Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపట్టు వదలని అమెరికా

పట్టు వదలని అమెరికా

- Advertisement -

జీఎం విత్తనాలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌
వాహన, స్టీల్‌పై సుంకాలు తగ్గించండి : భారత్‌
ముగిసిన వాణిజ్య చర్చలు
వాషింగ్టన్‌ :
తమ జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలను భారత్‌లోకి అనుమతించాల్సిందేనని అమెరికా తన డిమాండ్‌ పట్ల పట్టువీడటం లేదు. పారిశ్రామిక, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఆపిల్స్‌, బాదం తదితర వాటిపై సుంకాలను తగ్గించాలని కోరుతోంది. వాషింగ్టన్‌లో భారత్‌ – అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం నాలుగు రోజుల పాటు జరిగిన ఐదో దశ చర్చలు జులై 17న ముగిశాయి. ఆగస్టు 1లోపు తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ఉద్దేశంతో ఈ సమావేశాలు జరిగాయి. భారత్‌ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ నేతృత్వ్యం వహించారు. ఈ చర్చల్లో మొక్క జొన్న, సోయాబిన్‌లకు సంబంధించిన జన్యు మార్పిడి విత్తనాలను, పాలు, పాల ఉత్పత్తులు, జీఎం పశుగ్రాసాన్ని భారత్‌లోకి అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఆటోమొబైల్స్‌, స్పెషల్‌ కెమికల్స్‌, ఎక్విప్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీస్‌ అంశాలు చర్చకు వచ్చినట్టు రిపోర్టులు వస్తోన్నాయి. భారత్‌ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న స్టీల్‌పై వేస్తోన్న 50 శాతం, వాహనాలపై వేస్తోన్న 25 శాతం సుంకాలను రద్దు చేయాలని ఇండియా కోరుతుంది. అదే విధంగా టెక్స్‌టైల్స్‌, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, దుస్తులు, ప్లాస్టిక్స్‌, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్ల వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని డిమాండ్‌ చేసింది.

”ఈ దశ చర్చలు షెడ్యూల్‌ ప్రకారం ముగిశాయి. వ్యవసాయం, ఆటోమొబైల్స్‌లో సుంకాల తగ్గింపునపై దృష్టి సారించాం. రానున్న రోజుల్లో వర్చువల్‌ చర్చలు కొనసాగవచ్చు. భారత్‌పై ట్రంప్‌ పూర్తిగా సుంకాలను ఉపసంహరించుకోకపోవచ్చు. అయితే.. వియత్నాం, ఇండోనేషియా తరహాలో సుంకాల రేటును తగ్గించే అవకాశం ఉంది.” అని ఓ అధికారి పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్‌ ముగింపు నాటికి మొదటి వాణిజ్య దశను పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2న భారత ఎగుమతులపై 26 శాతం టారిఫ్‌లు విధించారు. జులై 9 నాటికి తాత్కాలిక ఒప్పందం కుదరకపోవడంతో ఆ గడువును ఆగస్టు 1 వరకు పొడిగించారు. ”భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుంది. ఒప్పందంలో 30 శాతం, 25 శాతం, 20 శాతం టారిఫ్‌లను విధిస్తాం.” అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది 2025 ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అమెరికాకు భారత్‌ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఆదేశం నుంచి దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -