నవతెలంగాణ-హైదరాబాద్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్న పార్టీలు, వాటి గుర్తులు, ఫ్రీ సింబల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొన్ని గుర్తుల కేటాయింపు పై క్లారిటీ ఇచ్చింది. ఈసీ ప్రకటించిన 36 ఫ్రీ సింబల్స్ జాబితాలో మూడు కారును పోలిన కెమెరా, చపాతి రోలర్, ఓడ గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు కారును పోలి ఉన్నాయని, ఫ్రీ సింబల్స్ జాబితాలో అవి లేకుండా చూడాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈసీ విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో ఆ గుర్తులు సైతం ఉండటం గమనార్హం.
ఎన్నికల సంఘం ప్రకటించిన ఫ్రీ సింబల్స్ జాబితాలో కారును పోలిన కెమెరా, చపాతి రోలర్, ఓడ గుర్తులు ఉండడం పై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అభ్యంతరం చెబుతున్నా.. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఈ సింబల్స్ వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్ది ఓట్లతో గెలుపు ఓటములు తారుమారవుతాయని, ఈ మూడు సింబల్స్ వల్ల నష్టం తప్పదేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈసీ నివేదిక ప్రకారం 11 గుర్తింపు పొందిన పార్టీలు, మరో 68 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల జాబితాలో జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం ఉన్నాయి. గుర్తింపు పొందిన జాతీయ పార్టీల కేటగిరిలో బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉండగా.. ప్రాంతీయ పార్టీల జాబితాలో బీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ, వైసీపీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, సీపీఐ, జనసేన పార్టీ ఉన్నాయి. రిజిస్టర్ అయిన పార్టీలు మొత్తం 68 ఉన్నాయి. వీటికి ఫ్రీ సింబల్స్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తింపు లేని పార్టీలతో పోటీ చేసే వారితో పాటుగా ఇండిపెండెంట్లకు ఫ్రీ సింబల్స్ కేటాయించే అవకాశం ఉంది.