నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం స్టేడియంలోని హెడ్ ఆఫీస్‌లో హెచ్‌సీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రెటరీలను మాత్రమే లోనికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్స్ సెక్రటరీ లకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు.
అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రెటరీలకు అనుమతి లేదని హెచ్‌సిఎ చెప్పడంతో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌తో పాటు మరో నలుగురు కలిసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వెలుగులోకి రావడంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం సీఐడీ అధికారులు జగన్మోహన్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో పెద్ద ఎత్తున స్కాం జరిగినట్లుగా గుర్తించి ఈడీ కూడా రంగంలోకి దిగింది.