Monday, July 21, 2025
E-PAPER
Homeమానవిపేద పిల్ల‌ల ఆశాదీపం సౌఖ్య‌

పేద పిల్ల‌ల ఆశాదీపం సౌఖ్య‌

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పేదింటి అమ్మాయి. తాను పాఠశాల కళాశాల స్థాయిలో ఎదుర్కొన్న కష్టాలు నేటితరం పిల్లలకు రాకూడదనుకుంది. అదే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఆమే చీకట్లో చిరు దీపంలా వెలుగులు పంచుతున్న విశ్వనాథుల మౌనిక. నేటితరం యువతకు ఆదర్శం ఆమె. చదువుకు పేదరికం అడ్డు కాదని తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ‘సౌఖ్య’ అనే సంస్థను నిర్వహిస్తోంది. దీని ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
మౌనిక నల్గొండ జిల్లా నకిరేకల్‌ పట్టణానికి చెందిన విశ్వనాధుల వజ్రాచారి, రమాదేవి దంపతులకు జన్మించింది. నకిరేకల్‌ జెడ్సీ హైస్కూల్లో చదువుకుంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నప్పటినుండే చదువులో ఆరితేరింది. సామాజిక స్పృహను ఒంట పట్టించుకున్నది. చిన్నతనంలోనే మహిళా సమస్యలపై కవితలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందుకుంది. బాసర ఐఐఐటిలో ఇంజనీరింగ్‌ చదువుకున్నది. ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అగ్లోటెక్‌లో పని చేస్తోంది. కౌమార బాలికలకు రుతుసంబంధ అంశాలపై అవగాహన కల్పించడానికి ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నది. సమాజ సేవలో యువత గొంతు, బాలికల ఆరోగ్య రక్షణకు నూతన దిశగా అడుగులు వేస్తుంది.

ఎదుగుదలకి అడ్డుగోడలు
ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా పీరియడ్స్‌ అనే మాట చెప్పడానికే ఎంతోమంది బాలికలు వెనకడుగు వేస్తున్నారు. అవగాహన లోపం, అందుబాటులో లేని హైజీన్‌ ఉత్పత్తులు ఇవే లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల బాలికల ఎదుగుదలకి అడ్డుగోడలు. అలాంటి సామాజిక సమస్యలపై ఒక్క అమ్మాయి తన గొంతు వినిపించి, ఉద్యమంగా మార్చిన కథే ‘సౌఖ్య’ సంస్థ. ప్రస్తుతం నకిరేకల్‌ మండలంలోని నకిరేకల్‌, చందుపట్ల, మంగళపల్లి, తాటికల్‌ గ్రామాలలోని పాఠశాలల్లో బాలికలకు సానిటరీ నాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నది. ఇది కేవలం ఒక రోజుకు పరిమితం కాదు. ఏడాదికి రెండు సార్లు పంపిణీ, పూర్తి అవగాహన కార్యక్రమాలతో బాలికల్లో ఆరోగ్యం, శుభ్రత, స్వీయ గౌరవంపై చైతన్యం నింపుతుంది. ‘పీరియడ్స్‌ తప్పుడు మాట కాదు. అది జీవన చక్రం’ అనే వాస్తవాన్ని నల్గొండ జిల్లా గ్రామాల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రతి ఏడాది మరికొన్ని పాఠశాలలను అదనంగా చేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది మౌనిక. ‘సానిటరీ నాప్కిన్స్‌ ఇవ్వడమంటే అవగాహన కల్పించే ఉద్యమం’ అంటోంది మౌనిక.

ఉద్యమానికి ప్రేరణ ఇలా
ఆడపిల్లల్లో కౌమారదశలో ఆరోగ్యపరమైన అవగాహన కలిగించాలన్న ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటని అడిగితే ‘నాకు ఈ ఆలోచన రావడానికి మొదటి సంఘటన, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక రోజు బ్లీడింగ్‌ ప్రారంభమైంది. అప్పట్లో నా ఫ్రెండ్స్‌ అందరూ కలిసి ‘ఇలా దాచుకో’, ‘అలా దాచుకో’ అంటూ నన్ను క్లాస్‌ నుండీ రూమ్‌ వరకు పంపించారు. నేను అంబ్రెలా వేసుకుని వచ్చాను. బ్లీడింగ్‌ ఎప్పుడు వస్తుందో మనకు ముందుగా తెలియదు. హఠాత్తుగా వస్తుంది. అలాంటి సమయంలో క్లాస్‌ దగ్గరే నాప్కిన్స్‌ ఉండటం ఎంత అవసరమో అర్థమయింది. కానీ ఆ రోజున నాకు అవి అందుబాటులో లేవు. అందుకే నేను రెండు కిలోమీటర్లు ఆ ఇబ్బంది తోనే, దాచుకుంటూ, చాలా కష్టపడి నడిచి రూంకి వచ్చాను. రూంకి వచ్చి కుమిలి కుమిలి ఏడ్చేశాను. అలా చాలాసేపు ఏడ్చాను. అప్పుడే ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ‘ఎందుకు నేను దాచుకోవాలి? ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి?’ ఇది భూమ్మీద పుట్టిన ప్రతి అమ్మాయి అనుభవించే ప్రక్రియ కదా. అయినప్పటికీ నేను ఎందుకు ఇలా బాధపడాలి? అని. మా ఇంట్లో అలాంటి వాతావరణం కాదు. వారు నాకు స్వేచ్ఛనిచ్చారు, దాచుకోవాలనే అవసరం ఎప్పుడూ లేకుండా చూశారు. కానీ బయట ప్రపంచంలోని మనుషులను చూసినప్పుడు చాలా బాధేసింది. అప్పుడే నాకు అనిపించింది ఇలాంటివి ఎవ్వరూ అనుభవించకూడదు. దీని గురించి మాట్లాడాలి. అమ్మాయిలకు చెప్పాలి. అబ్బాయిలకు కూడా తెలియాలి. ఇది బహిరంగంగా చర్చించదగ్గ విషయం. తప్పకుండా ఒకరోజు చిన్న వయసు నుండే పిల్లలు తెలుసుకునేలా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటున్న మౌనిక తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది.

బాలికలకు గౌరవం సమాజానికి మార్గదర్శనం
కాలేజ్‌ ముగిసాక, ఉద్యోగంలో చేరాక, ఆర్థిక స్వతంత్రత వచ్చాక ఆ ఆలోచనే సౌఖ్య అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు కారణమైంది. ఈ సంస్థ ఏర్పాటుకు ముందే కాలేజీ విద్య తర్వాత చైల్డ్‌ ఫండ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ బాలల ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, ఎయిడ్స్‌ అవగాహనపై విస్తృతంగా సేవలు అందించింది. ‘పీరియడ్స్‌ విషయంలో మౌనంగా ఉండకూడదు’ అని నినదిస్తోంది మౌనిక. ‘సౌఖ్యత అందరి హక్కు, ‘సౌఖ్య’ బాధ్యత అదే!’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నది. ఈ ఉద్యమం నేడు నలుగురికి స్పూర్తి, రేపటి తరం బాలికలకు ఆశ. ఈ ఉద్యమంలో మౌనికతో పాటు ఆమె ప్రియ మిత్రులు సాయిచరణ్‌, సృజన, సిద్ధార్థ్‌, సంజరు కలిసివస్తున్నారు. అలాగే మరికొంతమంది యువత ఆమెతో అడుగులు వేస్తున్నారు. ఈ ఉద్యమానికి బలమైన మద్దతు అందిస్తున్నది మౌనిక పని చేస్తున్న సంస్థ అగ్లోటెక్‌, శ్రీపాద్‌ నందన్‌ అనే ఒక ఎంట్రప్రెన్యూర్‌, ‘వాయుసేవ’ అనే మరొక అనుబంధ స్వచ్ఛంద సంస్థ స్థాపకులు. వీరి సహకారంతో ‘సౌఖ్య’ మరింత ముందుకు సాగుతోంది.

రచయిత్రిగా…
పాఠశాల స్థాయిలోనే చిన్న చిన్న గేయాలు, కథలు, వ్యాసాలు రాసిన మౌనిక అనంతరం రచనను తన ప్రవృత్తిగా మార్చుకున్నది. తన అనుభవాలన్నిటినీ సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యంగా మార్చి Abuse, Menstrual Health, Rape Awareness అవరర వంటి అంశాలపై పదునైన వ్యాసాలు రాస్తూ వేలాది మందికి స్పూర్తి ఇచ్చింది. ఆమె రచనలు రెండు అంతాలజీలు – Melodies & Harmonies, Sound of Silence పేరుతో ప్రచురితమయ్యాయి. ఇది ఒక యువతి చూపిన మార్గం కాదు, ఒక తరాన్ని మార్చే తపనకు ప్రతీక. ఇది ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా మారుతోంది. బాలి కలు ఆత్మ న్యూనతకు గురి కాకుండా అభిమా నం పొందే సమాజం కోసం, ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం గొప్ప మార్పుకి నాంది పలుకుతుందనడంలో అతిశయోక్తి లేదు.
– డాక్టర్‌ సాగర్ల సత్తయ్య, 7989117415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -