అప్పుడు హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాయకులు! నేడు, సాధించుకున్న హక్కుల రక్షణ కోసం మే 20న మరో సార్వత్రిక సమ్మెకై సన్నద్ధమవుతూ భారతదేశ కార్మికులు. పెట్టుబడిదారీ ప్రపంచమంతా నేడిదే స్థితి!
అవును! అంతకుముందు వాళ్ళంతా బానిసలే! యంత్రాల్లో యంత్రాలై, యంత్రాలకు కందెనై, ఆవిరై, చితికిపోయినవారే. పదిహేడు, పద్దెనిమిది, ఇరవై గంటలు గడియారం ముల్లులుగా తిరిగీ, తిరిగి.. ఆ తర్వాత ఎదురు తిరిగారు. 1831లో ఇంగ్లాండ్ ఛార్టిస్టు ఉద్యమం పది గంటలు పని కోసం ఆరు పాయింట్లు కల ఛార్టరు పట్టుకుని కదం తొక్కారు. ముప్పయి లక్షల మంది దానిపై సంతకం చేసినా బ్రిటీష్ ప్రభుత్వం దాన్ని అణచివేసింది. ఆ తర్వాత కాలంలో ఆ ఆరు డిమాండ్లూ అమల్లోకొచ్చాయి. కార్మికోద్య మంలో అదొక మజిలీ. ఆ తర్వాత 8 గంటలు పనిదినం డిమాండు. అది రణన్నినాదమైంది. దావానలమై పెట్టుబడిదారీ విధాన కూసాలను అంటుకుంది.
ఎనిమిది గంటలు మీ కోసం
ఎనిమిది గంటలు మా కోసం
మిగిలిన 8 గంటలు మాకు విశ్రాంతి
మేం మనుషుల్లా బతకడం కోసం!
ఇన్నేళ్ళూ ఉరితాళ్ళవే! ఉరేసే తలార్లు మారుతున్నారు. ఉరి తీయబడే వారూ మారుతున్నారు. చికాగోలో 1887లో వారి పేర్లు ఆల్బర్ట్ పార్సన్స్, ఆగస్టు స్పైస్, అడాల్ఫ్‌ఫిషర్. ఇండియాలో వారి పేర్లు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్.. అది 1931లో. కాల్చి చంపివేయబడిన వారి పేర్లు మన దేశంలో అల్లూరి సీతారామరాజు, బిర్సాముండాలైతే, చిలీలో అలెండీ, కాంగోలో పాట్రిస్‌లుముంబా. అందుకే శ్రీశ్రీ ”నరహంతలు ధరాధిపతులై, చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి” అన్నది. పని గంటలు తగ్గించాలన్న స్వాతంత్య్రేచ్ఛతో రగిలిపోయినా ఉరిశిక్షలే! అప్పుడైనా, ఇప్పుడైనా!
”ఆనాడు బానిసలు చేసిన సమ్మె సూర్యుడిని అస్తమింపచేసింది. లేకుంటే సూర్యుడు సామ్రాజ్యానికిగాని, బానిసలకు గాని అస్తమించేవాడే కాదు” బ్రహ్మ ప్రకాశ్ అంటాడు ‘కంచెలపై దేహాలు’లో. సామ్రాజ్యాలు నేడు అస్తమించాయి. ప్రపంచ యుద్ధాలు ముగిశాయి. వలసల కోటలు కూలాయి. పెట్టుబడిదారీ విధాన స్వర్ణయుగం ఒక వెలుగు వెలిగి, ఆరిపోయింది. నయా ఉదారవాదమే దిక్కన్నారు. నేడదీ సంక్షోభంలో పడింది. సైక్లికల్ సంక్షోభాల దశ దాటి వ్యవస్థీకృత సంక్షోభంలోకి జారు కుంది. గడియారాన్ని వెనక్కి తిప్పాలని నేడు పెట్టుబడిదారుల ప్రయత్నం. ఒకడు వారానికి డెబ్బయి గంటలు పని చేయాలంటే, ఇంకొకడు 90 గంటలు పని చేయాలంటాడు. ఇవన్నీ లేబర్ కోడ్‌లు అమల్లోకి రాకుండానే! ట్రేడ్ యూనియన్లే లేని వాతావరణం తెచ్చేందుకు అటు పెట్టుబడి దారులు, ఇటు కాషాయనేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
2020 కోవిడ్ కాలంలో కార్మిక కోడ్‌లు ఆమోదించుకున్నారు. 2025 వచ్చినా అమలు చేయలేకపోతున్నారు. అది సంతోషమే అయినా ఈలోపే జన్ విశ్వాస్ 2023 తెచ్చారు. ఇది విశ్వాసం ఆధారంగా పాలనట(ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్)! సులభతర వ్యాపారానికి ఇది పరాకాష్ట్ర. ఇప్పటివరకు యజమానులు చేసే 180 నేరాల్ని నేరాలు కాకుండా చేసింది మోడీ సర్కార్. ”శ్రమ్ సమాధాన్, శ్రమ్ సువిధ” కింద ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు బంద్. భారతీయ న్యాయ సంహిత కింద కార్మికులందరూ కలిసి యాజమాన్యం తమకు అన్యాయం చేసిందని కంప్లైంట్ చేసినా నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ కింద జైలే! నాలుగు కోడ్‌ల చుట్టూనే మన ఆలోచనలు తిరిగితే కాలికింద భూమి లాగేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త! రైతులు మళ్ళీ ముట్టడికి కూచోవచ్చు. రోజులలానే ఉన్నాయి. దాంతో కార్మికులు రైతులతో జట్టుకట్టక పోతే కార్మికులకున్న ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాదు.
సామాజిక సమస్యలను కార్మికోద్యమం తనదిగా చేసుకోవాలి. దేశంలో కార్మిక సంఘాలు లేని రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీ పుట్టక మునుపే 1827లో జ్యోతిబాఫూలే దంపతులు బ్రాహ్మణ వితంతువుల తల గొరగడాన్ని వ్యతిరేకిస్తూ మంగలివారితో సమ్మె చేయించారు. తాజాగా గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి తర్వాత ”మేం మురుగు కాలువలు శుభ్రం చేయం. శవాలను ఎత్తేయం. అవి పొంగి పొర్లితే మీ ఇళ్ళన్నీ గబ్బు లేవనీ, హిందూ సమాజం తన మురికిని తనే కడుక్కోనివ్వండి” అన్నారు. ఇవన్నీ ట్రేడ్ యూనియన్ సమస్యలే! కార్మికోద్యమంలో అంతర్భాగమే!
