Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్రుణాల పంపిణీ.. రికవరీలో ఉత్తమ సేవలు

రుణాల పంపిణీ.. రికవరీలో ఉత్తమ సేవలు

- Advertisement -
  • – కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖా పతకానికి ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య ఎంపిక
    – ఆగస్టు 15న దేశ రాజధానిలో అవార్డు స్వీకరణకు ఆహ్వానం
    – అభినందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
  • స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తూ…రికవరీ చేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నది. మహిళల ఆర్థిక అభివృద్దికి మద్దత్తుగా నిలుస్తూ… వారి ప్రగతిలో భాగమవుతున్నది. సామాజిక రుగ్మతలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అవార్డ్ కు ఎంపిక అయిన ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య పై ప్రత్యేక కథనం..
    • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ఆదర్శ మండల సమాఖ్య 2004లో ఏర్పాటు అయింది. స్వయం సహాయక సభ్యులకు (ఎస్ హెచ్ జీ)లకు సేవలందిస్తోంది. ఈ మండల సమాఖ్య పరిధిలో 46 విలేజ్ ఆర్గనైజేషన్(వీఓ)లు ఉండగా, స్వయం సహాయక సంఘాలు 12,472 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి దాకా మొత్తం రూ. 59 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. 99 శాతం రికవరీ చేశారు. దాదాపు రూ. 41,28,000 నిలువలతో మండల సమాఖ్య విజయవంతంగా కొనసాగుతున్నది.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కింద మండలంలోని ఆయా గ్రామాల్లో మొత్తం రూ. కోటి ముప్పై లక్షల విలువైన స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయించారు. గేదెల పెంపకం, క్యాంటీన్లు, కుట్టు మిషన్లు, కోడి పిల్లల పెంపకం తదితర యూనిట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆదర్శ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గత ఐదేళ్లకు పైగా ఎస్ హెచ్ జీ సభ్యులకు రుణాలు అందించడం వాటిని క్రమం తప్పకుండా చెల్లించేలా చూడడం సభ్యులకు బీమా కల్పించడం తదితర సేవలు అందిస్తుంది. ఎస్ హెచ్ జీ సభ్యులు వివిధ వ్యాపారాల్లో రాణించేలా నిరంతరం శిక్షణ, సలహాలు అందిస్తున్నారు.
  • అదేవిదంగా సామాజిక బాధ్యత కింద అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నీటి వనరుల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగించవద్దని, సైబర్ మోసాలకు గురి కావద్దని, పల్స్ పోలియో, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు జీవనోపాదులు పెంచే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

22 క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు (సీ.ఎల్.ఎఫ్) ఎంపిక..
దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న మండల సమాఖ్యలకు అవార్డులు అందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమాఖ్యల పనితీరును పరిశీలించారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మండల సమాఖ్య లను గుర్తించి ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డు 2024 ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దేశవ్యాప్తంగా 22 మహిళా సంఘాలను ఎంపిక చేసింది.

అవార్డులకు దేశంలోని ఆరు రీజియన్ల పరిధిలో 22 క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు (సీఎల్ ఎఫ్)లు ఎంపిక కాగా.. సదరన్ రీజియన్ కింద రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య రెండో స్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు లేఖ అందింది. రానున్న ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద నిర్వహించనున్న అవార్డుల ప్రదాన ఉత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు అక్కడికి వెళ్లి అవార్డును స్వీకరించనున్నారు.


ఇల్లంతకుంట మండలం ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలందించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికవడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, అలాగే మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. దీనికి కృషి చేసిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం వచ్చేలా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని డీఆర్డీఓ శేషాద్రిని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీతో మండల సమాఖ్య ఆర్థికంగా మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

ఎస్.హెచ్.జీ రుణాలకు వడ్డీ తిరిగి చెల్లింపు…
ఈనెల 17,18 తేదీలలో వేములవాడ అర్బన్ మండలంలోని 365 ఎస్ హెచ్ జీ లకు రూ. 46.84 లక్షలు, వేములవాడ రూరల్ మండలంలోని 442 ఎస్ హెచ్ జీ లకు రూ.58.81 లక్షలు, చందుర్తి మండలంలోని 613 ఎస్ హెచ్ జీ లకు రూ.82.50 లక్షలు, రుద్రంగి మండలంలోని 325 ఎస్ హెచ్ జీలకు రూ.41.61 లక్షలు, కోనరావుపేట మండ లంలోని 910 ఎస్ హెచ్ జీ లకు రూ. 113. 32 లక్షలు, మొత్తం 2655 ఎస్ హెచ్ జీ లకు రూ. 3 కోట్ల 43 లక్షల వడ్డీ చెల్లించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్ళపల్లి మండలంలోని 926 ఎస్ హెచ్ జీ లకు రూ. 124.40 లక్షలు, గంభీరావుపేట మండలంలోని 1004 ఎస్ హెచ్ జీ లకు రూ.141.34 లక్షలు, ముస్తాబాద్ మండలంలోని 1018 ఎస్ హెచ్ జీ లకు రూ. 138.68 లక్షలు, వీర్నపల్లి మండలంలోని 280 ఎస్ హెచ్ జీ లకు రూ.34.76 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలోని 1022 ఎస్ హెచ్ జీ లకు రూ.150.85 లక్షలు.. మొత్తం 4250 ఎస్ హెచ్ జీ లకు రూ. 5కోట్ల 90 లక్షల వడ్డీ పంపిణీ చేశారు. బోయినపల్లి మండలంలోని 696 ఎస్ హెచ్ జీ లకు రూ. 98.90 లక్షలు, ఇల్లంతకుంట మండలంలోని 951 ఎస్ హెచ్ జీ లకు రూ.145. 51 లక్షల వడ్డీ చెల్లించారు. జిల్లాలోని మొత్తం 8552 ఎస్ హెచ్ జీలకు రూ. 11 కోట్ల 77 లక్షల 52 వేల వడ్డీ తిరిగి పంపిణీ చేశారు.

*ఇందిరా మహిళా శక్తితో ఆదాయం

+బండారి స్వాతి, క్యాంటీన్ నిర్వాహకురాలు, ఇల్లంతకుంట
మాది ఇల్లంతకుంట. నాకు ఇద్దరు పిల్లలు. సంఘంలో చేరకముందు నా భర్త చేసే గీతా కార్మికుడు సంపాదనతో పిల్లల చదువు కుటుంబ పోషణ భారంగా ఉండేది. మూడేండ్ల క్రితం నా భర్త చనిపోయారు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.మూడు లక్షలు రుణం తీసుకొని క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్న. ఫుడ్ ఆర్డర్ పైన అవసరమైన వారికి వండి ఆదాయం పొందుతున్న. రుణ వాయిదాలు చెల్లిస్తూ పిల్లలను చదివిస్తూ సంతోషంగా ఉన్న. ఆర్థిక తోడ్పాటు అందించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులకు ధన్యవాదాలు.

*రెండు నెలల్లో 70 వేల ఆదాయం..

+గొట్టం కవిత, సోమారంపేట,ఇల్లంతకుంట మండలం

మాది ఇల్లంతకుంట మండలం సోమారంపేట. నేను సంఘంలో చేరక ముందు వ్యవసాయ కూలీ చేస్తూ బీడీలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాము. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ కూతురు వివాహం చేసాను. నా భర్త నేను కలిసి పౌల్ట్రీ పారం కొరకు లింకేజీ శ్రీ నిధి, వీఓ నుంచి కలిపి రూ. 2.50,000 లక్షల రుణం తీసుకుని షెడ్ నిర్మించుకుని బాయిలర్ కోళ్లను పెంచాము. ఇందిరా మహిళా శక్తి కింద రూ.మూడు లక్షల రుణం తీసుకొని 2500 ఒకరోజు కోడి పిల్లలు తెచ్చి ఐదు వారాలు పెంచి మండలంలో విక్రయించడం ద్వారా రెండు నెలల్లో రూ.70 వేల ఆదాయం పొందాము. మళ్ళీ 2500 కోడిపిల్లలను పెంచుతున్నాము. తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం పొందుతూ సంతోషంగా జీవిస్తున్నాము. మాకు అభివృద్దికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ సర్, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

*మరింత మందికి ఉత్తమ సేవలు అందించాలి

+సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల.
ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు ఎస్ హెచ్ జీ సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దేలా కృషి చేయాలి. మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెంది ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నిరంతరం మహిళలకి మద్దతుగా ఉండాలి. మరింత మందికి ఉత్తమ సేవలు అందించి ఉన్నత స్థానాలకు ఎదగాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -