– గతేడాది కంటే 1.47 శాతం పెరుగుదల
– బాలికలదే పైచేయి
– బాలుర కంటే 2.94 శాతం అధికం
– 4,629 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
– రెండు బడుల్లో సున్నా ఫలితాలు
– అగ్రస్థానంలో మహబూబాబాద్, అట్టడుగున వికారాబాద్
– జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
– ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ని రవీంద్రభారతిలో విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 91.31 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఇప్పుడు 1.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. పదో తరగతి పరీక్షలకు 5,07,107 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 4,96,374 మంది, ప్రయివేటు విద్యార్థులు 10,733 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,96,374 మంది పరీక్షలకు హాజరుకాగా, 4,60,519 (92.78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 2,50,345 మంది పరీక్షలు రాయగా, 2,28,608 (91.32 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 2,46,029 మంది పరీక్షలకు హాజరైతే 2,31,911 (94.26 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు 2.94 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది 10,733 మంది విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలకు హాజరుకాగా, 6,141 (57.22 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 7,336 మంది బాలురు హాజరైతే 4,045 (55.14 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 3,397 మంది బాలికలు పరీక్ష రాస్తే, 2,096 (61.70 శాతం) మంది పాసయ్యారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే బాలికలు 6.56 శాతం మంది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్) కేటగిరీ ఫలితాలను ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రకటించారు. 1,306 మంది విద్యార్థులు హాజరైతే 1,222 (93.57 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. వారిలో 774 మంది బాలురు పరీక్షలు రాయగా, 717 (92.64 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 532 మంది బాలికలు పరీక్షలు రాస్తే, 505 (94.92 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేష్‌షెట్కార్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రత్యేక కార్యదర్శి హరిత, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
4,629 బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి 4,629 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు గతేడాది కంటే ఈ ఏడాది 702 పెరిగాయి. ఈసారి రెండు ప్రయివేటు పాఠశాలల్లో సున్నా ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది ఆరు పాఠశాలల్లో ‘సున్నా’ ఫలితాలొచ్చాయి.
99.29 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ ప్రథమం
పదో తరగతి ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 8,184 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8,126 (99.29 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 99.09 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 22,374 మంది పరీక్షలు రాయగా, 22,170 (99.09 శాతం) మంది పాసయ్యారు. 98.81 శాతం ఉత్తీర్ణతను సాధించి జనగామ జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 6,234 మంది పరీక్షలు రాస్తే, 6,160 (98.81 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 73.97 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి వికారాబాద్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 12,846 మంది పరీక్షలు రాయగా, 9,502 (73.97 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఈ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతో చివరి స్థానంలో నిలిచింది. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఆ జిల్లా ఉత్తీర్ణత శాతం 8.87 శాతం పెరగడం గమనార్హం.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు 16
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడో తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అడాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లింపు గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉన్నది. రూ.50 ఆలస్య రుసుంతో పరీక్షలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లింపునకు అవకాశమున్నది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన పదో తరగతి విద్యార్థులు ఆ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు 15
పదో తరగతి విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసే గడువు ఈనెల 15 వరకు ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు తెలిపారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని కోరారు. విద్యార్థులు నేరుగా వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేయొచ్చని సూచించారు. వివరాల కోసం షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


