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని అమెరికా ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశాధ్యక్షుడు పారదర్శకంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. ఎప్‌స్టీన్‌ ఉదంతానికి సంబంధించి అన్ని పత్రాలనూ బయటపెడతానని తొలుత ప్రకటించిన ట్రంప్‌ ఆ తర్వాత వెనకడుగు వేశారు.
దీంతో ఆయనతో పాటు ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో శక్తివంతులైన వ్యక్తుల పేర్లు ఉన్నాయని మాగా మద్దతుదారులతో పాటు రాజకీయ వ్యాఖ్యాతలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు తాజాగా ట్రంప్‌ ప్రభుత్వంలోని సీనియర్‌ సభ్యులు సైతం ఫైళ్లను బహిర్గతం చేయాల్సిందేనని పట్టుపట్టడం గమనార్హం. వీరిలో అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కష్‌ పటేల్‌ కూడా ఉన్నారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ‘విశ్వసనీయ’ ఫైళ్లను విడుదల చేయాలన్న డిమాండ్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్‌ కూడా బలపరిచారు. అయితే ఆ తర్వాత దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు.

రిపబ్లికన్లలోనూ సందేహాలు
రిపబ్లికన్‌ పార్టీ సభ్యులలో కూడా మూడింట రెండు వంతుల మంది ప్రభుత్వం ఏదో దాచిపెడుతోందని అనుమానించడం విశేషం. ఈ కేసును ట్రంప్‌ సరిగానే నిర్వహిస్తున్నారని కేవలం 17 శాతం మంది అమెరికన్లు మాత్రమే చెప్పారు. రిపబ్లికన్లలో 35 శాతం మంది ట్రంప్‌ తీరును సమర్ధించగా 29 మంది వ్యతిరేకించారు. మిగిలిన వారు తామేమీ చెప్పలేమని తెలిపారు. కాగా ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నదని లారా లూమర్‌, అమెరికా ప్రతినిధి లారెన్‌ బోబర్ట్‌ సహా పలువురు ట్రంప్‌ మద్దతుదారులు కోరుతున్నారు. ఫైళ్ల నిర్వహణ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఎప్‌స్టీన్‌కు క్లయింట్‌ జాబితా లేదని, అతను 2019లో న్యూయార్క్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటూ గత వారం న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ జారీ చేసిన ఉమ్మడి మెమో వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఏదేమైనా ఎప్‌స్టీన్‌ ఉదంతంలో తగులుతున్న ఎదురు దెబ్బలు ట్రంప్‌ ప్రభుత్వంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.

ప్రభుత్వంపై అనుమానాలు
ట్రంప్‌ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్‌ చివరలో కొన్ని పత్రాలను విడుదల చేసింది. ఆ సమయంలో బాండీ ఓ ప్రకటన చేస్తూ తన వద్ద మరింత సమాచారం ఉన్నదని బాంబు పేల్చారు. ఈ నెలలో అమెరికా న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ కొన్ని పత్రాలు, వీడియో ఫుటేజీలను విడుదల చేశాయి. ఎప్‌స్టీన్‌ చనిపోయిన రోజు రాత్రి జైలు కెమేరాలలో రికార్డయిన ఫుటేజీ కూడా ఇందులో ఉంది. అయితే కొన్ని ‘కీలక’ నిమిషాలకు సంబంధించిన ఫుటేజీ అదృశ్యం కావడం అనుమానాలకు దారితీస్తోంది. కాగా రాయిటర్స్‌/ఇప్సోస్‌ రెండు రోజుల పాటు నిర్వహించిన పోల్‌ ప్రకారం ఎప్‌స్టీన్‌ క్లయింట్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని 69 శాతం అమెరికన్లు విశ్వసిస్తున్నారు. కేవలం ఆరు శాతం మంది మాత్రమే దీనితో విభేదిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తమకు తెలియదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -