Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'సూపర్‌ అర్జెంట్‌ క్యాటగిరీ'లో కాలేయమార్పిడి

‘సూపర్‌ అర్జెంట్‌ క్యాటగిరీ’లో కాలేయమార్పిడి

- Advertisement -

– దేశంలోనే తొలి ప్రభుత్వాస్పత్రిగా ఉస్మానియా రికార్డు : వైద్యులకు మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు
– పూర్తిగా కోలుకున్న బ్లెస్సీ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలోనే ‘సూపర్‌ అర్జెంట్‌ క్యాటగిరీ’లో తొలి కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేసిన ప్రభుత్వాస్పత్రిగా ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ రికార్డు నెలకొల్పింది. ప్రాణాపాయస్థితికి చేరుకున్న వారిని బతికించేందుకు అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పాటు యూరోప్‌ లాంటి చోట్ల ఈ క్యాటగిరీ కింద ప్రాధాన్యతా క్రమంలో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ జీవన్‌దాన్‌లో ఈ క్యాటగిరీ అమల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ క్యాటగిరీ కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో అవయవమార్పిడి శస్త్రచికిత్స జరగలేదు. తొలిసారిగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వాస్పత్రి బ్లెస్సీ గౌడ్‌ (17) అనే యువతికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. దీంతో 48 గంటల్లో కాలేయ మార్పిడి చేయకుంటే ప్రాణాలు కోల్పేయే స్థితికి చేరిన ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లో నివసిస్తున్న బ్లెస్సీ గౌడ్‌ మే నెలలో జ్వరం బారిన పడింది. ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన ఆమె ఐదు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో మే 12న ఆమె కుటుంబ సభ్యులు బ్లెస్సీని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం ఆమె కాలేయం పూర్తిగా పాడైనట్టు గుర్తించిన వైద్యులు 48 గంటల్లో కాలేయమార్పిడి చేయకుంటే చనిపోతుందని తేల్చారు. కాలేయదానం చేసేందుకు బ్లెస్సీ తల్లి, ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చినప్పటికీ వారి కాలేయం బ్లెస్సీకి మార్పిడి చేసేందుకు సరిపోలడం లేదని వైద్యులు నిర్ధారించారు. కాలేయదాత కోసం జీవన్‌దాన్‌ సూపర్‌ అర్జెంట్‌ క్యాటగిరీలో బ్లెస్సీ పేరును నమోదు చేశారు. అదే సమయంలో ప్రయివేటు ఆస్పత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి బ్లడ్‌ గ్రూప్‌, బ్లెస్సీ బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోలడంతో ఆ కాలేయాన్ని జీవన్‌దాన్‌ అందజేసింది. దీంతో మే 14న ఆస్పత్రి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ మధుసూదన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని, ఫస్ట్‌ ఇయర్‌ బీటెక్‌ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నది. ఈ సందర్భంగా బ్లెస్సీ, ఆమె తల్లి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసిన సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ మధుసూధన్‌ తదితర డాక్టర్లను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. బ్లెస్సీని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చి, పునర్జన్మ ప్రసాదించారని ప్రశంసించారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామనీ, ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. జీవన్‌దాన్‌ను బలపర్చి, ఆపదలో ఉన్న పేద ప్రజలకు అవయవాలు అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు.

సీఎంకు, మంత్రికి కృతజ్ఞతలు : డాక్టర్‌ మధుసూదన్‌
ఉచిత కాలేయమార్పిడి చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు డాక్టర్‌ మధుసూదన్‌ కృతజ్ఞతలు తెలిపారు. బ్లెస్సీ గౌడ్‌ పూర్తిగా కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉస్మానియా వైద్యులతో పాటు, జీవన్‌ దాన్‌ వేగంగా స్పందించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -