– దిగొచ్చిన ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్ యాజమాన్యం
– నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
– ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్ కంపెనీలో ఘటనా స్థలం పరిశీలన
– శకలాల కింద లభ్యమైన చందోజు దేవి చరణ్ మృతదేహం
– బాధితులకు పలువురి పరామర్శ
నవతెలంగాణ-మోటకొండూరు
యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం, కాటేపల్లి గ్రామం ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్ కంపెనీలో బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు, ప్రజాసంఘాల నేతల ఆందోళనతో యాజమాన్యం దిగొచ్చింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఒప్పుకున్న కోటి రూపాయల్లో తక్షణం రూ.50లక్షలు అందజేసి, మిగతావి రెండు నెలలకు రూ.25లక్షలు, మరో రెండు నెలలకు రూ.25లక్షలు అందజేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే, గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయిస్తామని చెప్పింది.
మంగళవారం రాత్రి ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో 144 సెక్షన్ విధించి ఏసీపీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు బాధిత కుటుంబసభ్యులు మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా నిర్వహించారు. అదే సమయంలో బాంబుల లోడుతో వస్తున్న వాహనాన్ని అడ్డుకొని ప్రాణాలు పోయినా కంపెనీ యాజమాన్యం స్పందించకుండా లోడ్ పంపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని, టైర్ల కంపెనీని కూడా మూసేయాలని నినాదాలు చేశారు. ఆందోళన కారులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్దన్, సుధగాని హరిశంకర్, చామల భానుచందర్, ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్‌రెడ్డి, చామల ఉదరుచందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐటీయూ, సీపీఐ(ఎం) నేతలు
బుధవారం ఘటనా స్థలాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, కుటుంబా లను ఆదుకోవాలని కోరారు. కంపెనీ యాజ మాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి ఘటనలు పున రావృతం అవుతున్నాయ న్నారు. కార్మికులందరూ కాంటాక్ట్ పద్ధతిలోనే చేస్తు న్నారని, పెద్ద కంపెనీ కావడంతో లేబర్ చట్టాలను కేంద్రం తుంగలో తొక్కుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్, రాష్ట్ర నాయకులు యాటల సోమన్న, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాటూరి దాసరి పాండు, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొల్లూరి ఆంజనేయులు, పెద్దకందుకూరు జనరల్ సెక్రెటరీ రమేష్ ఉన్నారు.
శోకసంద్రంలో మృతుల కుటుంబాలు
గునుగుంట్ల సందీప్(30) తండ్రి శ్రీనివాస్ మూడేండ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలనే సందీప్ వివాహమైంది. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆత్మకూరు ఎం మండలానికి చెందిన కల్వల నరేష్(32) తల్లిదండ్రులు అంజయ్య-లకిë. మూడేండ్ల కిందట నరేష్ వివాహం అయింది. ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మోటకొండూరుకు చెందిన దేవీచరణ్ తల్లిదండ్రులకు ఒకే కుమారుడు. తండ్రి చనిపోయాడు. కుటుంబం గడవడానికి తల్లి బుజ్జమ్మకు చేదోడుగా ఉండాలని చదువు మధ్యలోనే ఆపేసి కంపెనీలో పని చేస్తున్నాడు. పేలుళ్లు జరిగిన వెంటనే శకలాలను తొలగించి ఉంటే ప్రాణంతో దక్కేవాడేమోనని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రిలో కందుకూరు గ్రామానికి చెందిన మహేందర్, అనాజిపురం గ్రామానికి చెందిన నల్ల మహేశ్, చాడ గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీకాంత్, ఆలేరుకు చెందిన బర్ల శ్రీకాంత్, పులిగిల్లకు చెందిన బుగ్గ మహేష్ చికిత్స పొందుతున్నారు.
దేవి చరణ్ మృతదేహం లభ్యం
కాటేపల్లి గ్రామంలోని ప్రిమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలిన బాంబుల ఘటనలో బుధవారం దేవి చరణ్ మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఘటన జరిగినప్పుడు శరీరాలు మాంసం ముద్దలుగా చెల్లా చెదురుగా పడి ఉండటంతో గునుగుంట్ల సందీప్, దేవీ చరణ్ అని అందరూ భావించారు. కానీ సందీప్ మృతదేహం శరీర భాగాలే పేలుళ్ల ధాటికి అక్కడక్కడా పడిపోయాయి. బుధవారం మధ్యాహ్నం శకలాలను తొలగిస్తున్న సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది.