- Advertisement -
- ఐఐటి ఉన్నత విద్యాభ్యాసానికి రూ. 1 లక్షా 24 వేల 414 సాయం
-గొప్పతనాన్ని చాటిన ఎస్పీఎఫ్ ట్రస్ట్ సభ్యులు - నవతెలంగాణ – గంగాధర : మంచి ర్యాంకుతో ఐఐటి సీటు సొంతం చేసుకున్న ఓ పేదింటి బిడ్డ ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. చేజిక్కిన ఐఐటి ఉన్నత విద్యను అభ్యాసించాలనే సంకల్పం ఉన్నా, అడ్డంకిగా మారిన ఆర్థిక వనరులను ఎస్పీఎఫ్ ట్రస్ట్ సభ్యులు సమకూర్చి విద్యా కుసుమాన్ని విరబూసేలా చొరవ చూపిన తీరు ఇది. వివరాల్లోకి వెళితే.. గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామానికి చెందిన బొల్లబత్తిని శుభచరణ్ అనే విద్యార్థి మంచి ర్యాంకుతో ఐఐటి సీటు సాధించాడు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన బొల్లబత్తిని పద్మ, చంద్రమౌళి దంపతుల కుమారుడైన శుభచరణ్ ఐఐటి సీటు సాధించాననే సంతృప్తి లేకుండా, ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక వనరులు అడ్డుగా మారాయి.
- పొద్దంతా కష్ట పడితేనే పొట్ట గడువని దయనీయ స్థితిలో ఉన్న శుభచరణ్ తల్లిదండ్రులు ఐఐటి చదివించలేని నిత్సాహయ స్థితిలో ఉన్నారు. ఫీజు చెల్లింపు చేసి ఐఐటిలో చేరే సమయం దగ్గర పడుతున్నా, అంత డబ్బు వెచ్చించే ఆర్థిక స్థోమత లేక శుభచరణ్, అతని తల్లిదండ్రులు నిరాశ, నిస్పృహలో పడ్డారు. దీంతో చీకటిని చీల్చే చిరు దీపంలా కొందరు మిత్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాతో శుభచరణ్, అతని తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాసంస్థల సంయుక్త సంచాలకులు శ్యాం ప్రసాద్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ (ఎస్పీఎఫ్ ట్రస్ట్) చైర్మన్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన శ్యాం ప్రసాద్ లాల్ తన మిత్ర బృందంకు విషయాన్ని వివరించగా, ఎస్పీఎఫ్ ట్రస్ట్ సభ్యులు ఏకమై బొల్లబత్తిని శుభచరణ్ ఐఐటి ఉన్నత విద్యకు అవసరమైన 1 లక్షా 24 వేల 414 రూపాయలను జమ చేసి అందించారు.
అంతటితో ఆగని ఎస్పీఎఫ్ ట్రస్ట్ సభ్యులు మంచి ర్యాంకుతో ఐఐటి సీటు సాధించిన బొల్ల బత్తిని శుభచరణ్ ను శాలువా కప్పి బోకే అందించి ఘనంగా సన్మానించారు. ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, గ్రామానికి, మంచి పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాసంస్థల సంయుక్త సంచాలకులు శ్యాం ప్రసాద్ శ్యాం ప్రసాద్ లాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో శ్యాం ప్రసాద్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ గోనె శ్రీనివాస్, హౌసింగ్ కార్పొరేషన్ పీడి సోమ రాజేశ్వర్, ఎస్పీఎఫ్ ట్రస్ట్ సభ్యులు జెట్టి సంపత్, చేరాల మల్లికార్జున్ దేవ్, మనోహర్, శరత్ చంద్ర, కృష్ణ గోపాల్ పాల్గొన్నారు.
- Advertisement -