– 82 కాలేజీల్లో వంద శాతం సీట్ల భర్తీ
– ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 5,493
– సీట్లు రాని అభ్యర్థులు 16,793 మంది
– సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు 22
– సీఎస్‌ఈ, ఐటీ కోర్సులకే డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్ (ఎంసెట్) మొదటివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 95,256 మంది అభ్యర్థులు ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని తెలిపారు. వారిలో 94,354 మంది అభ్యర్థులు 59,31,279 వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. రాష్ట్రంలో 172 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 77,561 (93.3 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 5,493 (6.7 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం, ఇతర కారణాల వల్ల 16,793 మందికి సీట్లు కేటాయించలేదని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 6,083 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఆరు యూనివర్సిటీ, 76 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 82 ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా వివరాలను నమోదు చేసేందుకు ఈనెల 22 వరకు గడువుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు. ఎప్‌సెట్ తుదివిడతలో సీట్లు కేటాయించిన తర్వాత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈనెల 31 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు జిరాక్స్ ప్రతులను, ఒరిజినల్ టీసీని అందజేయాలని కోరారు. రిపోర్టు చేయకుంటే సీటు కోల్పోతారని వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే ఎప్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశముంటుందని తెలిపారు. వారే వెబ్‌ఆప్షన్లను నమోదు చేయొచ్చని సూచించారు. రెండో విడతలో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టు చేయకుంటే తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఉండబోదని వివరించారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రవaజూషవ్.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. అయితే మాక్ కౌన్సెలింగ్ సీట్లు పొందిన వారిలో ఇప్పుడు ఎప్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులో కాలేజీ, బ్రాంచీ మారిన వారు 36,544 మంది ఉన్నారని వివరించారు.
సీఎస్‌ఈ, ఐటీ కోర్సులకు భారీ డిమాండ్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యలో 47 కోర్సులున్నాయి. 23 కోర్సుల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉన్నది. ఆ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 58,743 సీట్లుంటే, 57,042 (97.11 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 1,700 (2.89 శాతం) సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనుబంధ కోర్సుల్లో 16,112 సీట్లుంటే 14,054 (87.23 శాతం) మందికి సీట్లు కేటాయించారు. 2,058 (12.77 శాతం) సీట్లు మిగిలిపోయాయి.
సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సులకు ఆదరణ
సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సులకు ఆదరణ పెరిగింది. మెటలర్జికల్ ఇంజినీరింగ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, మెకానికల్ (మెకట్రానిక్స్) ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎప్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే వంద శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. సివిల్ ఇంజినీరింగ్‌లో 81.64 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 74.33 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ అనుబంధ కోర్సుల్లో 7,100 సీట్లుంటే, 5,632 (79.32 శాతం) మందికి సీట్లు కేటాయిం చారు. 1,468 (20.68 శాతం) సీట్లు మిగిలాయి. ఇతర ఇంజినీరింగ్ కోర్సులొఓ్ల 1,100 సీట్లుంటే, 833 (75.73 శాతం) మందికి సీట్లు కేటాయిం చారు. ఇంకా 267 (24.27 శాతం) సీట్లు మిగిలాయి.

