– 14 మంది మృతి..ఊపిరాడకపోవటంతోనే
– మరో 13 మందికి తీవ్ర గాయాలు..రితురాజ్ హోటల్‌లో ఘటన
– ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, పీఎం తీవ్ర విచారం
– దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుర్దా బజార్‌లోని మెచ్చుపట్టి రితురాజ్ హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 మందిని డిశ్చార్చ్ చేశారు. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, హోటల్ అంతా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఊపిరాడని కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. మృతుల్లో 8 మందిని గుర్తించినట్టు కోల్‌కతా పోలీసులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమిటో తెలియరాలేదు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. హోటల్లో బస చేస్తున్న పలువురు ప్రాణాలు కాపాడుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు. పలువురు హోటల్ కిటీకీలను పగులగొట్టి బయట పడేందుకు యత్నించారు. మరికొంతమంది మాత్రం బయట పడే అవకాశం లేకపోవటంతో గదుల్లో అలాగే ఉండిపోయారు. వీరిలో పలువురు ఊపిరి ఆడక చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. హోటల్ కారిడార్లలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అదే సమయంలో కరెంట్ కూడా పోవటంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు.
రంగంలోకి పదికి పైగా ఫైరింజన్లు
అగ్ని ప్రమాద విషయం తెలియగానే మంటలు ఆర్పేందుకు పదికి పైగా ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. హోటల్‌లో చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తనవంతు కృషి చేసింది. పలువురిని ప్రమాద బారి నుంచి బయటపడేసింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు పది గంటల పాటు శ్రమించింది. ప్రమాదం జరిగిన సమయంలో 42 గదుల్లో సుమారు 88 మంది ఉన్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. బుధవారం ఉదయం మంటలు అదుపులోకి వచ్చాయి. రితురాజ్ హోటల్‌లో తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తాయి. దీంతో ఎక్కువ మంది ఈ హోటల్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి ఈ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో 14 మంది వరకు చనిపోయారు.
దర్యాప్తునకు సీఎం ఆదేశం
ఈ అగ్నిప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం నుంచి బాధితులను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులను ఆమె అభినందించారు.
రాష్ట్రపతి, ప్రధాని విచారం
కోల్‌కతా అగ్నిప్రమాద ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం చాలా బాధాకరమని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని మోడీ తెలిపారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందనున్నది.
కోల్‌కతాలోభారీ అగ్నిప్రమాదం
- Advertisement -