నవతెలంగాణ-హైదరాబాద్: నోయిడాలోని వైద్య విద్యార్థి ఆత్మహత్యపై ప్రియాంక గాంధీ స్పందించారు. లైంగిక వేధింపులతో దేశవ్యాప్తంగా బాలికలను చదువుల్లో నిరుత్సాహపరుస్తున్నారని ఆమె ఆవేదన వక్తం చేశారు. ఒడిశాలో బలవంతంగా బీఈడీ విద్యార్థి సూసైడ్ చేసుకునేలా చేశారని, అదే తరహాలో ఘటన నోయిడాలోని శారద యూనివర్సీటీలో చోటుచేసుకుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
“ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మన విద్యాసంస్థలు మన పిల్లలకు సురక్షితంగా లేవా? జీవితమే సురక్షితంగా లేని చోట వారు మెరుగైన జీవితం గురించి ఎలా కలలు కంటారు? జీవితంలోని ప్రతి దశలోనూ ముందుకు సాగడానికి బాలికలు రెండింతలు పోరాటాన్ని ఎదుర్కొంటారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా బాలికలను నిరుత్సాహపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి సంఘటనలను నివారించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని” ఆమె డిమాండ్ చేశారు.
ఒడిశాలో లెక్చరర్ లౌంగిక వేధింపులు భరించలేక బీఈడీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే తరహాలో అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు …. నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ రెండో సంవత్సరం చదువుతుంది. గత శుక్రవారం రాత్రి ఆమె క్యాంపస్‌లోని బాలికల హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోగా, తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.