Thursday, May 1, 2025
Homeఎడిట్ పేజిభవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి 'మేడే'

భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి ‘మేడే’

అవి పందొమ్మిదవ శతాబ్ధపు పారిశ్రామిక విప్లవాల కాలంనాటి రోజులు. దుర్భరమైన పని గంటలు. రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో ? రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల దాహార్తికి వందలు, వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక సంఘాల సమాఖ్య (ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమాఖ్య-ఏఎఫ్‌ఎల) ఆవిర్భావానికి ప్రేరణనిచ్చింది. ఆ సంస్థే ఎనిమిది గంటల పని దినం కోసం నినదించింది. అమెరికా, కెనడా కార్మికులు ఆయా ప్రభుత్వాలకు రెండేండ్లపాటు ఎనిమిది గంటల పని అమలుకు గడువిచ్చాయి. 1886 మే ఒకటి నుంచి కచ్చితంగా అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది. లేకుంటే సమ్మేనని హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకూ ఈ సంకేతం అందించింది. అప్పటికే ఆస్ట్రేలియా కార్మికవర్గం ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల వినోదం, ఎనిమిది గంటల విశ్రాంతి నినాదాన్ని అందుకుని ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్నది. లండన్‌, ప్యారిస్‌ వంటి యూరోపియన్‌ నగరాల కార్మికవర్గం ఎనిమిది గంటల పనిదినం కోసం గొంతెత్తింది. కార్మికవర్గ పోరాటాల వెల్లువలో భాగంగా 1886 మే 1న ఉదయం పదిం టికి చికాగో నగరంలో కార్మికుల సమ్మె మొదలైంది. అది అమెరికా అంతా విస్తరించింది. పదమూడు వేల పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. ఇరవై నాలుగు గంటల్లోనే సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది.
నెత్తురు చిందించిన చికాగో కార్మికులు
ఒక్క చికాగాలోనే నలభై వేల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులతో ర్యాలీ, బ్యానర్లు, ఎర్రజెండాలు చేబూని మిన్నంటే నినాదాలు హోరెత్తించారు. కార్మిక నాయకుల ప్రసంగాలు వీధుల్లో మార్మోగాయి. మర్నాటికి ఆ ఉధతి మరింత పెరిగింది. సమ్మె మూడో రోజున అంటే మే మూడున హే మార్కెట్‌ నుంచి ప్రదర్శన బయలుదేరి సభాస్థలికి చేరింది. ఆ మహా ప్రదర్శనపై ఆనాటి పాలకవర్గాల ప్రోత్సాహంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. వందలాది మంది నెత్తుటి మడుగుల్లో అమరులయ్యారు. ఈ ఘాతుకాన్ని కార్మిక సంఘాల సమాఖ్య నిరసించింది. మర్నాడు ర్యాలీ జరపాలని నిర్ణయించింది.1886 మే 4 సాయంత్రం హే మార్కెట్‌, రాన్‌డాల్ఫ్‌ స్ట్రీట్‌ ప్రదర్శనకారులతో కిక్కిరిసింది. పోలీసుల దురాగతాన్ని నిరసిస్తూ మీటింగ్‌ మొదలైంది. కార్మిక నాయకులు ప్రసంగాలు చేశారు. చివరి వక్త ఆగస్ట్‌ స్పైస్‌ సభను ముగించ బోతున్నారు. ఇంతలో ఖాకీలు కయ్యానికి కాలుదువ్వారు. లాఠీలతో కార్మికులను కుళ్లబొడిచారు. తుపాకులతో నెత్తురు కళ్లజూశారు. సరిగ్గా ఆ సమయంలో జనంపై బాంబు, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు విసిరారో తెలియదు. ఒక సార్జెంట్‌ మతిచెందాడు. కార్మికులు, పోలీసుల బాహాబాహీ తలపడ్డారు. యుద్ధ రంగాన్ని మించిన బీభత్సం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు. హే మార్కెట్‌ కార్మికుల రక్తంతో తడిసి ముద్దయింది. చికాగో స్తంభించింది. పదిహేను మంది కార్మిక నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎనిమిది గంటల పని హక్కు కావాలని నినదించడమే నేరమైంది.
కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లేబర్‌ పార్టీలు, ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఏర్పాటైంది. అది 1876 లో రద్దయింది. తిరిగి రెండో ఇంటర్నేషనల్‌ 1889లో మొదలైంది. ఈ సంస్థే మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్స వంగా ప్రకటించింది. హే మార్కెట్‌ అమరవీరుల త్యాగానికి తర్ప ణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే 1న ర్యాలీలు జరపాలని పిలుపిస్తే ఒక్క లండన్‌లోనే మూడులక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆ తర్వాతే కార్మికవర్గ చరిత్రలో ‘మే డే’ ఒక భాగమైంది. భారత దేశంలో 1923 మే 1న హిందూస్థాన్‌ లేబర్‌ కిసాన్‌ పార్టీ నాయకుడు సింగారవేల్‌ చిట్టినాయర్‌ నాయ కత్వంలో మద్రాస్‌లో తొలిసారి మేడే ప్రదర్శన జరిగింది.
చట్టాలను లేబర్‌కోడ్స్‌గా మార్చిన కేంద్రం
సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరియరిజం నేపథ్యంలో ఎనిమిది గంటల పనిదినం స్ఫూర్తి కను మరుగైపోతున్నది. చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకు కూడా కష్టకాలం వచ్చింది. 139 సంవత్సరాల క్రితం 14-16 గంటలు పనిదినం ఉంటే దానిని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలను సైతం త్యాగం చేశారు ఆనాటి మన పోరాట యోధులు. బీజేపీ నాయకత్వంలోని నేటి కేంద్ర ప్రభుత్వం భారత కార్మికవర్గాన్ని అణిచివేసి మేడే నాటి పూర్వపు దుర్మార్గపు రోజుల్లోకి తీసుకుని పోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. శతాబ్దకాలం పాటు పోరాటాలు, త్యాగాలతో కార్మికవర్గం సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా రూపొందించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చి తమ శ్రేయోభిలాషులైన బడా కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు అపరిమితమైన లాభాలు కల్పించాలని తహతహ లాడుతున్నది. పెట్టుబడిదారుల దోపిడీకి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలంటే కార్మిక సంఘాలు లేని వ్యవస్థను వారి అనుయాయులకు బహుమతిగా ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే బీజేపీ అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల ఉత్పత్తిలో కార్మికుల జీతాల వాటా 18.9 శాతం (2020) నుండి 15.9 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కార్పొరేట్ల లాభాలు 38.7 శాతం నుండి 51.9 శాతానికి పెరిగాయి. అయినా పాలకులు, పెట్టుబడిదారులు తృప్తి పడటం లేదు. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చయినా వారికి గరిష్ట లాభాలను సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారు.
పనిగంటల పెంపునకు కుట్ర!
వారానికి ఆరు రోజులు, 48 గంటల పని దినం స్థానంలో వారానికి ఐదు రోజులు, 35 గంటలు పని దినం ఉండాలని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) పిలుపుపై అనేక దేశాల కార్మికవర్గం పోరా డుతున్నది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ), ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోలు ప్రవేశించిన నేటి కాలంలో తక్కువ పనితో ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నది. కాబట్టి ఎనిమిది గంటల పనిని ఏడు గంటలు, ఆరు రోజుల పనిని ఐదు రోజులకు తగ్గించాలని కార్మికవర్గం డిమాండ్‌ చేస్తున్నది. కానీ నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం, యాజమాన్యాలు, పాలకులు, ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి, ఎల్‌అండ్‌టి చైర్మన్‌ సుబ్ర హ్మణ్యం లాంటి వారు మాత్రం వారానికి 70 నుండి 90 గంటల పని ఉండేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేయా లంటున్నారు.
బీజేపీ ప్రభుత్వం లౌకిక, ప్రజాతంత్ర మౌలిక విలువలనే మట్టుపెట్ట చూస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మతోన్మాద, కార్పొరేట్‌ బీజేపీ విధానాల వల్ల దేశంలో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలు, దురహంకార ధోరణులు పెరుగుతున్నాయి. ఇవి కార్మికవర్గ ఐక్యతకు, విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ప్రత్యామ్నాయ భావజాలంతో కార్మికవర్గం సంఘటితం కావడం హిందూత్వ శక్తులకు గిట్టడం లేదు. బీజేపీ దాని అనుబంధ సంఘాలైన ఆరెస్సెస్‌, భజరంగ దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ లాంటి అభివృద్ధి నిరోధక సంస్థలు అనేక రకాలుగా దాడులు చేస్తున్నది. విప్లవకర ట్రేడ్‌ యూనియన్లు, అభ్యుదయ, ప్రగతిశీల శక్తులపై, మైనారిటీ, దళిత, సామాజిక తరగతులపై, మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నది.
ప్రతిఘటనా పోరాటాలు
ప్రభుత్వ విధానాలకు ప్రతిఘటనా, పోరాటాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. తమిళనాడులోని ‘శాంసంగ్‌’ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుకోసం చేసిన పోరాటం భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా కార్మికవర్గానికి విశ్వాసం కలిగించింది.ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా ‘మేం ఎవరికి బానిసలం కాదు’ అంటూ తమ హక్కుల కోసం ఆందోళనలు చేయడం మంచి పరిణామం. విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కూడా నూతన ఉత్తేజాన్ని సృష్టిస్తున్నవి. భవిష్యత్‌ పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నవి. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడీసర్కార్‌పై పోరాడుతూనే ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యమబాట పట్టాలి. నయా ఉదారవాద విధానాలు, కార్పొరేట్‌-మతోన్మాదాన్ని ప్రతిఘటించేందుకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలి. భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఈ మేడేను స్ఫూర్తిగా తీసుకుని కార్మికవర్గం కదం తొక్కాలి. కదనరంగంలోకి దూకాలి. చికాగో అమరవీరులకు విప్లవ జేజేలు.
పాలడుగు భాస్కర్‌
9490098033

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img