నవతెలంగాణ-హైదరాబాద్: ఆకస్మికంగా వచ్చిన వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని అజ్మేర్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఇరుకు సందుల్లోకి ఆకస్మికంగా వరద నీరు ఉధృతంగా రావడంతో దర్గా దగ్గరకు వచ్చిన ఓ యాత్రికుడు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
వరదకు కొట్టుకుపోతున్న వ్యక్తి సాయం కోరుతూ తన చేయి అందించాడు. కానీ ఆ వరద వేగానికి అతడు కొట్టుకుపోతుండటంతో చాలామంది చేయి ఇచ్చినప్పటికీ పట్టుకోలేకపోయారు. ఎట్టకేలకు ఓ చోట ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోతూ వస్తున్న వ్యక్తి చేతిని పట్టుకోగలిగాడు. వెంటనే మరో వ్యక్తి పక్కనుండి వస్తూ అతడిని గట్టిగా లేపి సురక్షితంగా పక్కకు తెచ్చాడు. బతుకు జీవుడా..! అంటూ ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు..! గత 24 గంటలుగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కోటాలోని సంగాడ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగా హెచ్చరించింది.