సమర్పించిన స్వతంత్ర నిపుణుల కమిటీ
సీఎం రేవంత్‌తో కమిటీ చైర్మెన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి బృందం భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తన 300 పేజీల నివేదికను సమర్పించింది. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సీఆర్ హెచ్‌ఆర్‌డీ)లో కమిటీ చైర్మెన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కుల గణన అనేది శాస్త్రీయంగా, నిర్దిష్టంగా, వాస్తవాల ఆధారంగా జరిగిందని ఈ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. ఇది చారిత్రాత్మకమని, దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొంది. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ…కుల గణన అనేది కేవలం ఒక డేటా కాదనీ, అది తెలంగాణకు మెగా హెల్త్ చెకప్ లాంటిదని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఈ సర్వేను చేపట్టామని తెలిపారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు నివేదిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, అందుకుగల కారణాలపై అధ్యయనం చేయాలంటూ నిపుణుల కమిటీని ఆయన కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి, సరైన సూచనలు, సలహాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాటి ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను, సూచనలను మంత్రివర్గంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది.
కులగణనపై ప్రభుత్వానికి 300 పేజీల నివేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES