Friday, May 2, 2025
Homeరాష్ట్రీయంకార్మికులకు సీఎం రేవంత్‌ రెడ్డి మే డే శుభాకాంక్షలు

కార్మికులకు సీఎం రేవంత్‌ రెడ్డి మే డే శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందనీ, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులనీ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహద పడుతుందని తెలిపారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మే డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్‌ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ ఫాం వర్కర్స్‌ సంక్షేమ బిల్లు-2025 త్వరలో తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతుందని తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏండ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్‌ చెల్లించామన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్‌ ఇవ్వడంతో పాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.కోటిబీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. చేనేత కార్మిక కుటుంబాలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img