నవతెలంగాణ- దుబ్బాక
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, ఇందుకు సంబంధిత అధికారుల సూచనలను తప్పక పాటించాలని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) వేలేటి భాస్కర శర్మ అన్నారు. శనివారం దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో లబ్ధిదారులు పోతుగంటి కనకలక్ష్మీ అంజయ్య దంపతులు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్ని పంచాయతీ కార్యదర్శి కిషన్ తో కలిసి ఆయన పరిశీలించారు. బల్వంతపూర్ గ్రామంలో 43 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 15 మంది పనుల్ని ప్రారంభించారని, 11 మంది బేస్మీట్, ఒకరు రూఫ్ లెవెల్ దశలో ఉన్నాయన్నారు.
పోతుగంటి కనకలక్ష్మీ కి చెందిన ఇల్లు స్లాబ్ లెవల్ పనులు పూర్తయినందున వీరి అకౌంట్లో రూ.4 లక్షలు జమ అయినట్టు వెల్లడించారు. మరో 13 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. దుబ్బాక మండల వ్యాప్తంగా 396 కు గాను 293 మంది లబ్ధిదారులు ముగ్గుపోసి పనులు ప్రారంభించగా.. 45 మంది నేటికీ ప్రారంభించలేరని, మరో 56 మంది ఆసక్తి చూపడం లేదని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.