నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన మరువకముందే ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ చదివే బాలికకు ముగ్గురు నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన ఆ బాలికను ఒడిశా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని పూరీ జిల్లాలో బయాబర్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలిక తన స్నేహితురాలికి బుక్స్ ఇచ్చేందుకు శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో బాధితురాలు తన ఇంటికెళ్తుంది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఆ అమ్మాయిని భార్గవి నది సమీపంలోని నిర్జన ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని.. నిప్పంటించి పారిపోయారు. మంటల్లో కాలుతూ అరుస్తున్న బాలికను స్థానికులు చూసి.. వెంటనే మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. తొలుత పిపిలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని ఎయిమ్స్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. లెక్చరర్ లైంగిక వేధింపుల కారణంగా మరణించిన సౌమ్యశ్రీకి..న్యాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించిందని, బాధితురాలు న్యాయం కోసం పోరాడి చివరకు కాలేజీలోని సజీవ దహానమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాలిక చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వెల్లడించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.