– తాత్కాలిక పోలీస్ శిబిరం ఏర్పాటు
– తొమ్మిదో రోజు ఉత్కంఠభరితం
– హెలికాప్టర్ల సాయంతో కర్రెగుట్టను కబ్జా చేస్తున్న జవాన్లు
-మావోయిస్టులపై సమగ్ర రణరంగం ప్రారంభం: పోలీసులు
నవతెలంగాణ-చర్ల
యుద్ధ భూమిగా మారిన కర్రెగుట్టలపై 9వ రోజు బుధవారం భద్రతా బలగాలు హెలికాప్టర్ సహకారంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కర్రెగుట్టలపై క్షణక్షణం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ సమయంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 150 మందు పాతరలను ఇప్పటికే కనిపెట్టి నిర్వీర్యం చేశాయి. మావోయిస్టుల సంస్థ ప్రధాన కార్యకలాపాలు కర్రెగుట్టల నుంచే జరుగుతున్నాయని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. మావోయిస్టులపై సమగ్ర రణరంగం ప్రారంభమైందని, వారు అంతమయ్యే దాకా ఆగదని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో గుట్టలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఏప్రిల్ 22 నుంచి దేశ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌గా ఈ చర్య కొనసాగుతోంది. కర్రెగుట్ట, దుర్గమ్‌గుట్ట, పూజారి కాంకేర్ వంటి కొండల పరిసర ప్రాంతాలు కలిపి దాదాపు 280 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల నేతలు హిడ్మా, దేవా, దామోదర్, వికాస్, సుజాత, ఆజాద్ లాంటి వారు ప్రధాన స్థావరంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 1500 నుంచి 2000 మంది మావోయిస్టులు ఆధునిక ఆయుధాలతో మోహరించినట్టు సమాచారం. వీరు అమర్చిన ఐఇడీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి డీఆర్‌జీఎఫ్ సీఆర్పీఎఫ్ కోబ్రా, బస్తర్ ఫైటర్స్‌కు చెందిన దళాలు మొత్తం 10 వేలకుపైగా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజరు శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టుల నిర్మూలన దిశగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని, 18 నెలల్లో బస్తర్ ప్రాంతంలో 350 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు తెలిపారు. రాష్ట్రం తరఫున కేంద్రానికి పలు నివేదికలు సమర్పించామని చెప్పారు. మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిస్తూ, శాంతి చర్చల ప్రతిపాదనలను నిరాకరించారు.
కర్రెగుట్టలపై త్రివర్ణ పతాకం
- Advertisement -