– సందర్శకుల అవసరాలకే పెద్దపీట
– పూజారుల అభిప్రాయాలు తీసుకుంటాం :
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణపై సమీక్షలో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా మేడారంలో ఆధునీకరణ పనులు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. భక్తుల అవసరాలకు పెద్దపీట వేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో పూజారుల అభిప్రాయాలు తీసుకుంటామని హామీనిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివాసీ సాంప్రదాయాలకు, పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణ ఆధునీకరణపై మంత్రి సీతక్క సమీక్షించారు. భక్తుల సౌకర్యాల కోసం, ఆలయ పరిసరాల అభివృద్ధి కోసం చేపట్టబోయే మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆధునీకరణ పనుల ప్రణాళికపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా, మంత్రి సీతక్క పలు మార్పులను సూచించారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల్లో మార్పుల్లేకుండా ఆలయ ఆవరణలో చేపట్టాల్సిన ఆధునీకరణ పనులపై పలు సూచనలు చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన వసతుల కల్పనకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయనీ, భక్తుల సౌలభ్యం కోసం ఘాట్లను నిర్మిస్తామని తెలిపారు. వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసి, పూజారుల ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. భక్తుల కోసం మరిన్ని వసతులు కల్పించేందుకు కుంభమేళా లాంటి పెద్ద ఉత్సవాలలో వసతులు కల్పించిన ఏజెన్సీలను సంప్రదించి వారి సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. మేడారానికి వెళ్లే అన్ని మార్గాల్లో ఆదివాసీ పోరాట యోధుల విగ్రహాలు, చిహ్నాలను ప్రతిష్టిస్తామన్నారు. వచ్చే మేడారం జాతర లోపు పూర్తి చేయాల్సిన పనులపై మొదట దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖ డైరెక్టర్ జి. సజన, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఎన్‌పీడీసీఎల్ సీిఎండి వరుణ్ రెడ్డి, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, మిషన్ భగీరథ ఎన్‌సీ కృపాకర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా మేడారం ఆధునీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES