– పెరిగిన మొండి బాకీలు
– క్యూ1 లాభాల్లో తగ్గుదల
న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు నిరాశపర్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.31 శాతం తగ్గుదలతో రూ.16,258 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,475 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం 83,701 కోట్లుగా నమోదు కాగా.. గడిచిన క్యూ1లో ఏకంగా రూ.99,200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. క్రితం క్యూ1లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం వ్యయం రూ.63,467 కోట్లకు చేరింది. 2024-25 ఇదే క్యూ1లో రూ.59,817 కోట్ల వ్యయాలు చోటు చేసుకున్నాయి. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.14,442 కోట్లు కేటాయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.2,602 కోట్ల కేటాయింపులతో పోల్చితే భారీగా పెంచాల్సింది. 2024 జూన్ ముగింపు నాటికి 0.47 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు.. 2025 జూన్ 30 నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.4 శాతానికి పెరిగాయి. స్థూల అడ్వాన్సులు 6.7 శాతం పెరిగి రూ.26.53 లక్షల కోట్లకు, డిపాజిట్లు 16.2 శాతం వృద్ధితో రూ.27.64 లక్షల కోట్లకు చేరాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో 16 శాతం వృద్ధి
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు పెరిగాయి. 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 15.5 శాతం వృద్ధితో రూ.12,768 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,059 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.19,553 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ1లో 10.6 శాతం పెరిగి రూ.21,635 కోట్లకు చేరింది. ఏడాదికేడాదితో పోల్చితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.15 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గాయి.
యెస్ బ్యాంక్‌కు ఎన్‌ఐఐ మద్దతు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూన్‌తో ముగిసిన ప్రథమ త్రైమాసికం (క్యూ1)లో యెస్ బ్యాంక్ నికర లాభాలు 59 శాతం పెరిగి రూ.801 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.502 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. గడిచిన క్యూ1లో ఈ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 5.7 శాతం పెరిగి రూ.2,371.5 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల ఎన్‌పిఎలు 1.6 శాతం, నికర ఎన్‌పీఏలు 0.3 శాతంగా నమోదయ్యాయి.
నిరాశపర్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- Advertisement -
- Advertisement -