Thursday, May 1, 2025
Homeప్రధాన వార్తలుతెలంగాణ ఇచ్చినందుకుకాంగ్రెస్‌ విలనా?

తెలంగాణ ఇచ్చినందుకుకాంగ్రెస్‌ విలనా?

– వరంగల్‌ సభలో నాపేరు కూడా పలకలేకపోయారు
– అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిద్దాం రండి..
– పదేండ్లు ప్రజలు మెచ్చే పాలన అందిస్తాం
– ఆగమైంది తెలంగాణ కాదు..ఆయన కుటుంబమే : కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
– బసవేశ్వరుడి బోధనలు నేటికీ అనుసరణీయం

నవతెలంగాణ-కల్చరల్‌
”పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్న మీకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనైందా?” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ బహిరంగసభలో కేసీఆర్‌ చేసిన విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై నిర్వహించిన సామాజిక సంస్కర్త బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దిలోనే
సమాజంలో అసమానతలు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన బసవేశ్వరుడి బోధనలు నేటికీ అనుసరణీయమని అన్నారు. బసవేశ్వరుడు వ్యక్తికి, సమాజానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన స్ఫూర్తితో పంచాయతీ రాజ్‌ పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రతి వ్యక్తీ గౌరవంగా జీవించే ప్రణాళికలు ప్రభుత్వాలు రూపొందించాలని అన్నారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అధికారంలో ఉన్న వారి నిర్ణయాలలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చేందుకే ప్రతిపక్షం ప్రయత్నించాలనీ, కానీ నేడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అలాంటి పాత్ర పోషించడం లేదని విమర్శించారు. ఇటీవల వరంగల్‌లో ఒకాయన సభ పెట్టి కాంగ్రెస్‌పై ద్వేషం వెళ్లగక్కారన్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము చేసిన మంచిని సభలో అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే ప్రజలు మెచ్చుకునేవారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు, వసతులు ఉపయోగించుకుంటున్న ఆయనకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా రూ.65 లక్షలు, వాహనాలు, పోలీస్‌ భద్రత తీసుకు న్నారని తెలిపారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాను.. మా పిల్లల్ని పంపామని చెబుతున్నారు.. పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు? సభకు రాని ప్రతిపక్ష నేతకు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయంటున్నారని, రైతుబంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయిందని ప్రశ్నించారు. తమరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలని ఎద్దేవా చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేషపూరిత ప్రసంగం చేశారని విమర్శించారు. అభివద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిద్దాం రండి.. అని సవాల్‌ విసిరారు. ప్రజలు విజ్ఞులని, ఎవరేం చేశారో వారికి తెలుసునని అన్నారు. పదేండ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తామన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టు కేసీఆర్‌ వరంగల్‌ వెళ్లారని, సభలో తన పేరు కూడా పలకలేకపోయారని అన్నారు. తెలంగాణ ఆగం కాలేదని, ఆయన కుటుంబమే ఆగమైందని తెలిపారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ సురేష్‌ షెట్కర్‌, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img