Monday, July 21, 2025
E-PAPER
Homeమానవిఅలాంటి వాళ్లతో జాగ్రత్త

అలాంటి వాళ్లతో జాగ్రత్త

- Advertisement -

పియ్రమైన వేణు గీతిక…
నాన్న ఎలా ఉన్నావు? ఆఫీస్‌కు నాలుగు రోజులు సెలవులు వస్తే రెండు రోజులు రెస్టు తీసుకుని, ఒకరోజు స్నేహితురాలి ఇంటికి, మరో రోజు దగ్గరలోని చారిత్రాత్మక కట్టడం చూసి, అలాగే సినిమాకి కూడా వెళ్లానని చెప్పావు. చాలా సంతోషం. ఇలా చక్కగా జీవితాన్ని అనుభవించాలి. కొత్త విశేషాలు తెలుసుకోవాలి.
ఇక ఈ ఉత్తరం ద్వారా నీకు చెప్పదలచింది ఏమిటంటే ఇంతకు ముందు నీకు విభిన్న మనస్తత్వం గల వ్యక్తుల గురించి చెప్పాను. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. కొందరు స్నేహితులు కుటుంబాలతో కలిసి ఎక్కడికైనా సరదాగా వెళదాం, లేదా ఏదైనా మంచి హోటల్‌కి వెళ్దాం అంటారు. సరే అందరూ హోటల్‌కి వెళ్తారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తెప్పించుకుని తింటారు. ఇంత వరకు బాగానే ఉంటుంది. డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం, మీరు కట్టేయండి అని చెప్తారు. ఆహ్వానించింది ఎవరో వాళ్లే డబ్బులు చెల్లించాలి. ఇలా జరిగినప్పుడు ఎదుటి వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించు.
ఇంకొందరు ఉంటారు.. వేరే ఊరు నుంచో, రాష్ట్రం నుంచో వస్తారు. స్నేహితులు ఉన్నారు కదా అని అక్కడ బస చేస్తారు. అలా రావడంలో తప్పులేదు. స్నేహితులకు చాలా రోజుల తర్వాత కలిస్తున్నందుకు సంతోషమే. అయితే వీళ్ళు తమ జేబులోంచి ఒక్క రూపాయి తీయరు. ఇటువంటి వ్యక్తిని నేను గత 27 ఏండ్లుగా చూస్తున్నాను. మీ నాన్న ఫ్రెండ్‌ వేరే రాష్ట్రం నుండి వస్తారు, మన ఇంట్లోనే దిగుతారు. వచ్చినందుకు బాధలేదు. అయితే అతని ప్రతి ఖర్చు నాన్నే పెట్టుకుంటారు. ఆఖరికి బస్‌ టికెట్‌ లేదా ఆటో ఖర్చుతో సహా. పోనీ అతను ఏమైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడా అంటే అవీ లేదు. కాంట్రాక్టర్‌గా బాగానే సంపాదించుకున్నాడు. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. తనకు ఏదైనా అవసరం అయితే వాళ్లకు చెప్పి చేయించుకుంటాడు. విమానాల్లో తిరుగుతాడు. అటువంటి వ్యక్తి ఒకరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించాలి కదా!
అతను కారు కావాలంటే మీ నాన్న ట్యాంక్‌ మొత్తం పెట్రోల్‌ నింపి ఇచ్చేవారు. అతను హాయిగా వాడుకుని తెచ్చి ఇచ్చేవాడు. చిన్నపిల్లవు నువ్వు ఉన్నావు కాదా ఒక చాక్లెట్‌ కానీ, బిస్కెట్‌ కానీ తెచ్చేవాడు కాదు. అతను ఇస్తేనే తింటామని కాదు, ఒక ఫార్మాలిటి ఉంటుంది కదా! నేను చాలా విసిగి పోయేదాన్ని, లేని వాళ్లకు పెట్టొచ్చు, అన్నీ ఉన్న వాళ్లకు ఎందుకు పెట్టాలి? ఒక సారి రెండు సార్లు కాదు. లెక్కలేనన్ని సార్లు. మళ్ళీ మనం ఏదైనా మాట సాయం అడిగినా చేయడు. వీళ్ళనే మంది మీద బతకడం అంటారు. ఇలాంటి వాళ్ళను అసలు దగ్గరకు రానివ్వకూడదు. మనిషి నైజం తెలిసిన తర్వాత దూరంగా ఉంచడం మంచిది. నీకు ఇప్పటికే కొందరు ఎదురై ఉంటారు. ముందు ముందు ఇలాంటి వాళ్ళు ఎందరో తారసపడతారు నాన్న.. మొహమాటానికి పోయి ఇబ్బందులు పడవద్దు. ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలి. అప్పుడే ఏ బాంధవ్యమైనా చిరకాలం ఉంటుంది. కొంతవరకే ఖర్చును భరించాలి. మొత్తం మన మీద వేసుకోకూడదు. వుంటాను మరి. జాగ్రత్తగా ఉండు.
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -